Bio Designing: కొందరికే తెలిసిన కొత్త రంగం!

బయాలజీ సబ్జెక్టు.. టెక్నాలజీ వాహకంగా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ రెండిటి ఆధారంగా రూపుదిద్దుకున్న బయో డిజైనింగ్ ఇంకా ప్రాచుర్యం పొందలేదు. ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఆకస్మికంగా గుండె నొప్పి వస్తే సకాలంలో హాస్పిటల్‌కి తీసుకెళ్తే.. స్ట్టెంట్ వేసి పంపుతారు. తీవ్రత ఎక్కువగా ఉంటే బైపాస్ సర్జరీ చేసి ప్రాణాలు నిలబెడతారు. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో భుజం దగ్గరో.. తుంటి దగ్గరో ఎముక విరిగితే ఆపరేషన్ చేసి లోపల ప్లేట్ వేసి అతుకుపెడతారు. క్రమేపీ అది శరీరంలో భాగమైపోతుందని వైద్యులు చెబుతారు. కంటి చూపు మందగించి నేత్ర వైద్యుణ్ని సంప్రదిస్తే కేటరాక్ట్ సర్జరీ చేసి కంటిలో లెన్స్ అమర్చి ఇక చూపుకేమీ ఢోకా లేదంటారు.
ఈ సర్జరీలన్నింటిలో వాడిన స్ట్టెంట్, ప్లేట్, లెన్స్... ఇవన్నీ బయో-టెక్నాలజీ ఉత్పత్తులు. జీవశాస్త్రాన్ని (బయాలజీ) సాంకేతికతతో (టెక్నాలజీ) జోడించిన ఫలితంగా రూపుదాల్చిన ఉత్పత్తులు. ఈ రెండు శాస్త్రాలను మేళవించి వ్యాధి నిర్థరణ, చికిత్సా విధానాల్లో కీలకంగా మారిన ఈ ప్రొడక్ట్స్ వెనకున్నది బయో డిజైనింగ్.
రెండున్నర కోట్ల కొలువులు?
వాణిజ్య పరంగా వైద్య పరికరాల ఉత్పత్తి ద్వారా ఈ పరిశ్రమలో రానున్న సంవత్సరాల్లో దేశంలో రెండున్నర కోట్ల ఉద్యోగాలు వెల్లువెత్తనున్నాయని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ బయో డిజైనింగ్ సెంటర్ డైరెక్టర్, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ అనురాగ్ మైరాల్ అంచనా. ప్రస్తుతం బయో డిజైనింగ్ రంగంలో అంతర్జాతీయంగా మూడు/ నాలుగు స్థానాల్లో ఉన్న భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ భవిష్యత్తులో మొదటి స్థానానికి చేరవచ్చని భావిస్తున్నారు.

ఏం చేస్తారు?
మనకు బయాలజీ, టెక్నాలజీ, బయో టెక్నాలజీల గురించి తెలుసు. కానీ కోట్ల ఉద్యోగాల విస్ఫోటనానికి అవకాశమున్న బయో డిజైనింగ్‌లో ఏం చేస్తారు అన్న సందేహం వస్తుంది. మానవ రుగ్మతలపై నిరంతరం జరుగుతున్న వైద్య పరిశోధనల ద్వారా ఏదైనా జబ్బుకు చికిత్సా పరిష్కారం లభించింది అనుకుందాం. ఇక ఆ పరిష్కారం శస్త్ర చికిత్స (ఆపరేషన్) అయితే దానికి కావలసిన వైద్య ఉపకరణాన్ని రూపొందించాల్సివుంటుంది.
ఇందులో మూడు దశలుంటాయి.
డిజైనింగ్: మానవ దేహంపై రోగ నిర్థరణ పరీక్షలకు లేదా శస్త్రచికిత్సల సమయంలోనో వినియోగించడానికి అనుకూలంగా, నిరపాయకరంగా, శరీరం ఆమోదించే విధంగా జీవశాస్త్రం, అనాటమీలపై తగిన అవగాహనతో బయోడిజైన్ రూపొందించడం.
మధ్య దశ: ఆ డిజైనుతో ఉపకరణం తయారుచేసి మార్కెట్టుకు విడుదల చేయడం లేదా ప్రయోగాత్మకంగా రోగులపై ప్రయోగించే దశ. ఈ దశలో ఉపకరణ వినియోగంలో ఏమైనా లోపాలున్నా.. శరీరంపై దుష్ఫలితాలు కన్పించినా గుర్తించాల్సి ఉంది. 
వాణిజ్య ఉత్పత్తి: ప్రయోగదశలో గుర్తించిన లోపాలను సరిచేసి దుష్ఫలితాలు రాకుండా మార్పులు చేశాక వాణిజ్య స్థాయి ఉత్పత్తికి ఉపక్రమించాలి. ఈ దశనే భారీ పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు కీలకం. ఇక్కడే లక్షల సంఖ్యలో ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.
అవరోధమూ అవకాశమే
బయో డిజైనింగ్ నుంచి మెడికల్ బయో ఉపకరణాల వాణిజ్య స్థాయి ఉత్పత్తి వరకూ ఉన్న మూడు దశల్లో మధ్య దశలోనే పెద్ద అవరోధం ఈ పరిశ్రమను ముందుకు అడుగు వేయనీయడం లేదు. ఒక వైద్య ఉపకరణానికి ప్రయోగ స్థితిలో లేదా వైద్యశాలల్లో రోగులపై వినియోగ దశలో ఉత్పన్నమైన దుష్ఫలితాలు, లోపాలు తిరిగి బయో డిజైనర్లకు చేరే వ్యవస్థ మన దేశంలో లేదు. ఫలితంగా బయో డిజైనింగ్ దశ నుంచి రోగుల స్థాయికి చేరిన ఎన్నో ఉపకరణాలు లోపాల కారణంగా వాణిజ్య స్థాయి ఉత్పత్తి (కమర్షియల్ ప్రొడక్షన్) దశకు చేరుకోవడం లేదు. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో బయో టెక్నాలజీ, ఉత్పత్తులకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా ప్రస్తుతం ముందడుగు పడటం లేదు. నిజానికి ఈ వాణిజ్య ఉత్పత్తి స్థాయిలోనే లక్షల ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయి.
- రోగుల అవసరాలు
 - బయోడిజైన్ ఉపకరణాల రూపకల్పన
 - వినియోగం - లోపాల గుర్తింపు
 - దిద్దుబాటు - రీ డిజైనింగ్
 - వాణిజ్యపరమైన ఉత్పత్తి
 
మధ్య దశలోని అవరోధాన్ని మనదేశం భవిష్యత్తులో అధిగమించే అవకాశం ఉందని బయో డిజైనింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐటీని మించుతుందా..
దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం క్రమేపీ పెరుగుతూ నేడు వటవృక్షం అయింది. బయో డిజైనింగ్ అంతర్భాగమైన బయో టెక్నాలజీ రంగం ఒకేసారి విస్ఫోటనంలా బహిర్గతం కావచ్చని భావిస్తున్నారు. 2025లో రూ.12 లక్షల కోట్లు ఉన్న మార్కెట్ 2030 నాటికి రూ.25 లక్షల కోట్లకు చేరగలదన్న అంచనాల మధ్య ఈ రంగంలో రాగల ఉద్యోగావకాశాలను ఊహించుకోవచ్చు. ఉదయిస్తున్న పరిశ్రమ (సన్‌రైజ్ ఇండస్ట్రీ)గా పరిగణిస్తున్న బయోడిజైనింగ్ రంగం ఆనుపానులు ముందుగానే తెలుసుకోవడం ద్వారా నేటి విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఆ దిశగా సన్నద్ధం కావచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


