కాస్మటాలజీ మెరుగేనా?

మా అమ్మాయికి పదో తరగతి పూర్తయింది. తనను కాస్మటాలజీ ఇంజినీరింగ్‌ చేయించాలని ఉంది. ఇంటర్లో ఏ గ్రూపు దీనికి అవసరం?

Published : 06 Jun 2016 03:17 IST

కాస్మటాలజీ మెరుగేనా?

* మా అమ్మాయికి పదో తరగతి పూర్తయింది. తనను కాస్మటాలజీ ఇంజినీరింగ్‌ చేయించాలని ఉంది. ఇంటర్లో ఏ గ్రూపు దీనికి అవసరం?

- కె. లక్ష్మన్న, డోన్‌, కర్నూలు జిల్లా

ఇంజినీరింగ్‌ విద్యలో కాస్మటాలజీ ఇంజినీరింగ్‌ అనేది ప్రత్యేకమైన కోర్సు. ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్లు, కాస్మటిక్స్‌కు ఆదరణ పెరుగుతున్న సందర్భంలో  కాస్మటాలజీ కోర్సుకు కూడా ఆదరణ పెరిగింది. మీ అమ్మాయికి ఈ కోర్సు చేయటానికి ఆసక్తి ఉన్నట్లయితే తప్పకుండా ఈ కోర్సులో చేర్పించవచ్చు. దీన్ని చదవటానికి ముఖ్యంగా ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథ్స్‌లతో ఇంటర్‌ చదివివుండాలి. ఈ కోర్సును తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. అయితే మహారాష్ట్రలోని కొన్ని యూనివర్సిటీలు నాలుగు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ కాస్మటిక్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నాయి. రాష్ట్ర సంత్‌ తుకడోజీ మహరాజ్‌ నాగపూర్‌ యూనివర్సిటీ, నికాలస్‌ మహిళా మహావిద్యాలయ, విద్యాభారతి మహా విద్యాలయ, సంత్‌ గాడ్జీ బాబా అమరావతి యూనివర్సిటీ, ఆర్‌.సి. పటేల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మా ఎడ్యు. అండ్‌ రిసర్చ్‌, లేడీ అమృత్‌బాయి డాగా కాలేజ్‌ అండ్‌ శ్రీమతి రత్నీదేవి పురోహిత్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌ మొదలైన విద్యాసంస్థలు బ్యాచిలర్‌ ఆఫ్‌ కాస్మటిక్‌ టెక్నాలజీ కోర్సును అందిస్తున్నాయి.


* సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫైనలియర్‌ చదువుతున్నాను. సర్వేయర్‌గా కెరియర్‌ మొదలుపెడదామని కోరిక. ఆంధ్ర, తెలంగాణల్లో శిక్షణ సంస్థలు ఎక్కడున్నాయి? ల్యాండ్‌ సర్వే ఇండియా సంస్థలో అవకాశాలు దొరుకుతాయా?
- ఎం. శ్రీనివాస్‌, రాజమండ్రి
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సర్వేయింగ్‌ కోర్సులో శిక్షణను అందిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్వేయింగ్‌ అండ్‌ మ్యాపింగ్‌ (హైదరాబాద్‌), సర్వేయర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ (హైదరాబాద్‌), సర్వే అకాడమీ (నూజివీడు) మొదలైన సంస్థలు సర్వేయింగ్‌లో శిక్షణ ఇస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ వారు నాలుగు నెలల కోర్సు అయిన సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ల్యాండ్‌ సర్వేయింగ్‌ కోర్సును పాలిటెక్నిక్‌ సంస్థల్లో అందిస్తున్నారు. అయితే ఈ కోర్సు చదవటానికి పదిమంది కన్నా ఎక్కువమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నపుడు మాత్రమే ఈ కోర్సును అందిస్తారు. వివిధ రకాల ప్రైవేటు సంస్థలు కూడా శిక్షణను ఇస్తున్నాయి. ల్యాండ్‌ సర్వే ఇండియా సంస్థలో అవకాశాలను ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా కల్పిస్తారు.
ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని