Management: మేనేజ్‌మెంట్‌లో మేటి సంస్థలివీ!

Eenadu icon
By Features Desk Published : 09 Oct 2025 03:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

దేశంలో మేనేజ్‌మెంట్‌ చదువులకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లు వేదికగా నిలుస్తున్నాయి. టాప్‌ బిజినెస్‌ కోర్సులు అందించే లక్ష్యంతోనే వీటిని నెలకొల్పడంతో ర్యాంకుల్లోనూ ఇవే దూసుకుపోతున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ఏటా మేటి మేనేజ్‌మెంట్‌ సంస్థల జాబితాను ప్రకటిస్తోంది. ఇందులో ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు ప్రతి సంవత్సరం మొదటి స్థానానికి పోటీపడుతున్నాయి. తాజా 2025 మేనేజ్‌మెంట్‌ ర్యాంకుల్లో ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రథమ స్థానంలో నిలిచింది.  

మేనేజ్‌మెంట్‌ విద్యకు ప్రాధాన్యం పెరుగుతోంది. సంస్థల వ్యాపార విస్తరణ, సమగ్ర నిర్వహణలకు బిజినెస్‌ స్టడీస్‌ చదివినవారి సేవలెంతో కీలకం. దీంతో ప్రముఖ సంస్థల్లో కోర్సులు పూర్తి చేసుకున్నవారు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు. 

  • దేశంలో మేటి మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ప్రవేశానికి క్యాట్‌ ముఖ్యమైంది. 
  • జీఆర్‌ఈ, జీమ్యాట్‌తోనూ పేరున్న సంస్థలు అవకాశమిస్తున్నాయి. 
  • క్యాట్‌ తర్వాత జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జాట్‌) ముఖ్యమైన పరీక్ష. ఈ స్కోరుతోనూ కొన్ని మేటి సంస్థల్లో చేరవచ్చు. 
  • మధ్య స్థాయి సంస్థల్లో చదవడానికి మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌) స్కోరు ఉపయోగపడుతుంది. 
  • ఏపీ, తెలంగాణలోని రాష్ట్ర స్థాయి సంస్థలకు ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌) దారి చూపుతుంది.

ఐఐఎం కోర్సులు 

ఐఐఎం అహ్మదాబాద్‌.. పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ), పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ-ఎఫ్‌ఏబీఎం) కోర్సులను రెండేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇవే కాకుండా పలు విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఈ సంస్థలో చదువుకోవచ్చు. వీటికి గ్రాడ్యుయేట్లందరూ పోటీ పడవచ్చు. రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఐఐఎంలు ఉమ్మడిగా నిర్వహించే  క్యాట్‌/ జీమ్యాట్‌లో ప్రతిభ చూపాలి. ఈ పరీక్షల్లో  మెరిట్‌ సాధించినవారికి గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి కోర్సులోకి తీసుకుంటారు. 

ఈ సంస్థ అందించే పీహెచ్‌డీ కోర్సులోకి పీజీ లేదా ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్‌డీ స్పెషలైజేషన్‌ అనుసరించి.. జీఆర్‌ఈ, జీమ్యాట్, గేట్, నెట్‌ (జేఆర్‌ఎఫ్‌) స్కోరుతో అవకాశం కల్పిస్తారు. క్యాట్‌ స్కోరుతో ఫెలో ప్రొగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎఫ్‌పీఎం) కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. వృత్తి నిపుణుల కోసం ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రొగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కోర్సు ఈ సంస్థ అందిస్తోంది. జీ మ్యాట్, పర్సనల్‌ ఇంటర్వ్యూతో చేర్చుకుంటారు.

పేరున్న విద్యా సంస్థల్లో పనిచేస్తోన్న వారు బోధనలో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంను ఐఐఎం-అహ్మదాబాద్‌ అందిస్తోంది. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో అందించే పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేట్లు చేరొచ్చు. అలాగే బిజినెస్‌ అనలిటిక్స్‌లో అనుభవం ఉన్నవారి కోసం పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో చేరడానికి జీమ్యాట్, జీఆర్‌ఈ, క్యాట్, గేట్‌ల్లో ఏదో ఒక స్కోరు ఉండాలి. దాదాపు ఐఐఎంలన్నీ ఇవే తరహా కోర్సులను అందిస్తున్నాయి.

టాప్‌ టెన్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు 

1. ఐఐఎం - అహ్మదాబాద్‌
2. ఐఐఎం - బెంగళూరు
3. ఐఐఎం - కోజికోడ్‌
4. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - దిల్లీ
5. ఐఐఎం - లఖ్‌నవూ
6. ఐఐఎం- ముంబై
7. ఐఐఎం - కోల్‌కతా
8. ఐఐఎం - ఇందౌర్‌
9. మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ - గురుగ్రామ్‌
10. జేవియర్‌ లేబర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - జంషెడ్‌పూర్‌ 

తెలుగు రాష్ట్రాల్లో టాప్‌-వందలో..

29. ఐఐఎం - విశాఖపట్నం
46. ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ హయర్‌ ఎడ్యుకేషన్‌ - హైదరాబాద్‌
70. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ యూనివర్సిటీ - వడ్డేశ్వరం
72. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ - హైదరాబాద్‌
95. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ - హైదరాబాద్‌

101-125 మధ్యలో:

  • గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం) - విశాఖపట్నం
  • ఐసీఏఆర్‌ నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌) - హైదరాబాద్‌
  • హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 
  • విజ్ఞాన్స్‌ ఫౌండేషన్‌ ఫర్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ రిసెర్చ్‌ - గుంటూరు

ఏ పరీక్ష కైనా సాధారణ డిగ్రీతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు పరీక్ష స్కోరుతోనే అవకాశం కల్పిస్తున్నాయి. పేరున్న బీ స్కూల్స్‌లోకి మాత్రం గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ అదనం. 

మదింపు ఇలా

బోధన, అభ్యాసం, వనరులు; పరిశోధన, వృత్తి అభ్యాసం; సంస్థ నుంచి వచ్చిన విద్యార్థుల ప్రతిభ, సంస్థలో చేరుతోన్న విద్యార్థుల్లో వైవిధ్యం, అకడమిక్, పరిశ్రమలకు చెందిన నిపుణుల దృక్పథం పరామితులుగా తీసుకుంటారు. వీటి విలువలను మదింపు చేసి మొత్తం స్కోరు ద్వారా మేటి సంస్థలను ఎంపిక చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో లభించిన ఉన్నత విద్యావకాశాలు, ప్లేస్‌మెంట్లు, మధ్యగత జీతం, విశ్వవిద్యాలయ పరీక్షల్లో ఫలితాలు, పీహెచ్‌డీలో చేరడానికి అర్హత పొందినవారు...తదితరాంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని