LS polls: వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్‌ కేంద్రానికి!

న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్‌ సపోర్ట్‌ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Published : 26 Apr 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోలింగ్‌ రోజున వివిధ కారణాలు చూపుతూ ఎంతోమంది పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బద్దకిస్తుంటారు. ఓటు వేసేందుకు అన్ని వనరులు ఉన్నా.. యువతీ, యువకులు కూడా ఆసక్తి చూపకపోవడంతో పలు నగరాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదవుతోంది. కానీ, ఓ 78 ఏళ్ల వృద్ధురాలు మాత్రం ఇందుకు భిన్నం. న్యూమోనియాతో బాధపడుతూ, ఆక్సిజన్‌ సపోర్ట్‌ తీసుకుంటున్న ఆమె.. ఎలాగైనా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని భావించారు. దీంతో వైద్యుల సహకారంతో అంబులెన్సులో వెళ్లి ఓటు వేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరు జయానగర్‌కు చెందిన కళావతి.. ఇటీవల తీవ్ర దగ్గు, శ్వాస ఆడకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధ పడ్డారు. దీంతో వెంటనే స్థానిక మణిపాల్‌ ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం న్యూమోనియాగా నిర్ధరించారు. దాంతో ఆక్సిజన్‌ థెరపీతోపాటు యాంటీబయోటిక్స్‌, ఇతర వైద్య సేవలు కొనసాగించారు. తర్వాత ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడింది.

‘ఓటు వేయండి - లడ్డూ, దోశ ఉచితంగా తినండి’!

ఇలా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆ వృద్ధురాలు.. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని వైద్యులతో చెప్పారు. ఆమె ఉత్సాహాన్ని గమనించిన వైద్య సిబ్బంది.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయానగర్‌లోని పోలింగ్‌ కేంద్రానికి అంబులెన్సులో తరలించారు. వైద్య సిబ్బంది సహాయంతో స్ట్రెచర్‌పైనే లోనికి వెళ్లి.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం తన వేలుకు సిరాను చూపుతూ ఆనందాన్ని వ్యక్తంచేశారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆమె తీసుకున్న చొరవ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని