రక్షణ దళాల్లో చేరాలంటే..?

నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఆర్మీల్లో ఉన్నత క్యాడర్‌లో చేరాలంటే ఎలా ముందడుగు వేయాలి? ఎన్‌డీఏ, డిఫెన్స్‌ పరీక్షల గురించి తెలుపగలరు.....

Published : 23 Jan 2018 01:36 IST

రక్షణ దళాల్లో చేరాలంటే..?

నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఆర్మీల్లో ఉన్నత క్యాడర్‌లో చేరాలంటే ఎలా ముందడుగు వేయాలి? ఎన్‌డీఏ, డిఫెన్స్‌ పరీక్షల గురించి తెలుపగలరు.
- స్వరూప్‌, మిర్యాలగూడ

జ: సాధారణంగా ఒక వ్యక్తి ఉన్నత క్యాడర్‌ (నేవీ/ ఏర్‌ఫోర్స్‌/ ఆర్మీ)లో చేరాలంటే అకంఠిత దీక్ష,  శ్రమ, గురి కలిసి ఉండాలి. ఆర్మీలో ముఖ్యంగా మూడు రకాల ఆఫీసర్‌ ర్యాంకులు ఉంటాయి. నాన్‌ కమిషన్‌ ఆఫీసర్‌ (సిపాయి నుంచి హవిల్దార్‌)లో నాలుగు స్థాయులు ఉంటాయి. తరువాతది జూనియర్‌ కమిషన్‌ ఆఫీసర్‌ ర్యాంకులు (నాయిబ్‌ సుబేదార్‌, సుబేదార్‌, సుబేదార్‌ మేజర్‌). ఇక మూడోది, ఉన్నతమైనది కమీషన్డ్‌ ఆఫీసర్‌ ర్యాంకులు (లెఫ్టినెంట్‌, కెప్టెన్‌, మేజర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌, కల్నల్‌, బ్రిగేడియర్‌, మేజర్‌ జనరల్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌, జనరల్‌, ఫీల్డ్‌ మార్షల్‌). వీటిలో అన్నింటి కంటే ఉన్నతమైన క్యాడర్‌/ ర్యాంకు ఫీల్డ్‌ మార్షల్‌. ఇప్పటివరకూ ఈ ర్యాంకును ఇద్దరు మాత్రమే అందుకున్నారు. ప్రమోషన్‌ ద్వారా పై ర్యాంకులను చేరుకోవచ్చు.
ఎన్‌డీఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ) వారు నిర్వహించే పరీక్ష ద్వారా అభ్యర్థులు నేవీ, ఏర్‌ఫోర్స్‌, ఆర్మీల్లోకి ప్రవేశాన్ని పొందవచ్చు. ఈ పరీక్షలకు ప్రధాన (నేవీ, ఏర్‌) అర్హత 10+2లో మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్మీలో ప్రవేశానికి 10+2లో ఏ సబ్జెక్టు చదివినవారైనా అర్హులే. ప్రవేశపరీక్ష ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షను నిర్వహించి ఫిట్‌ అని తేలాక సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డువారు ఇంటెలిజెన్స్‌ పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా 10+2 కేడెట్‌ ఎంట్రీని ఆర్మీ/ నేవీ/ ఏర్‌ఫోర్స్‌లో కల్పిస్తారు.


ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌కి ఏ అర్హతలు?

ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలంటే.. ఏ అర్హతలుండాలి? ఏ ప్రవేశపరీక్ష రాయాలి?
- కిరణ్‌, తిరుపతి

జ: ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశాన్ని పొందాలనుకునేవారు 10+2 మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌లతో పూర్తిచేసినవారై ఉండాలి. మన రాష్ట్రంలో ఎంసెట్‌ ద్వారా స్టేట్‌ యూనివర్సిటీలు, ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అందిస్తున్న అనుబంధ కళాశాలల్లో తమ ర్యాంకు ఆధారంగా సీటు పొందవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం; జేఎన్‌టీయూ- కాకినాడ; లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌- మైలవరం, విజయవాడ పీవీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌- హైదరాబాద్‌; విజ్ఞాన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌- నల్గొండ ముఖ్యమైనవి.
ఐఐటీవారు నిర్వహించే జేఈఈ (జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌) ద్వారా ఐఐటీ- ఖరగ్‌పూర్‌, ఐఐటీ-మద్రాసు, ఐఐటీ-బాంబే వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాన్ని పొందవచ్చు. రానున్న కాలంలో ఏవియేషన్‌ రంగం మరింత అభివృద్ధి చెందుతుందనడంలో, మంచి ఉపాధి కలిపిస్తుంది అనడంలో సందేహం లేదు.


ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌ అవ్వాలంటే?

ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్‌ అవ్వాలని నాకు ఆసక్తి. దీనికి ఏం చదవాలి?
- మనీష, తిరువూరు

జ: ఉపాధ్యాయ వృత్తిమీద మీకున్న మక్కువకు అభినందనలు. సాధారణంగా ఈ వృత్తిలో ప్రిన్సిపల్‌ (ప్రభుత్వ కళాశాలకు) అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరాలంటే సంబంధిత పీజీ సబ్జెక్టులో యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ వారు నిర్వహించే నెట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఇంటర్‌ కళాశాలలో చేరడానికి నెట్‌ రాయాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ వృత్తిలో కళాశాల ప్రిన్సిపల్‌ కావడానికి ముఖ్య నియమం సీనియారిటీ అని చెప్పుకోవాలి. పీహెచ్‌డీ పట్టా పొందినవారికి త్వరగా ఇతరులతో పోలిస్తే ప్రిన్సిపల్‌ అయ్యే శాతం ఎక్కువ. ప్రమోషన్‌ ద్వారా వివిధ హోదాలను దాటుకుంటూ ప్రిన్సిపల్‌ హోదాను సాధించుకోవచ్చు.

ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని