ఒకే ఏడాది రెండు కోర్సులు.. చెల్లుతాయా?

ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది...

Published : 13 Nov 2017 01:54 IST

ఒకే ఏడాది రెండు కోర్సులు.. చెల్లుతాయా?

* డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం దూరవిద్య ద్వారా ఎంఏ (తెలుగు) చేస్తున్నాను. దీంతోపాటు బ్యాచిలర్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌ను కూడా ఒకేసారి దూరవిద్యలో చేద్దామనుకుంటున్నాను. కుదురుతుందా?

- ఎల్‌. రమేష్‌, విశాఖపట్నం

* కేసారి రెండు డిగ్రీ కోర్సులను లేదా పీజీ కోర్సులను, ఒక డిగ్రీ, ఒక పీజీ కోర్సును విద్యార్థులు అభ్యసించినట్లయితే ఏదేని ఒక కోర్సు మాత్రమే పరిగణనలోకి వస్తుంది. మీరు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగినదాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సంబంధిత ఉద్యోగ ప్రకటననుబట్టి మీ విద్యార్హతను వాడుకోవాలి. అంతేతప్ప రెండు కోర్సులనూ ఒకే ఏడాది పూర్తిచేసినట్లు చూపిస్తే కొన్నిసార్లు చిక్కులు ఏర్పడే అవకాశముంది. కొన్ని సంస్థలు ఒక దూరవిద్య కోర్సు, ఒక రెగ్యులర్‌ కోర్సుకు వెసులుబాటు కల్పిస్తాయి.

దూరవిద్య కోర్సును అభ్యసించేముందు సంబంధిత విశ్వవిద్యాలయానికి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి ఉన్న విశ్వవిద్యాలయం నుంచే కోర్సును అభ్యసించాలి.

* టెక్నికల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా చదివితే చెల్లవని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది కదా! మా అమ్మ ఎంఎస్‌సీ కెమిస్ట్రీని 2005లో దూరవిద్య ద్వారా పూర్తిచేసింది. అది చెల్లుతుందా? ఇది ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతులపై ప్రభావం చూపించే అవకాశముందా?

- ఎన్‌. పూర్ణ చందు, హైదరాబాద్‌

* సంబంధిత విశ్వవిద్యాలయానికి దూరవిద్య ద్వారా కోర్సులను అందించడానికి యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ) వారి అనుమతి ఉందో లేదో తెలుసుకోవాలి. అనుమతి లేని విశ్వవిద్యాలయాల్లో కోర్సులను చేయడం వల్ల ఇబ్బందులు తప్పవు. దీనివల్ల ప్రభుత్వ సంస్థల్లో పదోన్నతులపై ప్రభావం ఉండే అవకాశముంది. కాబట్టి, మీ అమ్మగారు ఎంఎస్‌సీ చేసిన విశ్వవిద్యాలయానికి డీఈసీ అనుమతి ఉందో లేదో తెలుసుకోండి. అనుమతి ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు.

ఇక సుప్రీంకోర్టు విషయానికొస్తే.. టెక్నికల్‌ కోర్సులు అయినటువంటి ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, టౌన్‌ ప్లానింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, అప్లయిడ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ తదితర కోర్సులు అందించడానికి విశ్వవిద్యాలయాలు ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతి పొందని వాటినుంచి పట్టా పొందితే దానికి విలువ ఉండదు. ఏఐసీటీఈ అనుమతిని సాధారణంగా రెగ్యులర్‌ విధానంలో కోర్సులను అందించే సంస్థలకు మాత్రమే ఇస్తారు. ఇటీవల సుప్రీంకోర్టు అనుమతి లేని మూడు విశ్వవిద్యాలయాలు అందించిన టెక్నికల్‌ కోర్సులను రద్దు చేసింది.

* డిగ్రీ (బీజెడ్‌సీ) పూర్తిచేశాను. అగ్రికల్చర్‌పై ఆసక్తి ఉంది. నాకున్న విద్యావకాశాలను తెలియజేయండి. ఈ రంగంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది?

- రామకృష్ణ

* వ్యవసాయంపై మీకున్న ఇష్టానికి అభినందనలు. ప్రతి రంగం ఉన్నతవిద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తమదైన ప్రత్యేకతను కలిగివుంటుంది. కాబట్టి మీరు ఎంచుకున్న రంగంలో పట్టుదలతో శ్రమిస్తే భవిష్యత్తు బాగుంటుంది. బీజెడ్‌సీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారికి ఉన్నతవిద్య పరంగా మంచి అవకాశాలున్నాయి. వీరు ఎంఎస్‌సీలో అందుబాటులో ఉన్న బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్‌, జువాలజీ, కెమిస్ట్రీ, బయాలజీ మొదలైన ఐచ్ఛికాలను అభిరుచి మేరకు ఎంచుకోవచ్చు.

మీకు అగ్రికల్చర్‌పై ఆసక్తి ఉందన్నారు కాబట్టి.. ప్లాంట్‌ సైన్స్‌, ప్లాంట్‌ బయోటెక్నాలజీ, ప్లాంట్‌ పాథాలజీ, ఫారెస్ట్‌ బయోటెక్నాలజీ, ట్రాపికల్‌ ఫారెస్ట్రీ, సాయిల్‌ సైన్స్‌, మైక్రోబియల్‌ ప్లాంట్‌ బయాలజీ వంటి కోర్సులను అభ్యసించే అవకాశం ఉంది. సాధారణంగా ఈ రంగంలో పరిశోధనపరంగా మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అగ్రి బిజినెస్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌, ఐఐఎం అహ్మదాబాద్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఏఏఆర్‌ఎం) వారు అందిస్తున్న పీజీ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (అగ్రికల్చర్‌) కోర్సును అభ్యసించి మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.

* బీఎస్‌సీ (కంప్యూటర్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు పైలట్‌ కావాలనుంది. ఏ కోర్సులను ఎంచుకోవాలి?

- పద్మజ

* పైలట్‌ కావాలనుకునేవారు 10+2లో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లను చదవాల్సి ఉంటుంది. మన దేశంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వారు పైలట్‌ లైసెన్స్‌ను జారీ చేస్తారు. వారి అనుబంధ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ద్వారా శిక్షణ పొందినవారికి పరీక్ష నిర్వహించి పైలట్‌ లైసెన్స్‌ అందిస్తారు. ఫ్లయింగ్‌ స్కూల్‌కు దరఖాస్తు చేసుకునే ముందు క్లాస్‌-2 మెడికల్‌ పరీక్ష చేయించుకోవాలి. మెడికల్‌ పరీక్షలో ఆరోగ్యంగా ఉన్నారని తేలిన తరువాతే ఫ్లయింగ్‌ స్కూల్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్‌ శిక్షణ ఖర్చుతో కూడుకున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఫ్లయిటెక్‌ ఏవియేషన్‌ అకాడమీ, వింగ్స్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు డీజీసీఏ అనుమతితో శిక్షణ అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని