LIC: ఎల్‌ఐసీలో ఆఫీసర్ అవుతారా!

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ఉద్యోగ నియామకాలు చేయబోతోంది. జనరలిస్ట్ విభాగంలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సాధారణ డిగ్రీతోనే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక, ప్రధాన, మౌఖిక పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే రూ.1,26,000 వేతనం అందుకోవచ్చు.
ఇప్పటికే బ్యాంకు, రైల్వే, ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు ఎల్‌ఐసీ ఏఏవో పోస్టులకు పోటీ పడొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు లేవు. అలాగే ప్రిలిమ్స్, మెయిన్స్ ఆంగ్లంలో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఈ విభాగం మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఇవన్నీ అభ్యర్థులకు సానుకూల అంశాలు.
అత్యంత ఆకర్షణీయ వేతనం, తక్కువ పని ఒత్తిడి, పదోన్నతులు, ఇతర ప్రోత్సాహకాలూ.. ఇవన్నీ ఎల్‌ఐసీ ప్రత్యేకతలు!
ప్రాథమిక పరీక్ష
ఆన్‌లైన్‌లో వంద మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్ ఎబిలిటీ 35, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, ఇంగ్లిష్ 30 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. పరీక్ష వ్యవధి గంట. ప్రతి విభాగాన్నీ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్హత కోసం రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒక్కో విభాగం నుంచి 18 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 16 చొప్పున రావాలి. ఆంగ్లంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 9, మిగిలినవారు 10 సాధించాలి. అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి విభాగాలవారీ ఖాళీలకు 20 రెట్ల మందిని ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు.
ప్రధాన పరీక్ష
300 మార్కులకు ఆబ్జెక్టివ్, 25 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో ఆన్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 300 మార్కులు. పరీక్ష వ్యవధి 2 గంటలు. రీజనింగ్ 30 ప్రశ్నలకు 90 మార్కులు. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి.
ఈ విభాగంలో అర్హతకు 45 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 చాలు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ విభాగంలో 30 ప్రశ్నలకు 60 మార్కులు. 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. కనీసం 30 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 27 తప్పనిసరి. మరో విభాగం డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలకు 90 మార్కులు. 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్హతకు 45 మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 చాలు. ఇన్‌స్యూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్‌నెస్ నుంచి 30 ప్రశ్నలకు 60 మార్కులు. 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. అర్హత మార్కులు 30. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 27 తప్పనిసరి. ఆబ్జెక్టివ్ టెస్టు పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ పరీక్ష మొదలవుతుంది. ఇందులో 2 ప్రశ్నలకు 25 మార్కులు. 30 నిమిషాల్లో సమాధానం రాయాలి. ఈ విభాగంలో అర్హతకు కనీసం 10 మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 9 చాలు. మెయిన్స్‌లో అర్హత సాధించినవారి జాబితా నుంచి విభాగాల వారీ ఖాళీలకు మూడు రెట్ల మందిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
మౌఖిక పరీక్ష
60 మార్కులకు ఉంటుంది. ఇందులో 30 మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 27 మార్కులు సరిపోతాయి. ఇలా అర్హత సాధించిన వారి జాబితాకు ప్రధాన పరీక్షలో పొందిన మార్కులను జతచేసి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం తుది నియామకాలు చేపడతారు. ప్రాథమిక పరీక్ష మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు.
410 పోస్టులకు మరో ప్రకటన
ఎల్‌ఐసీ ఏఏఓ స్పెషలిస్ట్ విభాగంలో 410 పోస్టులకు మరో ప్రకటన విడుదల చేసింది. వాటికీ ప్రాథమిక పరీక్ష ఏఏఓ జనరలిస్ట్ మాదిరిగానే ఉంటుంది.  
ప్రభుత్వ అనుబంధ సంస్థ.. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఐఏసీఎల్) 550 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. 
ఇందులో 193 జనరలిస్ట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ఎల్‌ఐసీ మాదిరిగానే ఉంటుంది. రెండు పరీక్షలనూ ఒకే సన్నద్ధతతో ఎదుర్కోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.08.2025. 
వెబ్‌సైట్: https://www.newindia.co.in/
సన్నద్ధత ఇలా..
- ప్రాథమిక పరీక్ష పూర్తిగా.. ఐబీపీఎస్, ఎస్‌బీఐ పీవో స్టేజ్-1 మాదిరిగానే ఉంటుంది. ఇప్పటికే బ్యాంకు పీవో పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవారు ప్రిలిమ్స్ విషయంలో అదే సన్నద్ధతతో సిద్ధం కావచ్చు. విభాగాలవారీ సమయాన్ని, కనీస మార్కులను నిర్దేశించారు. వ్యవధిలోగా ఎక్కువ ప్రశ్నలు పూర్తిచేయడానికి, కనీస మార్కులు సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. అనంతరం అదనపు మార్కులకోసం ప్రయత్నించాలి.
 - ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ప్రాధాన్యంగా ఉన్నవి రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ అనాలిసిస్. మార్కుల పరంగా చూసినా.. ప్రాథమిక పరీక్షలో 70, ప్రధాన పరీక్షలో 180 అంటే రెండింటిలోనూ 400 కుగానూ కేవలం ఈ విభాగాల నుంచే 250 మార్కులు వస్తున్నాయి. అందువల్ల అధిక ప్రాధాన్యంతో వీటిని చదువుకోవాలి.
 - ఆంగ్లంతో ఇబ్బందిలేనివాళ్లు ఆ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి అవసరం లేదు. తెలుగు మీడియం నేపథ్యం వారు కనీస మార్కుల సాధన దిశగా కృషి చేస్తే సరిపోతుంది.
 - పరీక్షకు ముందు కనీసం 10 మాక్ పరీక్షలు రాయాలి. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలుగుతున్నారా, ఎన్ని మార్కులు సాధిస్తున్నారు గమనించాలి. ఫలితాలు విశ్లేషించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ల్లో కనీస అర్హత మార్కులు సాధిస్తూ రెండూ కలిపి 60 మార్కులకు తగ్గకుండా వచ్చినట్లు చూసుకుంటే ప్రధాన పరీక్షకు ఎంపికవ్వొచ్చు.
 - పరీక్షలో కొన్ని ప్రశ్నలకు జవాబు గుర్తించడం తెలిసినప్పటికీ అందుకు ఎక్కువ వ్యవధి అవసరం అవుతుంది. అలాంటివాటిని సమయం ఉంటే ప్రయత్నించాలి. అలాగే మరికొన్ని ప్రశ్నలు చదవడానికే ఎక్కువ వ్యవధి తీసుకుంటాయి. వీటిని చివరలో సమయం ఉంటేనే ప్రయత్నించాలి. పోటీ పరీక్షల్లో విజయానికి విజ్ఞానంతో పాటు ఏ ప్రశ్నలు ముందు సాధించాలి, వేటిని తర్వాత ప్రయత్నించాలో నిర్ణయించుకోగల నైపుణ్యానికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేటిని వదులుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు మాక్ పరీక్షలే మార్గదర్శి.
 - జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇన్‌స్యూరెన్స్, ఫైనాన్షియల్ అవేర్‌నెస్ విభాగాలను ప్రాథమిక పరీక్షల అనంతరం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించి చదువుకుంటే సరిపోతుంది.
 
ముఖ్యమైన అంశాలు
అర్హత: ఏదైనా డిగ్రీ
వయసు: 01.08.2025 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో మినహాయింపులుంటాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.09.2025
దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.85. మిగిలిన అందరికీ రూ.700. ప్రిలిమ్స్
పరీక్ష తేదీ: 03.10.2025
మెయిన్స్ తేదీ: 08.11.2025
వెబ్‌సైట్: https://licindia.in/en/web/guest/careers
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


