Sky OV: సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించే విమానాలు నిజంగా రాబోతున్నాయట!

డిజైనర్‌ ఆస్కార్‌ వినల్స్‌ సరికొత్త విమానాల (Supersonic Plane) రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. వాటి వేగం, రూపం, సామర్థ్యం అసాధారణంగా ఉండబోతోందని ఆయన ప్రకటించారు. 

Published : 05 Nov 2023 18:18 IST

Image: oscarvinals11

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమానం (Supersonic Plane).. ఈ పేరు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ సుపరిచితమే. పల్లె, పట్టణం అనే తేడా అది గాల్లో ప్రయాణిస్తూ ఎప్పుడో ఒకసారి వారి కంటపడే ఉంటుంది. అలా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్న విమానాల ఆకృతి, వేగం త్వరలో మారనుందట. అవి చూడటానికి అచ్చంగా సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాల్లో చక్కర్లు కొట్టే విమానాలను పోలి ఉంటాయని బార్సిలోనాకు చెందిన డిజైనర్‌ ఆస్కార్‌ వినల్స్‌ చెబుతున్నారు. ‘స్కై ఓవీ’ అని వాటికి పేరు పెట్టానని.. వాటితో విమానయాన రంగంలో ఓ విప్లవం రాబోతోందని ఆయన చెప్పారు. 

ఈ కొత్త తరహా విమానాలు ఎలా ఉంటాయో తెలిపేందుకు వినల్స్‌ కొన్ని ఊహాజనిత చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘రాబోయే తరం వాణిజ్య విమానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయి. వాటి ఫ్యూజ్‌లేజెస్‌, ఇంజిన్లు, ఇంధన మూలాలు, ఇతర వైమానిక వ్యవస్థలన్ని ఇవాళ మనం చూస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు నిజమైతే ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటాయని’ వ్యాఖ్యానిస్తూ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. 

క్రిమియాలోని షిప్‌యార్డ్‌పై ఉక్రెయిన్‌ దాడి.. ఓ అత్యాధునిక నౌక ధ్వంసం..!

ఆస్కార్‌ వినల్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తరహా విమానాలను బ్లేడ్‌లెస్‌ టర్బోజెట్‌ ఇంజిన్లతో రూపొందిస్తున్నారు. వాటిలో కూర్చొని 300 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. సరకులను తీసుకెళ్లవచ్చు. ప్రతి సీటు వద్ద, విమానం అంతటా కొన్ని లగ్జరీ డివైజ్‌లను అమర్చనున్నారు. ఇక ‘స్కై ఓవీ’ టాప్‌ స్పీడ్ మాక్‌ 1.5. అంటే గంటకు 1150 మైళ్లు అవలీలగా ప్రయాణిస్తుంది. అతి తక్కువ హైడ్రోజన్‌ ఇంధనాన్ని వినియోగించుకొని సుదీర్ఘ దూరాలను చేరుకుంటుంది. వీటి కారణంగా ఎలాంటి కర్బన ఉద్గారాలు కూడా వెలువడవు. ఈ విమానాలను ఎయిర్‌పోర్టులో పార్క్‌ చేసిన తరువాత దాని రెక్కలను మూసుకుపోయేలా కూడా చేయొచ్చు. అందువల్ల తదుపరి ప్రయాణం ప్రారంభించేంత వరకు విమానాశ్రయంలోని స్థలాన్ని ఆదా చేసుకోవచ్చు.

ఈ భవిష్యత్‌ విమానాల ఇంజిన్లు చాలా తేలికగా ఉంటాయని వినల్‌ కంపెనీ వెబ్‌సైట్‌ పేర్కొంది. నిశ్శబ్దంగా కదులుతూనే అవి మరింత సమర్థవంతంగా ప్రయాణిస్తాయని తెలిపింది. ‘ప్రస్తుతం ఉన్న విమాన ప్రయాణాల కంటే వీటిలో ప్రయాణం చాలా భిన్నంగా ఉంటుంది. విశాలమైన స్థలం, ప్రత్యేకమైన వస్తువులు, లగ్జరీ వసతులు.. తదితర సౌకర్యాలుంటాయి. మా విమానాల డిజైన్‌పై కొనసాగుతున్న పరిశోధనను వినియోగించి కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాం. దాంతో భవిష్యత్తులో అద్భుతమైన విమాన ఆవిష్కరణలు సృష్టిస్తామని’ వెల్లడించింది. 

గతంలో ఇదే డిజైనర్‌ కంపెనీ ఓ ‘ఊహాజనిత విమానం’ గురించి ప్రకటించింది. అందులో కూర్చొని న్యూయార్క్‌ నుంచి లండన్‌కు కేవలం 80 నిమిషాల్లోనే ప్రయాణం పూర్తి చేయొచ్చని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి ‘హైపర్‌ స్టింగ్‌’ అని పేరు పెట్టింది. ఆ విమానం ప్రపంచంలోనే చివరి వాణిజ్య సూపర్‌సోనిక్‌ జెట్‌ ‘కాంకోర్డ్‌’ కంటే రెండు రెట్లు పెద్దగా ఉండి, రెండు రెట్లు వేగంగా ప్రయాణిస్తుందని చెప్పి సంచలనం సృష్టించింది.  
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని