స్వర్గానికి ద్వారం తండ్రి

నాన్న అసంతృప్తిలో అల్లాహ్‌ అసంతృప్తి, నాన్న సంతోషంలో దేవుని ప్రీతి దాగి ఉన్నాయి. తండ్రి తన సంతానం కోసం చేసే వేడుకోళ్లు నేరుగా అల్లాహ్‌ సింహాసనాన్ని తాకుతాయి అంటారు ముహమ్మద్‌ ప్రవక్త

Published : 17 Jun 2021 00:37 IST

ఇస్లాం సందేశం

* నాన్న అసంతృప్తిలో అల్లాహ్‌ అసంతృప్తి, నాన్న సంతోషంలో దేవుని ప్రీతి దాగి ఉన్నాయి. తండ్రి తన సంతానం కోసం చేసే వేడుకోళ్లు నేరుగా అల్లాహ్‌ సింహాసనాన్ని తాకుతాయి అంటారు ముహమ్మద్‌ ప్రవక్త (స). ఎండకు ఎండుతూ నీడనిచ్చే మహావృక్షం లాంటి నాన్నను ఆదరిస్తేనే పరలోకంలో ముక్తిమోక్షాలు, ప్రాపంచిక జీవితంలో వృద్ధి వికాసాలు సొంతమవుతాయన్నది ఇస్లాం బోధ.
* ఇస్లాంలో అమ్మ తరువాత నాన్నకు మహోన్నత స్థానం ఉంది. తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉందని చెబుతూనే, తండ్రి ఆ స్వర్గానికి మధ్య ద్వారమని పేర్కొని నాన్న ఔన్నత్యాన్ని పెంచారు ప్రవక్త (స). నాన్నను సంతోషపెట్టాలి. గౌరవించాలి. ఆదరించాలి. అప్పుడే ఆ స్వర్గలోకంలో అడుగు పెట్టగలం.
* ప్రవక్త (స) జన్మించి కళ్లు తెరిచే నాటికే ఆయన తండ్రి ఈ లోకం వీడి వెళ్లిపోయారు. ప్రవక్త (స) బోధనలన్నీ మనిషి జీవితంలో నాన్న పాత్ర ఎంత గొప్పదో తెలియ జెబుతాయి. నాన్న మాట శ్రద్ధగా వినాలి. నాన్న కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం, ఆయనతో కలిసి నడిచి వెళ్లేటప్పుడు ఆయన కంటే ముందుగా అడుగులు వేయటం కూడదన్నది ప్రవక్త (స) హితవు.
* నాన్న పుస్తకం లాంటివాడు. అందులో అనుభవాల పుటలుంటాయి. బిడ్డ తనకంటే గొప్పవాడవ్వాలని కోరుకునే ఏకైక వ్యక్తి తండ్రి. నాన్న చిందించే ఒక్క చెమట చుక్కకు కూడా విలువ కట్టలేం అంటారు ప్రవక్త (స).


ఎంత వృద్ధుడైనా ఇంటికి దృఢమైన స్తంభం నాన్న. అందుకే అమ్మానాన్నలు ఎంత వృద్ధాప్యంలో ఉన్నా వారిని ఆదరించాలని చెబుతుంది ఖురాన్‌. ‘ఒకవేళ వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ అని కూడా అనకండి. వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయా భావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ప్రభూ! వారిపై కరుణ చూపు. బాల్యంలో వారు నన్ను కారుణ్యం, వాత్సల్యంతో పోషించారు (17:23-24)’ అన్నది ఖురాన్‌ ఉద్బోధ.


- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని