Quantum Technology: క్వాంటమ్‌లో మీ ఆసక్తి దేనిపై?

Eenadu icon
By Features Desk Published : 22 Oct 2025 04:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

క్వాంటమ్‌ శతాబ్ది వైపు భారత్‌ అడుగులు వేస్తున్నవేళ.. ఈ రంగం యువతకు విభిన్న అవకాశాలను తీసుకువస్తోంది. క్వాంటమ్‌ టెక్నాలజీని అవగాహన చేసుకున్న విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఈ పరిశ్రమ కల్పిస్తున్న అవకాశాలను నిశితంగా పరిశీలించాలి.ఈ రంగంపై ఆసక్తితో పాటు దృష్టి పెట్టాల్సిన విధులను గుర్తించాలి. 

టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ విభాగంలో ఉండే ఇంజినీర్లు క్వాంటమ్‌ కంప్యూటర్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతల్లో నిమగ్నమవుతారు. క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్లుగా వీరిని పరిగణిస్తారు. 

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు: క్వాంటమ్‌ కంప్యూటర్లకు కావలసిన సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, లాంగ్వేజెస్, ఇతర సహాయ ఉపకరణాలను తయారుచేస్తారు.

అల్గారిథమ్‌ డెవలపర్లు: నిర్దేశించిన పని కోసం క్వాంటమ్‌ కంప్యూటర్‌ సామర్థ్యాన్ని అల్గారిథమ్స్‌ సహాయంతో పెంచుతారు. అల్గారిథమ్స్‌ను మెరుగుపరుస్తారు.

క్రయోజనిక్‌ ఇంజినీర్, సైంటిస్ట్‌: కొన్ని క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ ప్రత్యేక వాతావరణంలో పనిచేస్తాయి. అతిశీతల ఉష్ణోగ్రతల మధ్య క్వాంటమ్‌ కంప్యూటర్‌ పనితీరును ఈ నిపుణులు పర్యవేక్షిస్తారు.

ఫొటోనిక్స్, ఆప్టిక్స్‌ ఇంజనీర్‌ అండ్‌ సైంటిస్ట్‌: క్వాంటమ్‌ కంప్యూటర్లలో వినియోగించే ఆప్టిక్‌ విడిభాగాల రూపకల్పనపై ఫొటోనిక్స్‌ నిపుణులు దృష్టి పెడతారు.

ఎర్రర్‌ కరెక్షన్‌ సైంటిస్ట్‌: క్వాంటమ్‌ కంప్యూటర్లలో ఏ విధమైన ఎర్రర్‌ (పనితీరులో ఆటంకం) రాకుండా ఈ ప్రొఫెషనల్స్‌ పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే సరిదిద్దుతారు.

ఐదు రకాల హోదాలు

రిసెర్చ్, సైన్స్‌

 

క్వాంటమ్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్దేశించిన లక్ష్యాల దిశగా పరిశోధనలు చేస్తారు.

క్వాంటమ్‌ ఫిజిసిస్ట్‌: ఈ సాంకేతికతను మరింత శక్తిమంతం చేసేందుకు క్వాంటమ్‌ మెకానిక్స్‌ (ఫిజిక్స్‌) నియమాలను వర్తింపజేసే పొజిషన్‌.

థియరిటికల్‌ ఫిజిసిస్ట్‌: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను బలపరచేందుకు సైద్ధాంతిక పునాదులను ఏర్పరిచే నిపుణులు.

క్వాంటమ్‌ కెమిస్ట్‌: సంక్లిష్ట రసాయనిక బంధాలను అర్థం చేసుకోవడానికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతను వర్తింపజేస్తారు. 

సపోర్టింగ్‌  

టెక్నికల్‌ సేల్స్‌- మార్కెటింగ్‌: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఉత్పత్తుల అమ్మకాలు, మార్కెటింగ్‌లో కృషి చేసే హోదాలు.

సిస్టమ్‌ ఆర్కిటెక్ట్‌ డిజైనర్స్‌: క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ నిర్మాణ నమూనాలూ, కంప్యూటింగ్‌ వ్యవస్థకు రూపకల్పన చేస్తారు.

పర్ఫార్మెన్స్‌ టెస్టింగ్‌ ఇంజినీర్స్‌: క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్‌ రూపొందాక మార్కెట్టుకు వెళ్లకముందే వాటి పనితీరును పరీక్షించే ప్రొఫెషనల్స్‌.

టెక్నికల్‌ సపోర్ట్‌: క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది. 

స్పెషలైజ్డ్‌ హైబ్రిడ్‌ 

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను వాణిజ్య ప్రయోజనాలకు అనుసంధానించేందుకు అవసరమైన కొన్ని ప్రత్యేక హైబ్రిడ్‌ పొజిషన్లకు అవకాశం ఉంది.

క్వాంటమ్‌ అప్లికేషన్స్‌ సైంటిస్ట్‌: ఈ సాంకేతికతను వాణిజ్య అవసరాలకు తగ్గట్టు సిద్ధం చేసే, పరిశోధన ఫలితాలను వ్యాపారాభివృద్ధికి వర్తింపజేసే ప్రొఫెషనల్‌ హోదా. 

డేటా సైంటిస్ట్‌: ఈ టెక్నాలజీకి అడ్వాన్స్‌డ్‌ అనలిటిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌కు మధ్య వారధి నిర్మించే నిపుణులు. వీరి వల్ల అద్భుతమైన ఫలితాలతో వివిధ రంగాలకు ప్రయోజనం జరుగుతుంది. 

క్వాంటమ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్స్‌: క్వాంటమ్‌ కంప్యూటర్స్‌పై పనిచేయగల మెషిన్‌ లెర్నింగ్‌ మోడల్స్‌ రూపొందించడం ఈ ప్రొఫెషనల్స్‌ బాధ్యత.

ప్రొడక్ట్‌ మేనేజర్‌: అంతిమంగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కూడా ఒక ఐటీ  ప్రొడక్ట్‌. వివిధ అవసరాలకు తగ్గ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ప్రొడక్ట్స్‌ను ప్రొడక్ట్‌ మేనేజర్ల పర్యవేక్షణలో తయారు చేస్తారు.

భద్రతలోనూ అవకాశాలెన్నో

ప్రస్తుత ఐటీ ఉత్పత్తులకు తగ్గట్టు సైబర్‌ సెక్యూరిటీని నిపుణులు కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న సైబర్‌ దాడులను నిరోధించి డేటాను కాపాడేందుకు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు కృషి చేస్తున్నారు. అయితే, భవిష్యత్తులో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ విరివిగా వ్యాప్తిలోకి వచ్చినప్పుడు పెద్దఎత్తున డేటా చౌర్యానికి నేరగాళ్లు సిద్ధమవుతారు. అంటే ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని సాంకేతికతలోకి కూడా చొరబడేందుకు వారు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటారు. ఇందుకోసం ప్రస్తుతం వారిచేతికి చిక్కిన డేటాను కబళించి ఉంచుకుంటున్నారు. ఈ డేటా చుట్టూ సైబర్‌ సెక్యూరిటీ రక్షణ వలయం ఉండటం వల్ల ఏమీ చేయలేక యధాతథంగా దాస్తున్నారు. దీనినే ‘హార్వెస్ట్‌ నౌ- డీక్రిప్ట్‌ లేటర్‌’ (నేడు డేటా సేకరించు.. రేపు ఛేదించు) అంటున్నారు. 

సైబర్‌ నేరగాళ్లు ఇంతగా మాటువేసి ఉన్నప్పుడు క్వాంటమ్‌ టెక్నాలజీ భద్రతా నిపుణుల అవసరం అపారంగా ఉంది. ఈ నూతన సాంకేతికత ఒక్కసారిగా విస్ఫోటించి అన్ని జీవన రంగాలనూ కుదిపేస్తున్నప్పుడు రక్షణ అవసరం. క్వాంటమ్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్‌కు అప్పుడు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతుందని పరిశ్రమ నిపుణుల అంచనా.

యస్‌.వి. సురేష్‌ సంపాదకుడు, ఉద్యోగ సోపానం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు