Gold Career: పసిడి కాంతుల పచ్చని కెరియర్!

మంచి కెరియర్లో ప్రవేశించి నైపుణ్యాలతో రాణిస్తుంటే భవిత బంగారుమయమవుతుందంటాం. మంచి కారు, సొంత ఇల్లు, నగలు కొనుక్కొని జీవితాన్ని ధగధగలాడేలా తీర్చి దిద్దుకోవచ్చనుకుంటాం. మరి కెరియరే బంగారు ఆభరణాలతో ముడిపడితే ఎలా ఉంటుంది! ఇండియన్ గోల్డ్ జ్యూలరీ జెమ్స్ పరిశ్రమ 50 లక్షల మందికి ఉపాధినిస్తోంది. ప్రస్తుతం సాంకేతిక సొగసులు అద్దుకొని కొత్త తరాన్ని స్వాగతిస్తోంది!
రోజూ రెండు రకాల వార్తలను వింటున్నాం, చదువుతున్నాం. ఒకటి ప్రపంచంలో ఏదో ఒక మూల యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుంటే, రెండోది - ఏ రోజుకారోజు చుక్కలను చేరుతున్న బంగారం ధరలు. అప్పుడప్పుడూ ఈ రెండిటికీ సంబంధం ఉందన్న విశ్లేషణలు వస్తుంటాయి. ఎప్పటికీ తరగనిది, నిత్యం విలువ పెరుగుతూ ఉండేది స్వర్ణ ఆభరణాలనేది స్పష్టం. విశ్వమంతా విశాల విపణి కావడంతో నేడు గోల్డ్ జ్యూలరీ, జెమ్స్ ఇండస్ట్రీ కొత్త అవకాశాలతో ఆహ్వానిస్తోంది.
మనం రోజూ చూసే ఆభరణాల వెనుక విస్తుపోయే భారీ మార్కెట్ దాగి ఉంది. ఏయేటికాయేడు విస్తరిస్తున్న వ్యాపారం ఉంది. వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల్లో విభిన్న ఉద్యోగాలున్నాయి. ఇందుకు కారణం- ఒక పక్క బంగారం ధరలు రాకెట్లా దూసుకెళుతున్నా డిమాండ్ మాత్రం చెక్కుచెదరకపోవటం. 2023లో 774 టన్నులుగా ఉన్న దేశంలో బంగారం డిమాండ్ 10 శాతం పెరిగి 2025లో 800 టన్నులు దాటింది. ఈ రెండేళ్ళలో బంగారం రేటు 31 శాతం పెరిగినా డిమాండ్ మాత్రం చెక్కుచెదరలేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తేల్చి చెప్పింది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో ఏడు శాతానికి చేరిన గోల్డ్, డైమండ్ వ్యాపారం ప్రభుత్వానికీ వరప్రదాతగా నిలిచింది.
ప్రభుత్వ ప్రోత్సాహం
పళ్లెం బంగారమైనా దాని ధగధగలు చూడాలంటే గోడ చేర్పు కావాలంటారు. విలువ రీత్యా చకచకా పైకి ఎగబాకుతున్న స్వర్ణ పరిశ్రమకు కావలసిన ఇంధనాన్ని కేంద్ర ప్రభుత్వం వివిధ విధానాల ద్వారా సమకూరుస్తోంది.
- ఎగుమతులకు అనువైన ప్రాధాన్య రంగంగా స్వర్ణ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహిస్తోంది.
 - బంగారం కొనుగోలుకు గమ్యస్థానంగా పరిగణించే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (దుబాయి)లో వజ్రాల, ఆభరణాల తయారీకి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
 - 2023 నవంబర్ - 2024 జనవరి మధ్య మూడు నెలలపాటు భారత్ రత్న మెగా పి.ఎఫ్.సి. పేరిట దేశంలోని ఆభరణాల తయారీదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యమ్రాలు నిర్వహించింది.
 - అంతర్జాతీయ స్వర్ణ మార్కెట్లో బ్రాండ్ ఇండియా ప్రగాఢ ముద్ర కోసం వివిధ ఈవెంట్సును వరుసగా నిర్వహిస్తోంది.
 
బడా కంపెనీలు- భారీ ప్రణాళికలు
దేశంలో ఆభరణాల తయారీ కంపెనీలు వ్యవస్థీకృత రంగంలో 450 ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కలిసి చేసే జాతీయ, అంతర్జాతీయ ఆభరణాల విలువ 2027 నాటికి 8 లక్షల 50వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అవ్యవస్థీకృత మార్కెట్టుపై శాస్త్రీయ గణాంకాలు అందుబాటులో లేనప్పటికీ ఇంటింటికీ ఓ స్వర్ణకారుని సేవలు భారతీయ సంస్కృతిలో భాగమని మరువలేము. దేశంలో అవ్యస్థీకృత స్వర్ణ విపణి వ్యవస్థీకృత మార్కెట్టుకు సమానంగా ఉంటుందని అంచనా. అంటే 50 లక్షల మంది వ్యవస్థీకృత సంస్థల ద్వారా ఉపాధి పొందితే.. మరో 50 లక్షల మంది అవ్యవస్థీకృత రంగంలో సేవలందిస్తున్నారు. అంతా కలిసి దేశ ఆభరణాల పరిశ్రమ కోటి మందికి తగ్గకుండా నీడనిస్తోంది
ఆధునిక హంగులు
పెరటి వ్యాపకంగా ఉండే కోళ్ల పెంపకం పౌల్ట్రీ వ్యాపారంగా రూపుదిద్దుకున్నట్టూ.. వేన్నీళ్లకు చన్నీళ్లన్నట్టుండే పాల వ్యాపారం మిల్క్ అండ్ డెయిరీ ప్రొడక్ట్స్‌గా విశ్వరూపం చూపిస్తున్నట్టూ బంగారం వ్యాపారం కూడా కొత్త సింగారాలు పోతోంది. సాంప్రదాయికంగా పొందే స్వర్ణకారుని సేవలు కళ్లు మిరుమిట్లు గొలిపే షోరూమ్స్‌గా వెలిశాయి. నగరాలు, రాష్ట్రాలు, దేశాల సరిహద్దులు దాటి వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. లక్షల డిజైన్ల ఆర్నమెంట్స్‌తో కోట్ల వినియోగదారుల హృదయాలను కొల్లగొడుతున్నాయి. అడ్వాన్స్ గోల్డ్ పర్చేజ్ స్కీమ్ నుంచి కస్టమైజ్డ్ జ్యూలరీ మేకింగ్ వరకూ కొత్త బిజినెస్ వ్యూహాలతో వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళుతున్నాయి
అవకాశాలు అపారం
అవకాశాల అన్వేషణలో ఉన్న ఉద్యోగార్థులు ఒక పరిశ్రమను ఇంతగా ఎందుకు అధ్యయనం చేయాలంటే... ఇండస్ట్రీ ఎదుగుదలపైనే కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. పరిశ్రమ విస్తృతిని బట్టే ఉద్యోగావకాశాలుంటాయి. వినియోగదారుల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వ అండదండలుంటేనే నూతన వ్యాపార, ఉద్యోగావకాశాలు విశాలమవుతాయి. ఈ కోణం నుంచి పరిశీలించినప్పుడు భారత స్వర్ణాభరణాల మార్కెట్టుకు తిరుగులేదు. అయితే ఈ పరిశ్రమకు ఎటువంటి మానవ వనరుల అవసరం ఉందో లోతుగా తెలుసుకుని ముందుకెళితే భవిష్యత్తు స్వర్ణకాంతులీనుతుంది.

యస్.వి. సురేష్ సంపాదకుడు, ఉద్యోగ సోపానం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


