Justin Trudeau: నాజీలపై ట్రూడో ప్రేమ.. భగ్గుమన్న కెనడా రాజకీయ వర్గాలు..!

కెనడాలో జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం చేపట్టిన ఓ చర్య కలకలం సృష్టించింది. నాజీ మాజీ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా విదేశీ అతిథి సమక్షంలో గౌరవించింది. అతడి గతం తెలుసుకోకుండా ఏకంగా చట్టసభకు పిలిపించడం.. గౌరవించడం జరిగిపోయాయి. చివరికి విషయం తెలిసి బహిరంగ క్షమాపణలు కోరింది.

Updated : 25 Sep 2023 11:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సారి ఏకంగా హిట్లర్‌తో కలిసి పోరాడిన నాజీ డివిజన్‌ సైనికుడిని పార్లమెంట్‌ సాక్షిగా గౌరవించి కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కెనడా హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ ఆంటోని రోటా ఆ తర్వాత తీరిగ్గా యూదులకు క్షమాపణలు చెప్పారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు ట్రూడో వ్యవహారశైలిపై మండిపడుతున్నాయి.

రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల తొలిసారి కెనడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ ఆంటోనీ రోటా ఉక్రెయిన్‌ నుంచి వలస వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం మాజీ సైనికుడైన 98 ఏళ్ల యారోస్లోవ్‌ హంకాను ఆహ్వానించారు. పార్లమెంట్‌లో జెలెన్‌స్కీ ప్రసంగం అనంతరం స్పీకర్‌ రోటా స్వయంగా హంకాను పరిచయం చేస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా నుంచి ఉక్రెయిన్‌కు స్వేచ్ఛను అందించడానికి పోరాడిన యోధుడిగా కీర్తించారు. దీంతో అక్కడే ఉన్న ప్రధాని జస్టిన్‌ ట్రూడో, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ సహా అందరూ చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అతడికి జెలెన్‌స్కీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది.

కెనడాలోని ‘ది ఫ్రెండ్స్‌ ఆఫ్‌ సైమన్‌ వెసింతల్‌ సెంటర్‌’ ప్రతినిధులు పార్లమెంట్‌ చర్యను ఖండించారు. పార్లమెంట్‌ గౌరవించిన హంకా రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌ పక్షాన పోరాడిన ‘14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌’కు చెందిన వ్యక్తి అని వెల్లడించారు. ఈ డివిజన్‌ చేతులు యూదుల రక్తంతో తడిశాయని పేర్కొన్నారు. న్యూరేమ్‌బర్గ్‌ విచారణలో ఈ డివిజన్‌ను నేరగాళ్ల బృందంగా ప్రకటించారని తెలిపారు.

ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. దీంతో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ ఆంటోని రోటా ఆదివారం క్షమాపణలు చెప్పారు. ‘‘అతడి గురించి నాకు పూర్తిగా తెలియదు. తెలిసిన తర్వాత నా నిర్ణయానికి పశ్చాత్తాపం చెందాను. నా తోటి పార్లమెంట్‌ సభ్యులకుగానీ, ప్రధానికిగానీ, ఉక్రెయిన్‌ బృందానికి గానీ దీనితో సంబంధం లేదు. అతడిని ఆహ్వానించడం పూర్తిగా నా పనే’’ అని వివరణ ఇచ్చుకొన్నారు. మరో వైపు ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆఫీస్‌ కూడా దీనిపై స్పందించింది. జరిగిన పొరపాటుకు స్పీకర్‌ క్షమాపణలు చెప్పారని పేర్కొంది. అతడి ఆహ్వానం విషయం తమకు ముందుగా తెలియదని వివరణ ఇచ్చింది. 

పుడమిని చేరింది.. ఏం చెప్పనుంది?

హిట్లర్‌ వద్ద పనిచేసిన క్రూరమైన సైనిక బృందాల్లో ‘14వ వాఫన్‌ గ్రనేడియర్‌ డివిజన్‌’ కూడా ఒకటి. జర్మనీ సోవియట్‌పై దాడి  చేసిన సమయంలో.. ఉక్రెయిన్‌లోని కొందరు వాలంటీర్లు వారికి సాయపడ్డారు. వారితో ఏర్పాటు చేసిందే ఈ డివిజన్‌. సోవియట్‌ నుంచి ఉక్రెయిన్‌ విడిపోవడం కోసం వారు ఇలా చేశారు. ఆ తర్వాత ఈ బృందం హిట్లర్‌ తరపున పలు దాడుల్లో పాల్గొంది.  రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ బృందంలోని కొందరు సభ్యులు కెనడా వచ్చి స్థిరపడ్డారు. వారిలో ఒకరు యారోస్లోవ్‌ హంకా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని