Bio Design: బయో డిజైన్‌...ప్రవేశ ప్రణాళిక!

Eenadu icon
By Features Desk Published : 16 Sep 2025 01:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

ప్రచండంగా ప్రకాశిస్తున్న రంగంలో ప్రవేశించేందుకు కావలసిన కోర్సుల కోసం పెద్దగా వెతకాల్సిన పని ఉండదు. కానీ ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న బయో డిజైనింగ్‌ పరిశ్రమలో రానున్న పొజిషన్లు అందుకునేందుకు పాదం మోపాలంటే కోర్సులు పెద్దగా సిద్ధమై ఉండవు. అయినా భవిష్యత్‌ అవకాశాలు సొంతం చేసుకోవాలంటే అన్ని దిశలా అన్వేషించాలి.

బయో టెక్నాలజీ కోర్సుల అధ్యయనం ద్వారా బయో డిజైనింగ్‌ వైపు మరలవచ్చు. బీఎస్సీ బయో టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ లాంటి సబ్జెక్టులు కూడా బయో డిజైనింగ్‌కు అనుసంధానమయ్యేవే. ఈ కోర్సుల్లో జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, మాలిక్యులర్‌ బయాలజీ తదితర సబ్జెక్టులను కవర్‌ చేస్తారు. ఇంటర్మీడియట్‌ను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలతో చదివిన విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సును.. ఎంపిక చేసిన కాంబినేషన్లతో చేయడం ద్వారా బయో డిజైనింగ్‌ వైపు అడుగులు వేయవచ్చు.

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు

బీఎస్సీ- బయోటెక్నాలజీ: వైద్య, పారిశ్రామిక అవసరాల కోసం జీవశాస్త్ర ప్రక్రియలను ఈ కోర్సులో అధ్యయనం చేస్తారు. బయో డిజైనింగ్‌ పొజిషన్లకు కావలసింది ఇదే. వైద్య రంగానికి అవసరమైన పరికరాలు, ఉపకరణాలను పారిశ్రామిక స్థాయిలో వాణిజ్య ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు అవసరమయ్యే నిపుణులను ఈ కోర్సు సిద్ధం చేస్తుంది.

బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌: వైద్య చికిత్స, వైద్య ఉపకరణాల రూపకల్పనలో ఇంజినీరింగ్‌ సూత్రాలను అనువర్తింపజేయడం, బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో నేర్చుకుంటారు. జీవశాస్త్రానికి సాంకేతిక పరిజ్ఞానం జోడించడం వల్ల బయో ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు సులభమవుతాయి.

బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ: జీవి పుట్టుక, వృద్ధి దశలనూ, కంటికి కన్పించనంత సూక్ష్మజీవుల ఎదుగుదల పరిణామ క్రమాన్నీ బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీల్లో విద్యార్థులు నేర్చుకుంటారు.

జెనెటిక్‌ ఇంజినీరింగ్‌: నిర్దేశించిన ఫలితాల కోసం అవసరమైతే జన్యు పదార్థాల్లో మార్పులు చేయడాన్ని విద్యార్థులు జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో అలవర్చుకుంటారు.

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌: పర్యావరణ సవాళ్లను గుర్తించి, సుస్థిరాభివృద్ధికి దోహదం చేసే పరిష్కారాలను ఈ కోర్సులో నేర్చుకుంటారు.

బయో ఇన్ఫర్మాటిక్స్‌: జన్యు పరిశోధన, ఔషధ ఆవిష్కరణలకు మూలమైన జీవ సంబంధిత విస్తృత సమాచార నమూనాలను విశ్లేషిస్తారు. విశ్లేషణకు కావలసిన గణన ఉపకరణాల రూపకల్పనను ఈ శాస్త్ర అధ్యయనం ద్వారా గ్రహిస్తారు.

బీటెక్‌ బాట..

బీఎస్సీ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులతో పాటు బయో డిజైనింగ్‌కు దారితీసే బీటెక్‌ కోర్సులను కొన్ని యూనివర్శిటీలు అందిస్తున్నాయి.

బీటెక్‌- బయోటెక్నాలజీ: ఇంజినీరింగ్‌ కోణం నుంచి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా బయో టెక్నాలజీ, బయో డిజైనింగ్‌ నిపుణులు కావచ్చు. అందుకే బీటెక్‌ బయోటెక్నాలజీని జెనెటిక్స్‌ ఇంజినీరింగ్, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ ఆప్షన్స్‌తో చేయవచ్చు.

బయో డిజైనింగ్‌ ఇంజినీరింగ్‌: బయో డిజైనింగ్‌ రంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థులకు నేరుగా ఉపయోగపడే కోర్సు ఇది. వైద్య ప్రక్రియలు, ఉపకరణాలను కనుగొనేందుకు ఇంజనీరింగ్‌ను జీవ శాస్త్రాలతో మేళవించి అధ్యయనం చేస్తారు.

ఏయే హోదాలు?

మంచి అవకాశాలుండి నిపుణుల కొరతతో సతమతమవుతున్న రంగాల్లో బయో డిజైన్‌ ఒకటి. ఎంట్రీ స్థాయి నుంచి సీనియర్‌ పొజిషన్ల వరకూ వివిధ అవసరాలకు బయో టెక్నాలజీ, బయో డిజైన్‌ కంపెనీలు ఎదురు చూస్తున్నాయి.

బయో మెడికల్‌ సైంటిస్ట్‌: నూతన చికిత్స విధానాల రూపకల్పన, వ్యాధి నిర్థరణ ఉపకరణాల అభివృద్ధిలకు బాధ్యత వహిస్తారు.

బయో టెక్నాలజిస్ట్‌: వ్యవసాయం, వైద్యం, పరిశ్రమల అవసరాలకు జీవ సంబంధ సాధనాల పరిశోధన, రూపకల్పన వీరి విధులు.

జెనెటిక్‌ ఇంజినీర్‌: కొత్త రకం వంగడాలను తీసుకొచ్చేందుకు జన్యు పరివర్తన, జన్యులోపాల సవరణ ద్వారా వీరు కృషి చేస్తారు.

బయో ఇన్ఫర్మేటిక్స్‌ అనలిస్ట్‌: సంక్లిష్టమైన జీవ సంబంధ డేటా నమూనాలను గణాంక, విశ్లేషణ సాంకేతిక ప్రక్రియలతో కలిసి ఆశించిన ఫలితాలు రాబడతారు.

బయోటెక్‌ ఇంజినీర్స్‌: బయో టెక్నాలజీ ఉత్పత్తులను అత్యధిక పరిమాణంలో తీసుకొచ్చేందుకు తక్కువ వ్యయంతో సులభ ప్రక్రియలను రూపొందిస్తారు.

ఆశ - ఆశయం

బయో డిజైనింగ్‌ రంగం రాబోయే ఐదారేళ్లలో దేశంలో మరో ఐటీ రంగం కానున్నదన్న సమాచారం తెలుసుకున్నప్పుడు దీనిలో ప్రవేశించాలని అన్పిస్తుంది. కానీ సమాచారానికీ, లక్ష్యసాధనకూ మధ్య ఆరు దశలుంటాయి.

సమాచారం తెలిసిన వెంటనే ప్రేరణగా అన్పిస్తుంది. ఇంతగా అవకాశాలున్న రంగంలో మనమెందుకు ప్రవేశించకూడదనిపిస్తుంది. లక్ష్యం ఏర్పడ్డాక ఆ దిశగా వెళ్లే దారిలో అవరోధాలు ఎదురవుతాయి. బయో డిజైనింగ్‌ ఇంకా బయోటెక్నాలజీలో అంతర్భాగంగానే ఉంది. ప్రత్యేక అస్తిత్వంలోకి రావడంతోనే విస్తృత ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న కోర్సులు చేసి సిద్ధంగా ఉంటే ఆ అవరోధాన్ని అధిగమించినట్టే. ఆపై లక్ష్యం చేరగలుగుతారు.

యస్‌.వి. సురేష్‌ సంపాదకుడు, ఉద్యోగ సోపానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని