Maruti Suzuki: లాభాల్లో మారుతీ రయ్‌ రయ్‌.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్‌

అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది.

Published : 26 Apr 2024 17:53 IST

Maruti Suzuki | దిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్టాండలోన్‌ పద్ధతిలో రూ.3,877.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది మార్చిలో నమోదైన రూ.2,623.6 కోట్లతో పోలిస్తే లాభం 47.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం. విక్రయాల్లో గణనీయమైన వృద్ధి నమోదవడంతో లాభాలు పెరగడానికి దోహదపడింది.

పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.13,209 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 64 శాతం పెరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 20 శాతం పెరిగి 1.40 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.125 చొప్పున తుది డివిడెండ్‌ ఇచ్చేందుకు బోర్డు సిఫార్సు చేసినట్లు కంపెనీ తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 20 లక్షల వాహనాలను విక్రయించినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో విక్రయాలు నమోదవడం ఇదే తొలిసారి. ఒక్క మార్చితో ముగిసిన త్రైమాసికంలోనే బాలెనో, స్విఫ్ట్‌, ఇన్‌విక్టో వంటి మోడళ్ల సాయంతో 5.84 లక్షల యూనిట్ల విక్రయాలు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. వరుసగా మూడో ఏడాదీ టాప్‌ ఎగుమతిదారుగా నిలిచినట్లు తెలిపింది. దేశం నుంచి ఎగుమతైన మొత్తం వాహనాల్లో 41.8 శాతం మారుతీవేనని కంపెనీ తెలిపింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి మారుతీ సుజుకీ షేరు 1.7 శాతం నష్టపోయి రూ.12,687.05 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని