Trump-Vivek: వివేక్‌.. ట్రంప్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు..!

ఇన్నిరోజులు రిపబ్లికన్ పార్టీ నేతలు ట్రంప్‌(Trump), వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) మధ్య సానుకూల వాతావరణం కనిపించగా.. ఇప్పుడు సీన్‌ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. వివేక్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ వైపు నుంచి వ్యాఖ్యలు వినిపించడమే అందుకు కారణం.

Published : 16 Jan 2024 02:37 IST

వాషింగ్టన్‌: అమెరికా (USA) అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీపడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ట్రంప్‌ వర్గం నుంచి వివేక్‌కు మరో ప్రతికూల ప్రకటన వచ్చింది. ట్రంప్‌నకు ఆయన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని తెలిపింది. ఈ మేరకు మాజీ అధ్యక్షుడి దగ్గరి అనుచరుడిని ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రిపబ్లికన్‌పార్టీలో ట్రంప్‌నకే భారీ మద్దతు లభిస్తోంది. ఆయనతో పోటీ పడటానికి రామస్వామి(Vivek Ramaswamy) యత్నిస్తున్నారు. పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతోన్న ఆయన.. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘నాకు పదవి ముఖ్యం కాదు. ఇంత చిన్న వయసులో అది కూడా మంచి పదవే. శ్వేతసౌధంలో ట్రంప్‌ నా మార్గదర్శకులుగా, సలహాదారుగా ఉంటే సంతోషిస్తా’ అని వివేక్ గతంలో అన్నారు. అప్పుడు దానిపై ట్రంప్‌ నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. మీరు ఆయన్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా పరిగణించారా? అని ప్రశ్నించగా..‘ఆయన చాలా తెలివైన వ్యక్తి. ఆయన తగిన వ్యక్తి అని భావిస్తున్నా’ అని బదులిచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్‌ వర్గం నుంచి భిన్నమైన స్పందన వచ్చింది. ‘ఓటర్లు వివేక్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకోకపోవచ్చు. ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండరు’ అని వెల్లడించింది.

తన మద్దతుదారులు రామస్వామి(Vivek Ramaswamy)కి ఓటువేయొద్దని, ఆయనొక అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడని ట్రంప్ ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయ్నతిస్తున్నాడని విమర్శించారు. ఈ తరుణంలోనే మాజీ అధ్యక్షుడి సన్నిహితుడు నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

త్వరలో బైడెన్‌ సర్కారుకు జాన్‌ కెర్రీ గుడ్‌బై!

ఇదిలా ఉంటే.. రిపబ్లికన్‌పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతోన్న ఏకైక మహిళ నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఉపాధ్యక్షురాలిగా ఉండటంపై తనకు ఆసక్తి లేదని అన్నారు. తదుపరి అమెరికా ప్రెసిడెంట్‌గా ఉండేందుకు, గెలిచేందుకు పోటీ పడుతున్నానని వెల్లడించారు. రెండు పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థులను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో నేతల స్పందనలు వచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని