Artificial Intelligence: ఏఐలో ఇంకొంచెం..

Eenadu icon
By Features Desk Published : 02 Jul 2025 00:32 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఓ సముద్రం. ఎంత నేర్చుకున్నా కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి. నూతన అంశాలు వస్తూనే ఉంటాయి. దీన్ని ఉపయోగించడం తేలిక కావడం కోసం ఇప్పటికే అనేక అప్లికేషన్లు ఉన్నాయి.


ఈ జాబితాలో లాంగ్‌చెయిన్, లాంగ్‌గ్రాఫ్‌ కూడా వచ్చి చేరాయి. వీటి వినియోగం తెలుసుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలు అందుకోవడమే కాదు,  మరింత వేగవంతంగానూ, సమర్థంగా ఏఐతో పనిచేసే వీలుంటుంది.

ఐ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లో లాంగ్‌ చెయిన్, లాంగ్‌ గ్రాఫ్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ తరహా ఉద్యోగాల్లో ఉన్నవారు, కొత్తగా ఏఐలో అడుగు పెట్టాలనుకునేవారు.. ఈ టెక్నాలజీ నేర్చుకోవడం ద్వారా మరింత సమర్థంగా రాణించగలరు. ఎందుకంటే వివిధ ఏఐ ఏజెంట్స్‌ను తయారుచేయడంలో ఇవి కీలకంగా మారుతున్నాయి. ఏఐ ఉత్పత్తుల తయారీని ఇవి సులభతరం చేస్తున్నాయి.

  • ఈ టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల్లో ఏఐ ఏజెంట్స్‌ను అభివృద్ధి చేయడం, పనితీరును పర్యవేక్షించడం, జెనరేటివ్‌ ఏఐ అనువర్తనాలు తయారు చేయడం, లార్జ్‌ లాంగ్వేజ్‌ మాడ్యూల్స్‌తో పనిచేయడం వంటి విధులుంటాయి.
  • ఇప్పటికే చాలా కంపెనీలు లాంగ్‌చెయిన్‌ అండ్‌ లాంగ్‌గ్రాఫ్‌ తెలిసిన ఏఐ ఇంజినీర్లను కోరుకుంటున్నాయి. ఏఐ ఆధారిత సిస్టమ్స్, ఏజెంటిక్‌ వర్క్‌ ఫ్లోలను అభివృద్ధి చేయడం, ఎల్‌ఎల్‌ఎమ్స్‌ను ఇంటిగ్రేట్‌ చేయడం వంటి పనులు చేయగల నిపుణులు అవసరం అవుతున్నారు. డెవలపర్లు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు.. పైతాన్, జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌లో పట్టు ఉన్నవారు.. ఆ లాంగ్వేజెస్‌లో ఉన్న లాంగ్‌చెయిన్‌ ప్యాకేజీలను వాడుకునే వీలుంటుంది.
  • ఇది నిజానికి ఒక ఓపెన్‌సోర్స్‌ ఫ్రేమ్‌వర్క్‌. ప్రత్యేకమైన డిజైన్‌తో ఆసక్తికరంగా, క్లిష్టమైన అవసరాలకు ఉపయోగించుకునేలా ఉంటుంది. దీని సులభమైన ఇంటర్‌ఫేస్‌ ద్వారా వినయోగదారులు వివిధ ఎల్‌ఎల్‌ఎమ్స్‌ మధ్య సులభంగా మారేందుకు వీలుంటుంది. ఇంటిగ్రేషన్‌లోని క్లిష్టతను తగ్గిస్తుంది. లాంగ్‌గ్రాఫ్‌ను లాంగ్‌చెయిన్‌కు ఒక కొనసాగింపుగా చెప్పవచ్చు.

తేడా ఏమిటి?

లాంగ్‌చెయిన్‌.. ఒక లంకె మాదిరి చేయదగిన పనులకు ఉపయోగంగా ఉంటుంది. లీనియర్‌ చెయిన్స్, రిట్రైవల్‌ ఫ్లో ఉపయోగించి ఇంటర్‌ఫేస్‌ అందిస్తుంది. నేరుగా, స్పష్టంగా ఉండే టాస్కులకు ఇది బాగుంటుంది.
కానీ లాంగ్‌గ్రాఫ్‌ ఇలా కాదు. ఇది సైకిల్‌ గ్రాఫ్స్‌ వేస్తుంది. ఒక దాన్నుంచి మరోచోటికి వెళ్లే టాస్కులకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ వల్ల వినియోగదారులకు ఇంటరాక్షన్స్‌ మీద పూర్తిస్థాయి నియంత్రణ ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌ ఏజెంట్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌కు ఇది అత్యంత అనుకూలం. ఒక్కమాటలో చెప్పాలంటే లాంగ్‌చెయిన్‌ ఒకదానికి ఒకటి అనుసంధానంగా, తేలికగా ఉండే టాస్కులకు ఉపయోగపడితే.. లాంగ్‌గ్రాఫ్‌ గజిబిజి పనులకు ఉపకరిస్తుంది.


ఎలాంటి ఉద్యోగాలు

చాలా ఇంజినీరింగ్‌ ఉద్యోగాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. డిప్లాయ్‌మెంట్‌ ఇంజినీర్, ఫ్రంట్‌ఎండ్‌ ఇంజినీర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజినీర్, ప్రొడక్ట్‌ డిజైనర్, ఫుల్‌స్టాక్‌ ఇంజినీర్, టెక్నికల్‌ డాక్స్‌ రైటర్, ఏఐ ఇంజినీర్, ఏఐ-ఎంఎల్‌ బ్యాక్‌ఎండ్‌ డెవలపర్, ప్రాంప్ట్‌ ఇంజినీర్, పైతాన్‌ డెవలపర్, జెనరేటివ్‌ ఏఐ ఇంజినీర్‌.. ఇలాంటి ఎన్నో ఉద్యోగాల్లో ఈ స్కిల్‌తో మెరుగైన ప్రదర్శన ఇవ్వవచ్చు.


ఎక్కడ..

వీటి గురించి లాంగ్‌చెయిన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి చాలా వివరాలు తెలుసుకోవచ్చు. యుడెమీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాట్స్‌లో ప్రత్యేక  కోర్సులున్నాయి. యూట్యూబ్‌లోనూ ఉచితంగా సమాచారం లభిస్తుంది.


నేర్చుకోవడం..

1 ముందుగా ఈ రెంటికీ ప్రధానమైన తేడాలు, ప్రాథమికంగా చేసే పనుల గురించి తెలుసుకోవాలి. వీటిలో ఉండే ప్రతి ఫ్రేమ్‌ వర్క్‌ గురించి ట్యుటోరియల్స్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ముందు సింపుల్‌ అప్లికేషన్‌ నుంచి ప్రారంభించి తర్వాత కష్టతరమైనవి చేయడం నేర్చుకోవచ్చు.

2 లాంగ్‌చెయిన్‌లో అయితే చెయిన్స్, ప్రాంప్ట్స్, మోడల్స్‌ వంటి ప్రాథమిక అంశాలతో ప్రారంభించాలి. దీని అధికారిక డాక్యుమెంటేషన్, ట్యుటోరియల్స్‌ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. తొలుత చాట్‌బోట్స్‌ తయారీ, క్వశ్ఛన్‌ ఆన్సరింగ్‌ సిస్టమ్స్‌ వంటి వాటి నుంచి నేర్చుకుని.. ఆపైన రిట్రైవల్‌ ఆగ్‌మెంటెడ్‌ జనరేషన్‌ (ఆర్‌ఏజీ), ఎల్‌ఎల్‌ఎమ్‌ టూల్స్‌ వినియోగం నేర్చుకోవాలి.

3 లాంగ్‌గ్రాఫ్‌ను నేర్చుకునేందుకు దీని గ్రాఫ్‌ స్ట్రక్చర్‌ మీద అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్స్‌ తయారీలో ఇది ప్రధానం. గ్రాఫ్‌ స్టేట్స్‌ను తెలియజేయడం, నోడ్స్, ఎడ్జెస్‌ను కలపడం, ట్రాన్సిషన్స్‌ను నిర్వహించడం వంటివి తెలుసుకోవాలి. ఇక్కడ కూడా చాట్‌బోట్స్‌ వంటి ప్రాథమిక అంశాలతో మొదలుపెట్టి మెమొరీ, టూల్‌ యూసేజ్‌ వంటివి తెలుసుకోవాలి. విభిన్నమైన కేస్‌ స్టడీల ఆధారంగా సాధన చేయాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు