Boeing 737: రన్‌వేపై పేలిన బోయింగ్‌ విమానం టైరు..!

ఓ బోయింగ్‌ 737 విమానం ల్యాండింగ్‌ సమయంలో ముందు టైరు పేలిపోయిన ఘటన తుర్కియేలో చోటుచేసుకుంది.

Published : 09 May 2024 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తుర్కియేలోని ఓ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఓ బోయింగ్‌ 737 విమానం ల్యాండింగ్‌ సమయంలో ముందు టైరు పేలిపోయి రన్‌వే పైనే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 190 మంది ప్రయాణికులు ఉన్నట్లు తుర్కియే అధికారులు వెల్లడించారు.

జర్మనీలోని కొలోన్‌ నుంచి తుర్కియేలోని అంటాల్యాకు కొరెండన్‌ సంస్థకు చెందిన విమానం చేరుకుంది. రన్‌వేపై దిగుతోన్న సమయంలో ముందు ల్యాండింగ్‌ గేర్‌ విభాగం దెబ్బతింది. టైరు పేలి అక్కడే ఆగిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 184 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తుర్కియే రవాణాశాఖ మంత్రి అబ్దుల్ ఖాదిర్‌ పేర్కొన్నారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆ రన్‌వేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. విమానాలను సమీప ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.

దీనికి ఒకరోజు ముందు.. ఇస్తాంబుల్‌లోనూ ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. ఫెడ్‌ఎక్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 767 కార్గో విమానం.. ముందు ల్యాండింగ్‌ గేరు లేకుండానే దిగింది. దీనిపై తుర్కియే అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని