బీబీ కా మక్బారా దక్కన్‌ తాజ్‌మహల్‌

Eenadu icon
By Features Desk Published : 01 Nov 2025 01:12 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
5 min read

పోటీ పరీక్షల ప్రత్యేకం
భారతదేశ చరిత్ర
మొగల్‌ సామ్రాజ్యం - వాస్తు, శిల్ప కళలు

మొగలుల కాలంలో వాస్తు, శిల్పకళా రంగం అత్యున్నత స్థాయికి చేరింది. అత్యంత సుందరమైన, అద్భుతమైన కట్టడాలను మొగల్‌ చక్రవర్తులు నిర్మించారు. ఇండో పర్షియన్‌ శిల్ప కళారీతిని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ఘనత మొగల్‌ చక్రవర్తులదే. వీరు తొలి కట్టడాలను ఎర్ర ఇసుకరాయితో నిర్మించగా, జహంగీర్‌ కాలం నుంచి పాలరాతి వాడకం పెరిగింది. పేరుగాంచిన సుప్రసిద్ధ చిత్రకారులు వీరి కాలంలో ఉండేవారు. వీరు హిందుస్తానీ సంగీతాన్ని ఆదరించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు తాన్‌సేన్‌ అక్బర్‌ కాలానికి చెందినవాడు.

మొగల్‌ చక్రవర్తులు - ముఖ్య కట్టడాలు

బాబర్‌ 

ఇతడికి వాస్తు, శిల్పకళలో అభిరుచి ఉన్నప్పటికీ భారతదేశంలో ఇతడి పాలనా కాలం తక్కువగా ఉండటంతో చెప్పుకోదగిన నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం నాలుగు అతిసాధారణ మసీదులను మాత్రమే నిర్మించాడు. ఇవి పానిపట్, ఆగ్రా, ఢిల్లీ సమీపంలోని సంభాల్, అయోధ్యలో ఉన్నాయి.


హుమయూన్‌ 

వాస్తవంగా మొగల్‌ వాస్తు శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా ఢిల్లీలోని హుమయూన్‌ సమాధిని పేర్కొనవచ్చు. దీన్ని హుమయూన్‌ మరణానంతరం, ఆయన భార్య హమీదా బాను బేగం నిర్మించింది. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.

ఈ కట్టడం ముఖ్య లక్షణాలు: అష్ట భుజాకారంలో నిర్మించారు.

  • ఎత్తయిన వేదికపై ఉద్యానవనం మధ్యలో ఉంటుంది.
  • ఒకదాని కింద మరొకటిగా నిర్మించిన రెండు గుమ్మటాలు ఉంటాయి.
  • గుమ్మటాలు మాత్రం పాలరాతితో ఉండగా, మొత్తం కట్టడాన్ని ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు.
  • ఈ కట్టడంలో మినార్‌లు లేకపోవడం విశేషం.
  • ఇది సమర్ఖండ్‌లోని తైమూర్‌ సమాధిని పోలి ఉంటుంది.

అక్బర్‌ 

గ్రాలోని ఎర్రకోట, లాహోర్‌ కోట, అలహాబాద్‌ కోటలను నిర్మించాడు.

1572లో ఆగ్రాకు 36 కి.మీ.ల దూరంలో ఫతేపూర్‌ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించాడు. దీన్ని రాజధానిగా చేసుకుని అక్బర్‌ 1572-86 వరకు పరిపాలన కొనసాగించాడు. అనంతరం నీటి కొరత కారణంగా రాజధానిని లాహోర్‌కు మార్చాడు. కొంతకాలం తర్వాత రాజధానిని తిరిగి ఆగ్రాకు మార్చాడు. అక్బర్‌ ఫతేపూర్‌ సిక్రీ నగరంలో అనేక కట్టడాలను నిర్మించాడు. వాటిలో ముఖ్యమైనవి:

  • దివాన్‌-ఐ-ఆమ్‌: ప్రజలను కలిసే సమావేశ మందిరం
  • దివాన్‌-ఐ-ఖాస్‌: అధికారులను కలిసే సమావేశ మందిరం.
  • జామా మసీదు
  • షేక్‌ సలీం చిష్తీ దర్గా: ఇది అక్బర్‌ మతగురువు షేక్‌ సలీం చిష్తీ సమాధి. దీన్ని జామా మసీదు ఆవరణలో పాలరాతితో నిర్మించారు.
  • బులంద్‌ దర్వాజ: ఇది జామా మసీదు, షేక్‌ సలీం చిష్తీ దర్గాకు ద్వారం. దీని ఎత్తు 180 అడుగులు, వెడల్పు 90 అడుగులు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ద్వారమైన బులంద్‌ దర్వాజాను యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది.
  • జోథాబాయ్‌ ప్యాలెస్, సుల్తానా ప్యాలెస్, మరియం ప్యాలెస్, బీర్బల్‌ ప్యాలెస్‌.
  • ఇబాదత్‌ ఖానా
  • పంచ్‌మహల్‌: ఇది అయిదు అంతస్తుల కట్టడం. బౌద్ధ విహర ఆకారంలో నిర్మించారు.
  • అక్బర్‌ సమాధిని ఆగ్రా శివార్లలో సికంద్రా వద్ద నిర్మించారు. దీన్ని నిర్మాణాన్ని అక్బర్‌ స్వయంగా ప్రారంభించగా, అతడి కుమారుడు జహంగీర్‌ పూర్తిచేశాడు. దీనికి నాలుగు వైపులా పాలరాతితో నిర్మించిన మినార్‌లు ఉంటాయి.

ఔరంగజేబ్‌

రంగజేబ్‌ సనాతనవాదం మొగల్‌ వాస్తు శిల్పకళ అంతమయ్యేలా చేసింది. ఇస్లాం ప్రకారం రాజు ప్రజాధనాన్ని విలాసాల కొరకు దుర్వినియోగం చేయకూడదు. ఈ సూత్రాన్ని ఔరంగజేబ్‌ అమలు చేయడంతో మొగల్‌ వాస్తు శిల్పకళలు అంతమయ్యాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాల్లో ఖులాదబాద్‌ అనే పట్టణంలో ఔరంగజేబ్‌ని అత్యంత సామాన్యుడిలా సమాధి చేశారు. కేవలం రూ.14 ఖర్చుతో ఇతని దహన సంస్కారాలు పూర్తి చేశారు.

ఔరంగజేబ్‌ కాలంలో మూడు కట్టడాలు నిర్మితమయ్యాయి. అవి...

1) లాహోర్‌లోని బడాషాహీ మసీదు

2) ఢిల్లీ ఎర్రకోటలోని మోతీ మసీదు

3) ఔరంగాబాద్‌లోని బీబీ కా మక్బారా: ఇది ఔరంగజేబ్‌ భార్య రబియా-ఉద్‌-దుర్రాని సమాధి.

ఈమె అసలు పేరు దిల్రస్‌ భాను బేగం. ఔరంగజేబ్‌ కుమారుడు ఆజం షా దీన్ని నిర్మించాడు. ఇది తాజ్‌మహల్‌ను పోలి ఉండటంతో దీన్ని దక్కన్‌ తాజ్‌మహల్‌ అంటారు.


షాజహాన్‌ 

షాజహాన్‌ కాలంలో మొగల్‌ వాస్తు, శిల్పకళ అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. షాజహాన్‌ అనేక కట్టడాలను ఆగ్రా, ఢిల్లీ నగరాల్లో నిర్మించాడు.

ఆగ్రాకోటలోని నిర్మాణాలు: దివాన్‌-ఐ-ఆమ్, దివానీ ఖాస్, శీష్‌ మహల్, ఖాస్‌ మహల్, జాస్‌మిన్‌ ప్యాలెస్, పూర్తి పాలరాతితో నిర్మించిన మోతీ మసీదు.

ఆగ్రాలో యమునా నది ఒడ్డున అద్భుతమైన తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఇది తన భార్య ముంతాజ్‌ మహల్‌ (అర్జుమంద్‌ బాను బేగం) సమాధి. షాజహాన్‌ సమాధి కూడా ఇందులోనే ఉంటుంది.
తాజ్‌మహల్‌ విశిష్టతలు: దీన్ని 1631-53 మధ్య ఉస్తాద్‌ ఈసా ఆధ్వర్యంలో నిర్మించారు.

  • అష్ట భుజాకారంలో ఉంటుంది. పొడవు, వెడల్పులు సమానంగా ఉంటాయి.
  • ఒక ఎత్తయిన వేదికపై చార్‌బాగ్‌ అనే ఉద్యానవనంలో ఉంటుంది.
  • మక్రాన గనుల నుంచి తెచ్చిన పాలరాయిని దీని నిర్మాణానికి ఉపయోగించారు. ఇందులో అందమైన, అత్యంత ఖరీదైన పిత్రదుర అలంకరణ ఉంటుంది.
  • రెండు గుమ్మటాలు, నాలుగు అందమైన మినార్‌లు ఉంటాయి.
  • ఢిల్లీలో 1639-48 మధ్యలో ఉస్తాద్‌ హమీద్‌ ఆధ్వర్యంలో షాజహాన్‌ ఎర్రకోటను నిర్మించారు.

ఎర్రకోటలోని నిర్మాణాలు: రంగ్‌మహల్‌ లేదా ఇంతియాజ్‌ మహల్, ఖాన్‌ మహల్‌. నహర్‌-ఐ-బిహిష్, దివాన్‌-ఐ-ఆమ్‌.

దివాన్‌-ఐ-ఖాస్‌: ఇక్కడే సుప్రసిద్ధమైన నెమలి సింహాసనం ఉండేది. దివాన్‌-ఐ-ఖాస్‌ గోడలపై అమీర్‌ ఖుస్రూ రాసిన ‘భూమిపై స్వర్గం ఇదే’ అనే కవిత లిఖించి ఉంటుంది.

ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో షాజహాన్‌ జామా మసీదును నిర్మించాడు. ఇది భారతదేశంలోని అత్యంత పెద్ద మసీదుల్లో ఒకటి.


జహంగీర్‌ 

తడు చిత్రలేఖనానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వాస్తు, శిల్ప కళలను నిర్లక్ష్యం చేశాడు. కానీ ఇతడి భార్య నూర్జహాన్‌ రెండు ప్రధాన కట్టడాలను నిర్మించింది. అవి:

జహంగీర్‌ సమాధి: ఇది లాహోర్‌ సమీపంలోని షాదారా అనే ప్రాంతంలో దిల్‌కుషా ఉద్యానవనంలో ఉంది.

ఇత్‌మత్‌ ఉద్దౌల సమాధి: నూర్జహాన్‌ తన తండ్రి ఇత్‌మత్‌ ఉద్దౌల సమాధిని ఆగ్రాలో నిర్మించింది. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించిన తొలి మొగల్‌ సమాధి. ఇందులోనే మొదటిసారిగా పిత్రదుర అలంకరణ కనిపిస్తుంది. రంగురంగుల వైఢూర్యాలను పాలరాతి గోడల్లో పొదగడాన్ని ‘పిత్రదుర’ అంటారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని