USA: 908 రోజుల తర్వాత భూమిపైకొచ్చిన అమెరికా అంతరిక్ష డ్రోన్‌..!

అమెరికా ప్రయోగించిన ‘ది ఎక్స్‌-37బీ ఆర్బిటల్‌ టెస్ట్‌ వెహికల్‌’ ఎట్టకేలకు 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్‌ సెంటర్లో ల్యాండ్‌ అయింది.

Published : 14 Nov 2022 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా ప్రయోగించిన ‘ది ఎక్స్‌-37బీ ఆర్బిటల్‌ టెస్ట్‌ వెహికల్‌’ ఎట్టకేలకు 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్‌ సెంటర్లో ల్యాండ్‌ అయింది. అమెరికాకు చెందిన స్పేస్‌ ఫోర్స్‌ రహస్య వాహనాన్ని 2020 మే నెలలో ప్రయోగించింది. ఈ స్పేస్‌ వెహికల్‌ను బోయింగ్‌ సంస్థ అభివృద్ధి చేసింది. గతంలో కక్ష్యలో గడిపిన 780 రోజుల రికార్డును ఈ సారి బద్దలు కొట్టినట్లు బోయింగ్‌ పేర్కొంది. ఈ యాత్రకు సంబంధించిన కీలక విషయాలను స్పేస్‌ ఫోర్స్‌ బహిర్గతం చేయలేదు. ఈ సారి దీనిలో పేలోడ్‌ సంఖ్యను పెంచేలా సర్వీస్‌ మాడ్యూల్‌ను కూడా తీసుకెళ్లింది. 

అంతరిక్షంలో ఆర్బిటల్‌ టెస్ట్‌ వెహికల్‌ నుంచి ఈ మాడ్యూల్‌ విడిపోయి  సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.  దీంతో అమెరికా నేవల్‌ రీసెర్చి పరిశోధనశాలకు అవసరమైన ప్రయోగాలు చేశారు. దీంతోపాటు థర్మల్‌ కంట్రోల్‌ కోటింగ్స్‌, ప్రింటెడ్‌ ఎలక్ట్రానిక్‌ మెటీరియల్‌, రేడియేషన్‌ షీల్డింగ్‌ మెటీరియల్‌ వంటి వాటితో అంతరిక్షంలో పదార్థాల, సాంకేతికత పనితీరుపై పరీక్షలు చేశారు. ఎక్స్‌-37బీకి ఆరో అంతరిక్ష యాత్ర. తన ప్రయాణంలో మొత్తం 1.3 బిలియన్‌ మైళ్ల దూరం ఇది ప్రయాణించింది.  మొత్తం 3,774 రోజులు అంతరిక్షంలో గడిపింది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అవసరమైన పలు ప్రయోగాలను అంతరిక్షంలో నిర్వహించి వాటిని విశ్లేషణ నిమిత్తం తిరిగి భూమిపైకి సురక్షితంగా చేరుకుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని