Career: కాలేజీ మార్కులు కాలేవు.. కెరియర్ మెట్లు
కార్పొరేట్ స్కిల్స్

ఏటా ఎంతోమంది యువకులు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల నుంచి డిగ్రీలు తీసుకుని కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెడుతుంటారు. ఉద్యోగ నిర్వహణలో సమస్యలు ఎదురైనపుడు ‘ఇది మేం కాలేజీలో చదవలేదు, ఈ విషయాలు ఎవరూ బోధించలేదు’ అంటూ తొలి దశలో గందరగోళపడుతుంటారు. కార్పొరేట్స్‌లో ఎదుర్కొనే అప్రకటిత నియమాలను అర్థం చేసుకోవడంలోనే కెరియర్ విజయం ఆధారపడి ఉంటుంది.
ఎంబీఏ చదివిన రమేష్ ఒక ఎంఎన్‌సీలో ట్రెయినీగా చేరాడు. సబ్జెక్టుపై పట్టు, విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ కస్టమర్స్, టీమ్ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడిని హ్యాండిల్ చేయలేకపోయాడు. తనకు ఎదురైన సమస్యలు కొత్తగా ఉన్నాయనీ, ఇలాంటివి నిర్వహించే విధానం కాలేజీలో నేర్పలేదనీ భావించాడు. ఉద్యోగంలో ఎక్కడ విఫలమవుతానోనని నిరుత్సాహానికి గురయ్యాడు. ఈ పరిణామాలను గుర్తించిన టీమ్ లీడర్ అతణ్ని హెచ్.ఆర్. కౌన్సెలర్‌కు రెఫర్ చేశారు. కాలేజీలో విద్యార్థులకు సబ్జెక్ట్ పరిజ్ఞానం, మేనేజ్‌మెంట్ సిద్ధాంతాలు నేర్పినప్పటికీ కార్పొ రేట్ సంస్థల్లో విజయం సాధించడానికి కంటికి కనిపించని కొన్ని నియమాలుంటాయనీ, వాటిని అర్థం చేసుకుని పనిచేస్తే ఉద్యోగంలో రాణించవచ్చనీ చేసిన కౌన్సెలింగ్‌తో రమేష్ ట్రాక్‌లోకి వచ్చాడు.
1. మైండ్‌సెట్ ముఖ్యం

మన విద్యా విధానంలో మార్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే విద్యార్థి.. కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిగా అడుగుపెట్టాక ఉద్యోగంలో విజయం సాధించడానికి కొత్త నైపుణ్యాలూ, కొత్త లక్షణాలూ అవసరం. విద్యార్థి దశలో మార్కుల సాధనకు అవసరమైన లక్షణాలూ, నైపుణ్యాలూ ఉద్యోగిగా విజయం సాధించడానికి ఉపయోగపడవు. అభ్యర్థులు ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తారు, కొత్త విషయాలను ఎంత త్వరగా నేర్చుకోగలరు, టీమ్‌ను ఎలా మేనేజ్ చేస్తారు, ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న అంశాలను పరిశీలించే కార్పొరేట్ సంస్థలు ఎంపిక చేసుకుంటాయి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో సెలెక్ట్ అయిన దీపికకు తన ఫైనల్ సెమిస్టర్‌కు వచ్చేసరికి సంస్థ నిర్దేశించిన కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చాయి. ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తారని అందరూ భావించారు. అయితే ఆమె తనను ఎంపిక చేసిన కంపెనీ రిక్రూటర్‌ను కలిసి తన బలాలతో సంస్థకు తానెలా విలువ చేకూర్చగలనో వివరించింది. తనకు వచ్చిన అవకాశాన్ని సవాలుగా తీసుకొని సానుకూల దృక్పథం, నేర్చుకునే తత్వంతో తన ప్రతికూలతను సక్సెస్‌గా మలుచుకుంది.
2. నెట్‌వర్కింగ్

నెట్‌వర్కింగ్ అంటే వ్యక్తుల మధ్యా, వ్యవస్థల మధ్యా నమ్మకాన్నీ, పరస్పర సహకారాన్నీ, విలువలనూ నిర్మించే ఒక దీర్ఘకాలిక వ్యవస్థ. ఆరోగ్యకరమైన సామాజిక, మానవ సంబంధాలు ఉన్నచోట లక్ష్యసాధన సులభమవుతుంది.
స్వాతి ఇంజినీరింగ్ తొలి సంవత్సరం నుంచే సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ వచ్చింది. లింక్డ్‌ఇన్‌లో తన స్పెషలైజేషన్‌కు సంబంధించిన వృత్తి నిపుణులతో కనెక్ట్ అవుతూ, అప్పుడప్పుడు కొన్ని సంస్థలు నిర్వహించే వర్క్‌షాప్‌లకు హాజరయ్యేది. చిన్న చిన్న ప్రాజెక్టుల్లో స్వచ్ఛందంగా పాల్గొనేది. డిగ్రీ పూర్తి చేసుకుని ప్లేస్‌మెంట్‌కు సిద్ధమయ్యేసరికే చాలామంది వృత్తి నిపుణులకూ, రిక్రూటర్లకూ ఆమెపై సదభిప్రాయం ఏర్పడింది. ఈ నెట్‌వర్కింగ్ స్వాతి ఒక బహుళజాతి సంస్థలో సెలెక్ట్ అవడానికీ, ఉద్యోగంలో బాగా రాణించడానికీ ఉపయోగపడింది.
3.నిశ్శబ్ద వాస్తవం
కార్పొరేట్ పాలిటిక్స్ అనేది బహిరంగంగా చర్చించనప్పటికీ, ప్రతి సంస్థలోనూ ఇది నిశ్శబ్దంగా ప్రభావం చూపే వాస్తవం. ఉద్యోగి ప్రతిభ ఒక అంశమైతే, ఎవరి ప్రభావం ఎలా ఉంటుందన్న అంశం కెరియర్ వృద్ధిపై నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. ఒక్కోసారి నిబద్ధతతో పనిచేసే ఉద్యోగి కూడా ఈ వాస్తవాన్ని అర్థంచేసుకోలేక పోవడంతో కెరియర్ విజయంలో వెనకబడవచ్చు. అందుకే ఈ నిశ్శబ్ద వాస్తవాన్ని తెలుసుకుని వ్యవహరించగలగాలి.
4.పనిని ప్రొజెక్ట్ చేసుకోవాలి
సంస్థలో ఎదగడానికి ప్రతి ఒక్కరితోనూ స్నేహంగా ఉండనవసరంలేదు. అయితే కీలకమైన వ్యక్తులను గుర్తించి అవసరమైనప్పుడు వారి దగ్గర ఉద్యోగి తన పనిని ప్రొజెక్టు చేసుకోవాలి. గాసిప్‌లు కార్పొరేట్ వ్యవస్థను అర్థంచేసుకొని ముందుకు పోవడంలో ఒక భాగమని గుర్తించాలి. అంతే తప్ప వాటిలో మునిగిపోకూడదు.
కొత్తగా కార్పొరేట్ సంస్థల్లో అడుగుపెట్టే యువతీ యువకులు ఈ అనధికారిక నియమాలు గమనించడం అవసరం. ఆపై తమ ప్రతిభతో పరిస్థితులను సమతుల్యం చేసుకుంటే కెరియర్లో ముందుకు దూసుకుపోవచ్చు.

దొరైరాజ్ . సీనియర్ జనరల్ మేనేజర్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


