MEA: కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్‌ హత్య కేసుపై భారత్‌

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి కెనడా ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలను తమతో పంచుకోలేదని భారత్‌ స్పష్టం చేసింది.

Published : 10 May 2024 00:16 IST

దిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసు (Nijjar Murder Case)లో నిందితులుగా పేర్కొంటూ కెనడా (Canada) పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పరిణామాల వెనక రాజకీయ ప్రయోజనాలు దాగిఉన్నాయని భారత్‌ పేర్కొంది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు ట్రూడో సర్కారు రాజకీయ వేదిక కల్పించిందని మరోసారి స్పష్టం చేసింది. ఈ కేసులో దిల్లీపై చేస్తోన్న ఆరోపణలపై ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాధారాలను, సమాచారాన్ని ఆ దేశం పంచుకోలేదని తెలిపింది.

‘‘ఇటీవల అరెస్టు విషయంలో కెనడా కేవలం సమాచారమే ఇచ్చింది. అధికారికంగా మాతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు. పైగా.. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు, సంబంధిత సమాచారం ఇవ్వలేదు. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, హింసను ప్రోత్సహించేవారికి కెనడాలో రాజకీయ ఆశ్రయం లభిస్తోంది. మా దౌత్యవేత్తలు బెదిరింపులకు గురవుతున్నారు. వారి విధుల నిర్వహణకు ఆటంకం కలుగుతోంది. వ్యవస్థీకృత నేరాలతో ముడిపడిఉన్న వ్యక్తుల ప్రవేశానికి, ఆశ్రయానికి అనుమతి ఇస్తున్నారని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సంబంధిత వ్యక్తులను భారత్‌కు అప్పగించే విషయమై పలు అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాలన్నింటిపైనా దౌత్యస్థాయిలో చర్చలు సాగుతున్నాయి’’ అని భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియా సమావేశంలో తెలిపారు.

‘రెడ్‌లైన్‌ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్‌ హెచ్చరిక

గతేడాది జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో నిజ్జర్‌ హత్య జరిగింది. దీనివెనక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భగ్గుమన్నాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేసింది. ఈ కేసులో తాజాగా ఎడ్మంటన్‌ ప్రాంతంలో నివాసముంటున్న కరణ్‌ప్రీత్‌ సింగ్‌ (28), కమల్‌ప్రీత్‌ సింగ్‌ (22), కరణ్‌ బ్రార్‌ (22)లను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని