SBI: ఉద్యోగ వ్యూహం!

Eenadu icon
By Features Desk Published : 11 Aug 2025 03:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
6 min read

ఎస్‌బీఐలో 6589 క్లర్క్‌ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన జూనియర్‌ అసోసియేట్స్‌ పోస్టులకు మెరుగ్గా సన్నద్ధమయ్యేదెలాగో తెలుసుకుందాం! 

బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి దేశవ్యాప్తంగా 6589 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి రాష్ట్రాలవారీ నియామకాలు కాబట్టి తెలంగాణలో 320, ఆంధ్రప్రదేశ్‌లో 315 ఖాళీలు భర్తీ కానున్నాయి. 

ఎంపిక: రెండు దశల్లో నిర్వహంచే ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక భాషపై నిర్వహించే భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. అయితే 10/12వ తరగతిలో ఆ భాషను ఒక సబ్జెక్టుగా చదివితే.. ఈ పరీక్ష రాయనక్కర్లేదు. తుది ఎంపిక మెయిన్స్‌ మార్కుల ఆధారంగా ఉంటుంది. 

విభాగాలవారీ ఉత్తీర్ణత అవసరం లేదు: ఇతర బ్యాంకు పరీక్షల మాదిరి కాకుండా ఎస్‌బీఐ ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ఉండే విభాగాల్లో అభ్యర్థులు కనీస మార్కులతో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. అయితే సమయం విభాగాల వారీగా ఉంటుంది. 


సన్నద్ధత మెలకువలు

పరీక్ష విధానం, సిలబస్‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు ఎలా ఉంటాయి, ఏ టాపిక్స్‌ వస్తాయి, వేటికి ఎక్కువ ప్రాధాన్యం.. ముందుగా వీటిని బాగా తెలుసుకోవాలి. సిలబస్‌పై స్పష్టమైన అవగాహన ఉండాలి.

స్టడీ ప్లాన్‌: సన్నద్ధత ప్రారంభించేముందు స్పష్టమైన స్టడీ ప్లాన్‌ తయారు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లలోని అన్ని విభాగాలకూ సమయాన్ని ప్రాధాన్య క్రమంలో కేటాయించాలి. ప్రతిరోజూ ఏ విభాగంలో ఏ టాపిక్స్‌ చదవాలో ముందుగా నిర్ణయించుకుని.. వాటిని తప్పనిసరిగా పూర్తిచేయండి. ఇలాగే వీక్లీ టైమ్‌టేబుల్‌ కూడా సిద్ధం చేసుకోండి. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కి సమయం కేటాయించి వాటిపైనా పట్టు సాధించండి.  

మాదిరి/పూర్వ ప్రశ్నపత్రాలు: గతంలో జరిగిన పరీక్ష పేపర్లను సాల్వ్‌ చేయండి. దీనివల్ల ప్రశ్నల తీరు తెలుస్తుంది. కొన్నిసార్లు అవే ప్రశ్నలు పునరావృతం కావొచ్చు. వారంలో కనీసం ఒకట్రెండు మోడల్‌ పేపర్స్‌ రాయండి. దీనివల్ల ఏ విభాగం ఎంత సమయంలో పూర్తిచేయాలో, మీరు ఎక్కడ సౌకర్యవంతంగా/ ఇబ్బందిగా ఉన్నారో తెలుస్తుంది. వాటిని అధిగమించేలా సన్నద్ధత మెరుగు పరుచుకోవచ్చు. పరీక్షకు 15 రోజుల ముందు నుంచీ ప్రతిరోజూ ఒకటి రెండు మాక్‌ టెస్టులు రాయండి. 

స్పీడ్‌ అండ్‌ యాక్యురసీ: స్వల్ప సమయంలో వేగంగా ప్రశ్నలు సాధించాలి. రుణాత్మక మార్కులు ఉండటంతో కచ్చితత్వంతో జవాబులు గుర్తించాలి. అందుకని స్పీడ్‌ అండ్‌ యాక్యురసీపై దృష్టి సారించండి. వేగంగా సాధించడానికి షార్ట్‌కట్‌ పద్ధతులు నేర్చుకోండి. కాలిక్యులేషన్స్‌ వేగంగా చేయడానికి స్పీడ్‌ మేథమెటిక్స్‌ టెక్నిక్స్‌ నేర్చుకుని ఉపయోగించండి. తప్పులు లేకుండా కచ్చితమైన సమాధానాల కోసం సాధన చేయాలి, చేస్తూనే ఉండాలి. 

జనరల్‌ అవేర్‌నెస్‌పై సమాన దృష్టి: ఎక్కువమంది ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్‌లకు ప్రాధాన్యం ఇచ్చి జనరల్‌ అవేర్‌నెస్‌పై తక్కువ దృష్టి పెడతారు. కానీ అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమైన మెయిన్స్‌లోని ఈ విభాగం మార్కులూ కీలకమే. కాబట్టి మొదటి నుంచీ దీనికీ సన్నద్ధమవ్వాలి. రోజూ దిన పత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను పాయింట్ల రూపంలో నోట్స్‌ రాసుకోండి. ప్రతివారం వాటిని పునశ్చరణ చేస్తే సరిపోతుంది. 


పరీక్షల్లో వైఫల్యమా? 

కొంతమంది తరచుగా పరీక్షలు రాస్తున్నప్పటికీ విఫలమవుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే...  

1 ప్రణాళిక లోపం: సన్నద్ధత ప్రణాళిక లేకుండా ఏది పడితే అది చదవడం, ముఖ్యాంశాలను కవర్‌ చేయలేకపోవడం వల్ల సన్నద్ధత అసంపూర్ణంగా ఉంటుంది. 

2 సాధనలో వైవిధ్యం లేకపోవడం: ఒకేరకమైన ప్రశ్నలను పదే పదే సాధన చేయడం.. వివిధ రకాల ప్రశ్నలను సాధించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుతం పరీక్షల్లో అడిగే తరహా ప్రశ్నలను గుర్తించి ఆ ట్రెండ్‌కు తగినట్లుగా సాధన కొనసాగించకపోవడం వల్ల పరీక్షలో మార్కులు సాధించలేరు. 

3 బలహీన టాపిక్స్‌ వదిలేయడం: తాము బలహీనంగా ఉండే టాపిక్స్‌ను కొందరు వదిలేస్తుంటారు. అందువల్ల ఆ ప్రశ్నలను సాధించలేకపోతారు. ‘నాకిది రాదు’ అని ముందుగానే భావించి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయరు. 

4 నచ్చిన విభాగాలకే అధిక సమయం: కొంతమంది తమకు నచ్చే/సౌకర్యంగా భావించే టాపిక్స్‌పైనే ఎక్కువ సమయం కేటాయిస్తారు. దీనివల్ల మిగిలిన విభాగాలపై తగినంత పట్టులేక విఫలమవుతుంటారు. 

5 సరైన విశ్లేషణ లేకపోవడం: కొందరు రాసిన టెస్టులను సరిగా విశ్లేషించరు. పరీక్ష రాశాక దాన్ని విశ్లేషించుకున్నపుడే లోపాలు, తక్కువ స్కోరు చేస్తున్న టాపిక్స్‌ తెలుస్తాయి. వాటిని అధిగమించేలా సాధన చేసినప్పుడే స్కోరు పెరుగుతుంది. 

6 అనవసర జాప్యం: ‘పరీక్షకు సమయం ఉంది కదా’ అనే భావంతో సన్నద్ధతను నిదానంగా మొదలుపెడతారు కొందరు. దాంతో చివరిలో సమయం సరిపోక, అసంపూర్ణ సన్నద్ధత వల్ల నష్టపోతారు.  

7 పునశ్చరణ: చదివినవి పునశ్చరణ చేయనందున పట్టు సాధించలేరు. ముఖ్యమైన ఫార్ములాలు కూడా మరిచిపోతారు. 

8 పోటీ స్థాయి: బ్యాంకు పరీక్షల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని గ్రహించకపోవడం, కటాఫ్, ప్రస్తుతం ప్రశ్నలు వచ్చే ట్రెండ్లను అర్థంచేసుకోకపోవడం. 

9 పరీక్ష ఒత్తిడి: పరీక్షలంటే ఆందోళన, భయం ఉండటం వల్ల తెలిసిన ప్రశ్నలక్కూడా తప్పు సమాధానాలు గుర్తిస్తారు.  వీలైనన్ని మాక్‌ టెస్టులను నిత్యం రాస్తుంటే భయం తగ్గుతుంది. 
వీటన్నిటినీ సరిదిద్దుకుంటే తప్పక విజయం సాధిస్తారు. 


ముఖ్యమైన టాపిక్స్‌

న్యూమరికల్‌ ఎబిలిటీ/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్, నంబర్‌ సిరీస్, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, డేటా సఫిషియెన్సీ (మెయిన్స్‌లో మాత్రమే), వివిధ అరిథ్‌మెటిక్‌ టాపిక్స్‌ (నంబర్‌ సిస్టమ్, రేషియో, పార్టనర్‌షిప్, యావరేజ్, ఏజెస్, పర్సంటేజ్, ప్రాఫిట్‌- లాస్, సింపుల్‌- కాంపౌండ్‌ ఇంటరెస్ట్, టైమ్‌- వర్క్, టైమ్‌- డిస్టెన్స్, ట్రెయిన్స్, బోట్స్‌ అండ్‌ స్ట్రీమ్స్, మెన్సురేేషన్, ఎలిగేషన్‌ అండ్‌ మిక్చర్, పర్ముటేషన్‌ అండ్‌ కాంబినేషన్, ప్రాబబిలిటీ). ప్రిలిమ్స్, మెయిన్స్‌లలో వచ్చే టాపిక్స్‌ ఒకటే అయినా మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. 

రీజనింగ్‌: సీటింట్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ పజిల్స్‌ నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలుంటాయి. వీటితోపాటు, ఆల్ఫాన్యూమరిక్‌ సిరీస్, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్‌ సెన్స్, ఇన్‌ఈక్వాలిటీ, ఆర్డర్‌ అండ్‌ ర్యాంకింగ్, సిలాజిజమ్‌ మొదలైన వాటితోపాటు మెయిన్స్‌ పరీక్షలో ఇన్‌పుట్‌- అవుట్‌పుట్, డేటా సఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌లోని స్టేట్‌మెంట్‌ ప్రశ్నలు, డెసిషన్‌ మేకింగ్‌ ప్రశ్నలు ఉంటాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్, పజిల్స్‌ ప్రశ్నలు మెయిన్స్‌ పరీక్షలో హెచ్చు స్థాయిలో ఉంటాయి. ప్రతిరోజూ తప్పనిసరిగా రెండు మూడు పజిల్స్‌ సాల్వ్‌ చేయాలి. 

ఇంగ్లిష్‌: దీనిలో ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండిటిలో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు (7-10) ఉంటాయి. దీంతోపాటు ఒకాబ్యులరీ (సిననిమ్స్, యాంటనిమ్స్‌), గ్రామర్‌ ఆధార ప్రశ్నలు ఉంటాయి. క్లోజ్‌టెస్ట్, ఎర్రర్‌ డిటెక్షన్, పారా జంబుల్డ్, ఫిల్లర్స్‌ (సింగిల్, డబుల్‌), వర్డ్‌ యూసేజ్, మ్యాచ్‌ ద కాలమ్, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్‌ మొదలైనవి). 

జనరల్‌/ ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌: ఎకనామిక్‌/ బ్యాంకింగ్‌ రంగాల 6-8 మాసాల కరెంట్‌ అఫైర్స్‌పై ఎక్కువ ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్‌ సిస్టమ్, ఆర్‌బీఐ, పేమెంట్‌ సిస్టమ్స్, ఫైనాన్షియల్‌ టర్మ్‌లు, ఎబ్రివేషన్స్, ప్రభుత్వ పథకాలు, బడ్జెట్‌ ముఖ్యాంశాలు, ముఖ్యమైన దినోత్సవాలు, బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు, ఛైర్మన్‌లు, ముఖ్యమైన వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, పుస్తకాలు-రచయితలపై ప్రశ్నలు వస్తాయి. 

కంప్యూటర్‌ అవేర్‌నెస్‌: ఇది రీజనింగ్‌ విభాగంలో భాగం. 4, 5 ప్రశ్నలు దీని నుంచి రావొచ్చు. దీని కోసం కంప్యూటర్‌ బేసిక్స్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్‌ సిస్టమ్, ఎంఎస్‌-ఆఫీస్, ఇంటర్నెట్, నెట్‌-వర్కింగ్, కంప్యూటర్‌ సెక్యూరిటీ, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, షార్ట్‌కట్‌ కీలు, ఎబ్రివేషన్స్, ఫ్లో ఛార్టులు మొదలైనవి బాగా చూసుకోవాలి.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని