బీసీ వ్యతిరేక ధోరణి తగదు

ప్రధానాంశాలు

బీసీ వ్యతిరేక ధోరణి తగదు

భాజపాకు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరిక

హుజూరాబాద్‌లో తెరాసకు మద్దతు ప్రకటన

మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. చిత్రంలో జనార్దన్‌, శారదాగౌడ్‌, దానకర్ణాచారి,

రాజారాంయాదవ్‌, గుజ్జ కృష్ణ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: బీసీ వ్యతిరేక వైఖరి వీడాలని, లేకుంటే భాజపాకు గుణపాఠం తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. దేశంలోని 70కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేర్చకపోగా ఆ పార్టీ నేతలు తమపై ఎదురుదాడికి దిగడం దుర్మార్గమన్నారు. ఇందుకు హుజూరాబాద్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మంగళవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ ఉద్యోగ, కులసంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ కులగణనపై తమ డిమాండును మన్నించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ తీర్మానం చేశారన్నారు. బీసీ బంధు అమలుకూ అంగీకరించి, వచ్చే బడ్జెట్‌లో నిధులిస్తామన్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. వాజ్‌పేయీ, మోదీ పాలనలో జాతీయ బీసీ కమిషన్‌కు చట్టబద్ధ హోదా మినహా బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీ కులగణన, చట్టసభల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు, క్రీమీలేయర్‌ తొలగింపు, బీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు సమావేశం మద్దతు ప్రకటించింది. సంఘాల నేతలు దానకర్ణాచారి, రాజారాంయాదవ్‌, శారదాగౌడ్‌, కోల జనార్దన్‌, విజయేందర్‌సాగర్‌, ఈశ్వరప్ప తదతరులు పాల్గొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని