Cloud Computing: తీర్చిదిద్దుకుందామా.. క్లౌడ్‌ కెరియర్‌?

Eenadu icon
By Features Desk Updated : 08 Oct 2025 01:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

ఐటీ రంగంలో ఉజ్వలంగా వెలుగొందుతోంది- క్లౌడ్‌ కంప్యూటింగ్‌. ఐటీ సేవలను కెరియర్‌గా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న యువత ఈ విభాగం వైపు దృష్టి పెట్టవచ్చు. తగిన అర్హతలూ, నైపుణ్యాలతో సిద్ధమైతే మెరుగైన హోదాలూ వరిస్తాయి!  

రో ఐదేళ్లలో లక్ష కోట్ల మార్కెట్టుకు చేరుకోనున్న మేటి టెక్నాలజీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌. ఇందులో ఉద్యోగావకాశాలు పుష్కలం. వీటిని అందుకోవాలంటే చేయాల్సిన కోర్సు లేమిలో తెలుసుకుందాం!  

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలోకి ప్రవేశించి స్థిరపడితే బహువిధాలుగా రాణించే అవకాశా లుంటాయి. అత్యున్నత స్థాయి నిపుణులను ఎంపిక చేసే ఈ రంగంలో చేరాలంటే.. మూడు దశలు దాటాలి.

1 ఐటీ ఫండమెంటల్స్‌ కోర్సులు/ ఐటీలో బ్యాచిలర్‌ డిగ్రీ 
2 డేటా బేస్, నెట్‌వర్కింగ్, లినక్స్‌ నైపుణ్యాలు నేర్చుకోవడం
3 ఎ.డబ్ల్యు.ఎస్‌., అజర్, గూగుల్‌ క్లౌడ్‌ లాంటి క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్రత్యేక కోర్సులు చేయడం 

ప్రాథమిక విజ్ఞానం

ఆశించే ఏ పొజిషన్‌కు అయినా ప్రాథమిక పరిజ్ఞానం నేర్చుకోవడం తప్పనిసరి. అదే కెరియర్‌కు పునాది. ఐటీలో ఫండమెంటల్‌ నాలెడ్జ్‌గా పరిగణించే కంప్యూటర్‌ నెట్‌    వర్కింగ్, డేటా బేసెస్, లినక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్, వర్చువలైజేషన్‌ లాంటి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు తెచ్చుకోవాలి.

స్పెషలైజ్డ్‌ డిగ్రీలు

క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో సుశిక్షితులైన మానవ వనరుల అవసరాన్ని గుర్తించిన కొన్ని యూనివర్శిటీలు క్లౌడ్‌ కంప్యూటింగ్, వర్చువలైజేషన్‌ రంగాల్లో లోతైన అవగాహన కోసం వివిధ రకాల అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలను అందిస్తున్నాయి. ఐటీ రంగంలో ఏ డొమైన్‌కు అయినా ఉపకరించే నైపుణ్యాలు నేర్చుకున్నవారు ఆ పూర్వరంగంతో పాటు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో విస్తృత విషయజ్ఞానం ఆర్జించేందుకు ఈ స్పెషలైజ్డ్‌ డిగ్రీలు ఉపకరిస్తాయి. 


సర్టిఫైడ్‌ కోర్సులు

ఐటీ రంగంలో సబ్జెక్టు పరంగా గట్టి పునాది ఉండి మళ్లీ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై మరో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సు చేయాల్సిన అవసరం, సమయం లేదని భావించేవారుంటారు. ఇలాంటివారు సర్టిఫికెట్‌ కోర్సులతో సరిపుచ్చుకోవచ్చు.


అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌: ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ క్లౌడ్‌ ప్రాక్టీషనర్, ఎ.డబ్ల్యు.ఎస్‌. సొల్యూషన్స్‌ ఆర్కిటెక్ట్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.


మైక్రోసాఫ్ట్‌: ఐటీ రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ ఈ రంగంలో రాణించేందుకు మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌ సపోర్ట్‌ అసోసియేట్, మైక్రోసాఫ్ట్‌ సర్టిఫైడ్‌ అజర్‌ ఫండమెంటల్స్‌ వంటి స్వల్పకాల కోర్సులను అందిస్తోంది. వీటిని చేయడం ద్వారా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీలకు కావలసినవిధంగా సిద్ధం కావచ్చు. 


గూగుల్‌: ఈ వర్చువల్‌ ప్రపంచ దిగ్గజ సెర్చ్‌ ఇంజిన్‌.. ఆశావహుల కోసం గూగుల్‌ క్లౌడ్‌ డిజిటల్‌ లీడర్, గూగుల్‌ అసోసియేట్‌ క్లౌడ్‌ ఇంజినీర్‌ కోర్సులను నిర్వహిస్తోంది.  


విజయ సూత్రాలు

కావలసిన డిగ్రీ పూర్తి చేసి కొన్ని నైపుణ్యాలు నేర్చుకొని చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉద్యోగం మనకు ఎదురు రాదు కదా? ఇప్పటి పోటీ ప్రపంచంలో అదనంగా కృషి చేస్తేనే విజయం దక్కేది.


పని అనుభవం: ఉద్యోగార్థుల ఎడ్యుకేషన్‌ ట్రాక్, ప్రొఫైల్‌ ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, తీరా ఎంపిక చేశాక అసలు ఉద్యోగంలో నిజమైన నైపుణ్యాలు చూపగలుగుతారో లేదోనని కంపెనీలు సందేహిస్తున్నాయి. ఇందుకు పరిష్కారం పని అనుభవం  సాధించడమే. ప్రాక్టికల్‌ అనుభవం కోసం, చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేందుకు కొన్ని ఉచిత క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశాలను వినియోగించుకొని కొన్ని ప్రాజెక్టులు చేస్తే ఉద్యోగార్థుల ప్రొఫైల్‌ ప్రకాశవంతమవుతుంది. ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది..


పటిష్ఠ పోర్ట్‌ఫోలియో: క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై అనుభవం కోసం చేసే ప్రాజెక్టుల విషయంలో.. ఉద్యోగార్థులు తమకు అనుకూలమైనవని ఎంపిక చేసుకోకూడదు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న వాటినే కష్టమైనా సాధన చేసి ఉంచుకోవడం మంచిది. దీనివల్ల కంపెనీకి అభ్యర్థి పని అనుభవం నామమాత్రమో, లాంఛనప్రాయమో అన్న అభిప్రాయం రాకుండా ఉంటుంది.


కమ్యూనిటీలు, ఫోరమ్స్‌: క్లౌడ్‌ ప్రపంచంలో ఏం జరుగుతోంది? తాజా పరిణామాలేమిటి? ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ రంగపు ప్రొఫెషనల్స్‌ సభ్యులుగా ఉండే కమ్యూనిటీస్, వివిధ ఫోరమ్స్‌ మంచి వనరులు. ఉద్యోగార్థులు వీటిలో భాగస్వాములు కావడం ద్వారా తాజా విశేషాలతో అప్‌డేట్‌ అవుతుండవచ్చు. 


పెంచుకోవాల్సిన నైపుణ్యాలు

ప్రస్తుతం ఐటీ రంగంలో తళుకులీనుతున్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ క్రమేపీ మరింత భారీ మార్కెట్టుగా అవతరించనున్నది. ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు.. 

ఐటీ ఫండమెంటల్స్‌: నెట్‌వర్కింగ్, లినక్స్, డేటా బేస్‌లలో సామర్థ్యం.. క్లౌడ్‌ కంప్యూటింగ్‌కు ప్రాథమిక నైపుణ్య అవసరాలు. ఈ మౌలిక విషయాల్లో మాత్రం ఎటువంటి క్లిష్ట సవాళ్లనయినా పరిష్కరించగలిగే నైపుణ్యాలు ఉండాలి.

ప్రోగ్రామింగ్‌: దాదాపు ప్రతి ఐటీ నిపుణుడికీ ఉండాల్సిన ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పొజిషన్‌ ఆశించే ఉద్యోగార్థికీ ఉండాలి. క్లౌడ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్లో ఈ నైపుణ్య అవసరం ఉంటుంది.

క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌: క్లౌడ్‌ సేవలను అందించే ప్లాట్‌ఫామ్స్‌గా పేరు పొందిన ఎ.డబ్ల్యు.ఎస్‌., అజర్, గూగుల్‌ క్లౌడ్లపై పనిచేయగల నైపుణ్యాలను అలవర్చుకోవాలి.

కంటైనరైజేషన్‌: క్లౌడ్‌ క్షేత్రంలో వివిధ అప్లికేషన్స్‌ను ప్రవేశపెట్టడం, నిర్వహణకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే డాకర్, కుబేరనెట్స్‌ ఉపకరణాల (టూల్స్‌) నైపుణ్యాలు నేర్చుకోవాలి.


Published : 08 Oct 2025 01:28 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు