UPSC: డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు UPSC నోటిఫికేషన్‌

కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ (UPSC) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 24 Apr 2024 15:07 IST

దిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో (Central Armed Police Forces) అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు UPSC నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 506 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్ కమాండెంట్) పరీక్ష నిర్వహించనుంది. ఈ ఉద్యోగాల కోసం మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ద్వారా బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ చొప్పున అసిస్టెంట్ కమాండెంట్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తి కలిగి, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ లింక్‌పై క్లిక్‌ చేసి అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు..

  • మొత్తం ఉద్యోగాలు 506 కాగా.. బీఎస్‌ఎఫ్‌లో (186), సీఆర్‌పీఎఫ్‌ (120), సీఐఎస్‌ఎఫ్‌ (100), ఐటీబీపీ (58), ఎస్‌ఎస్‌బీ (42)  చొప్పున ఉన్నాయి.
  • అభ్యర్థులు డిగ్రీ తత్సమాన విద్యార్హతలతో పాటు నిర్దిష్టమైన శారీరక, వైద్య ప్రమాణాలు కలిగిఉండాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ఆధారంగా పలు వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.
  • అర్హులైనవారు ఏప్రిల్‌ 24 నుంచి మే 14 సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 15 నుంచి 21 వరకు సరిచేసుకొనే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు రూ.200లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ -1, పేపర్ -2), ఫిజికల్ స్టాండర్డ్స్/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే పరీక్షకు తప్పు సమాధానం రాస్తే నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. 
  • రాత పరీక్ష ఆగస్టు 4న జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో సెంటర్లు ఏర్పాట్లు చేశారు.
  • పేపర్‌- 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; పేపర్‌- 2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పేపర్‌- 1 250 మార్కులకు జనరల్‌ ఎబిలిటీ, ఇంటెలిజెన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ రూపంలో ఇంగ్లిష్‌, హిందీలో ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-2 పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలు అడుగుతారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు