Railway Jobs: రైల్వేలో కొలువుల జాతర.. మరో జాబ్‌ నోటిఫికేషన్ వచ్చేస్తోంది!

ఇప్పటికే అసిస్టెంట్‌ లోకోపైలట్‌, టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించిన రైల్వే శాఖ.. తాజాగా మరో 4,660 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వివరాలివే..

Published : 20 Mar 2024 16:37 IST

Railway Jobs | ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే శాఖలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల 5 వేలకు పైగా అసిస్టెంట్‌ లోకో పైలట్‌, 9 వేలకు పైగా రైల్వే టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వేశాఖ.. తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఏప్రిల్‌ 15 నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ పేర్కొంది.  అయితే, గత నెలలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టగా దాన్ని ఖండించిన రైల్వేశాఖ అధికారులు.. తాజాగా  ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ నోట్‌ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో పేర్కొన్న ప్రాథమిక వివరాలివే..

సెబీలో ఉద్యోగాలు.. నెలకు ₹లక్షన్నర వేతనం!

  • మొత్తం పోస్టులు 4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్‌, 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి. 
  • అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.
  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్‌ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • వేతనం: ఎస్సై పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు.
  • రీజియన్ల వారీగా ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగ ఖాళీలు, పరీక్ష సిలబస్‌, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు నోటిఫికేషన్‌ ద్వారా వెల్లడి కానున్నాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని