సైబర్‌ భద్రతలో పీజీ ఎలా?

ఎంబీఏ పూర్తిచేసి, ఖాళీగా ఉంటున్నాను. ఇంట్లో ఉండి పని (వర్క్‌ ఫ్రం హోం) చేసుకుని, ఆదాయం...

Published : 03 Apr 2017 01:47 IST

సైబర్‌ భద్రతలో పీజీ ఎలా?

ఎంబీఏ పూర్తిచేసి, ఖాళీగా ఉంటున్నాను. ఇంట్లో ఉండి పని (వర్క్‌ ఫ్రం హోం) చేసుకుని, ఆదాయం పొందే సలహా చెప్పగలరు.

- దివ్యవాణి, పాలకొల్లు

ఎంబీఏ పూర్తిచేసిన మీరు ఇంట్లో ఉండి, ఏదో ఒక పని చేయడం కంటే మీ చదువుకు తగిన ఉద్యోగాన్ని సంసాదించడానికి ప్రయత్నించండి.
మీకు ఉన్నత చదువులు చదవడానికి అవకాశం ఉంటే, కొనసాగించండి. ఒకటి, రెండు అవకాశాలు కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందాల్సిన పనిలేదు. పట్టుదలతో ప్రయత్నించండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి బాగాలేక, ఉన్నత చదువులు చదవలేని పరిస్థితిలో ఉంటే.. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా వర్క్‌ ఫ్రం హోం అవకాశాలను కల్పిస్తున్నాయి. వాటికి దరఖాస్తు చేసుకుంటే ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు స్టైపెండ్‌ కూడా పొందవచ్చు.


మా అబ్బాయి ఇంటర్‌ బైపీసీ చదివాడు. తరువాత బ్యాచిలర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఇంజినీరింగ్‌ చేయవచ్చా? అది ఏ యూనివర్సిటీలో ఉంది? అర్హతలు అవకాశాలు తెలుపగలరు.

- ఓ పాఠకుడు

చేయవచ్చు. అయితే మన దేశంలో మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు అతి తక్కువ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ కోర్సును భారతి విద్యాపీఠ్‌ యూనివర్సిటీ (పుణె), ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (చెన్నై) అందిస్తున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బనారస్‌ హిందూ యూనివర్సిటీ) బయో ఇంజినీరింగ్‌ కోర్సును అందిస్తోంది.
ఈ కోర్సును చదవడానికి ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివి ఉండాలి. ఐఐటీ లాంటి సంస్థలు జేఈఈ ద్వారా, ఇతర విశ్వవిద్యాలయాలు ఆ రాష్ట్ర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలను కల్పిస్తాయి.
ఈ కోర్సు చదివినవారికి ప్రధానంగా హెల్త్‌కేర్‌, ఫార్మాస్యూటికల్‌, హెల్త్‌కేర్‌ పరికరాల తయారీ రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి.
ఈ మెడికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివినవారికి బయోమెడికల్‌ ఇంజినీర్‌, ల్యాబ్‌ అడ్మినిస్ట్రేటర్‌, ఎక్విప్‌మెంట్‌ డిజైన్‌ ఇంజినీర్‌ మొదలైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.


బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివాను. సైబర్‌ భద్రత అంశంలో పీజీ చేయాలనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కోర్సు చేయాలనుంది. కోర్సు తరువాత ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

- కె. హుస్సేన్‌ వలీ, కర్నూలు

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా సైబర్‌ భద్రత అంశంలో పీజీ కోర్సు అందుబాటులో లేదు. ఎంఎస్‌సీ కంప్యూటర్‌ సైన్స్‌ అందుబాటులో ఉంది.
కచ్చితంగా సైబర్‌ సెక్యూరిటీ కోర్సు మాత్రమే చేయాలనుకుంటే, ఇతర విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ అందుబాటులో ఉందో తెలుసుకుని అక్కడ చదవండి. కోరుకున్న విశ్వవిద్యాలయంలోనే చదవాలనుకుంటే, అక్కడ అందుబాటులో ఉన్న కోర్సులను మాత్రమే చదవాల్సి వస్తుంది.
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా మాత్రమే ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ సంవత్సర నోటిఫికేషన్‌ (2017) ఇదివరకే వెలువడింది. ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోండి.
సైబర్‌ భద్రత అంశంలో పీజీ చదివినవారికి కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌, కంప్యూటర్‌ సపోర్ట్‌ స్పెషలిస్ట్‌, కంప్యూటర్‌ సిస్టమ్‌ అనలిస్ట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్‌, సైబర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌ మొదలైన ఉద్యోగావకాశాలు ఉంటాయి.


కెమిస్ట్రీ విభాగంలో ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కాకుండా ఇంకా ఏ కోర్సు మెరుగైంది? ఆ కోర్సు ఎక్కడ అందుబాటులో ఉంది? ఉపాధి అవకాశాలను తెలియజేయండి.

- డి. పూర్ణిమ, నిజామాబాద్‌

కెమిస్ట్రీ విభాగంలో ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు అప్లైడ్‌ కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ; ఇంకా ఫార్మాస్యూటికల్‌, ఇండస్ట్రియల్‌/ అనలిటికల్‌, ఆర్గానిక్‌, ఫిజికల్‌ అండ్‌ మెటీరియల్‌ కెమిస్ట్రీ లాంటి కోర్సులుంటాయి. వీటిలో ఏ కోర్సు మెరుగైందో చెప్పడం కష్టం. ప్రతీదీ దానికంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
చాలా విశ్వవిద్యాలయాల్లో కెమిస్ట్రీకి సంబంధించి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి. ఈ సబ్జెక్టు చదివినవారికి అనేక రంగాల్లో మంచి ఉద్యోగావకాశాలున్నాయి.
లేబొరేటరీ (మెడికల్‌, టెస్టింగ్‌), ఆయిల్‌, ఫార్మాస్యూటికల్‌, రసాయనాలు, కాస్మొటిక్‌, పరిశోధన, ఆహారం, రసాయనాల తయారీ సంస్థలు, హాస్పిటల్‌ మొదలైనవాటిల్లో ఉద్యోగావకాశాలుంటాయి. భారత్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఇస్రో లాంటి సంస్థల్లోనూ వీరికి ఉద్యోగావకాశాలుంటాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని