US: యెమెన్‌పై కొనసాగుతున్న క్షిపణుల దాడులు.. నౌకలు రావొద్దని అమెరికా హెచ్చరిక

Houthi-US: హౌతీ రెబల్స్‌ను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేపట్టిన ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. శనివారం కూడా యెమెన్‌లోని హౌతీల కేంద్రంపై అగ్రరాజ్యం క్షిపణులు కురిపించింది.

Published : 13 Jan 2024 14:12 IST

క్షిపణి దాడిలో ధ్వంసమైన సనా ఎయిర్‌పోర్టులోని హౌతీల రాడార్‌ కేంద్రం

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణలతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఎర్ర సముద్రం (Red Sea)లో వాణిజ్య నౌకలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న హౌతీ (Houthi) రెబల్స్‌పై అమెరికా (USA) ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. యెమెన్‌ (Yemen)లోని హౌతీల కేంద్రంపై అమెరికా శనివారం మరోసారి క్షిపణులతో దాడులు చేసింది. రాజధాని సనాలో భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లోని యెమెన్‌ తీర ప్రాంతాల వైపు రావొద్దని అమెరికా జెండాలతో ఉన్న వాణిజ్య నౌకలను యూఎస్‌ నేవీ శుక్రవారం రాత్రి హెచ్చరించింది. మరో 72 గంటల పాటు ఆ మార్గంలో వెళ్లొద్దని సూచించింది. ఆ కొద్ది గంటలకే యెమెన్‌లోని హౌతీ కేంద్రంపై క్షిపణి దాడి జరిగింది. ఈ తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందిస్తూ.. ‘‘హౌతీలు మరిన్ని భీకర దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే తగ్గేలా కన్పించట్లేదు.

యెమెన్‌పై అమెరికా, బ్రిటన్‌ క్షిపణుల వర్షం

శుక్రవారం తెల్లవారుజామున యెమెన్‌లోని పలు ప్రాంతాలపై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు ప్రతీకార దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సాయుధ ముఠాకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని క్షిపణుల వర్షం కురిపించాయి. రాజధాని సనా సహా 28 ప్రాంతాల్లో  70కి పైగా లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ఈ ఉద్రిక్తతలు ఆందోళనలకు దారితీశాయి. అమెరికా, యూకే దాడులను వ్యతిరేకిస్తూ సనా ప్రాంతంలో హౌతీ మద్దతుదారులు నిరసన చేపట్టారు.

అయితే, ఈ దాడులకు అమెరికా, బ్రిటన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని హౌతీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధించిన నౌకలపై దాడులు ఏమాత్రం ఆగబోవని హౌతీ మంత్రి హుస్సేన్‌ అల్‌ ఎజ్జి ప్రకటించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఎర్ర సముద్రంలోని ఓ నౌకపై హౌతీ రెబల్స్‌ క్షిపణి దాడి చేశారు. అది గురితప్పి వాణిజ్య నౌకకు 500 మీటర్ల దూరంలో పడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని