Focus: కదలికతో ఏకాగ్రత!

Eenadu icon
By Features Desk Published : 07 Aug 2025 00:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

‘ఊరికూరికే అటూఇటూ కదలకుండా ఒకచోట కుదురుగా కూర్చుంటేనే కదా, ఏ పనిమీదన్నా ఏకాగ్రత కుదిరేది’ అనేది చాలామంది నమ్మకం. మితిమీరిన స్క్రీన్‌ టైమ్‌ వాడకంలో మునిగి కదలకుండా ఒకచోట బైఠాయించే కాలమిది. ఈ పరిస్థితుల్లో పాఠ్యాంశాలపై ధ్యాస కుదరాలంటే.. కదలాలంటున్నారు ‘ఫిడ్జెట్‌ టు ఫోకస్‌’ పుస్తక రచయితలు.

ఇప్పటికే ఫిడ్జెట్‌ బొమ్మలు, మెత్తని బంతులు..స్టడీ టేబుళ్ల మీదా, వర్క్‌ టేబుళ్ల మీదా విరివిగా కనబడుతున్నాయి. ఎవరో ఒకరి చేతివేళ్ల నడుమ ఫిడ్జెట్‌ స్పిన్నర్‌ తిరిగేస్తూ కనబడుతుంది. ఫిడ్జెటింగ్‌ అంటే స్థిరంగా ఉండకుండా, కదులుతూ ఉండడం.

సాధారణంగా అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ) ఉన్నవారు ఏ ఒక్క పనిలోనూ ధ్యాస పెట్టి, దానిలో నిమగ్నం కాలేకపోతుంటారు. అందులోనూ చేయాల్సిన పని ఆసక్తికరంగా లేకపోయినా, అయిష్టంగా చేయవలసి వచ్చినా ఆ పని మీద ఏకాగ్రత కుదరడం కష్టం.

‘ఇంద్రియ ప్రధానమైన చలన అవసరాలు ఆసక్తికరంగా, ఆనందపరిచేవిగా ఉంటే ఎన్ని పనుల మీదకు దృష్టి మళ్లినా మొదలుపెట్టిన ప్రాథమిక పని (విద్యార్థుల విషయంలో చదవడం) మీద ధ్యాస కుదురుతుంది. అలా ఫిడ్జెటింగ్‌ కొందరిలో ధ్యాస చెదరిపోనీకుండా .. ధ్యాస కుదిరేలా చేస్తుంది’ అంటారు ‘ఫిడ్జెట్‌ టు ఫోకస్‌’ రచయితలైన రోలండ్‌ రాట్జ్, సారా డి రైట్‌. ఏకాగ్రత లేమి ఒక అంతర్జాతీయ సమస్య. ఇష్టమున్నా లేకున్నా స్టడీ అవర్స్‌ పేరిట కదలకుండా కనురెప్పలైనా ఆర్పలేనంత కఠిన నియమాలు, ఒత్తిళ్ల మధ్య చదవవలసి వస్తుంది. ఇదంతా కదలకుండా ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావించడం వల్లనే. వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.

మన ఏకాగ్రతకు సాయపడే ఫిడ్జెటింగ్‌ ఎలా చేయవచ్చో చూద్దాం.

1. దృశ్య (కదలిక) వ్యూహం

ఏదైనా పనిచేస్తున్నప్పుడు కూడా చుట్టూ పరిసరాలను నిశితంగా, సూక్ష్మంగా పరిశీలించడమే

  • ప్రకాశవంతమైన ఫోల్డర్‌లు, హైలైటర్లు, కలాలు మొదలైన రంగురంగుల పరికరాలను ఉపయోగించడం .
  • కిటికీలో నుంచి బయటి దృశ్యాలను చూడడం
  • గోడ మీది చిత్రపటాన్నో, గోడ వారనున్న చెట్టూచేమనో, కొమ్మల నడుమ పిట్టగూడునో పరిశీలించడం.

2. వినికిడి (కదలిక) వ్యూహం

చదువుకొనేటప్పుడూ, రాసుకొనేప్పుడూ, లేదా అసైన్‌మెంట్‌ టాస్క్‌లు చేసుకొనేటప్పుడూ ఏదైనా వింటూ ఉండడమే.

  • లయాత్మకమైన సంగీతం వినడం
  • కూనిరాగాలు తీయడం లేదా పాడడం
  • గడియారం ముల్లు టిక్‌ టిక్‌ ధ్వని వినడం

3. రుచి (కదలిక) వ్యూహం

ఆహారపదార్థాలు వివిధ ఆకారాలు, రుచి, వాసన, ఉష్ణోగ్రతలతో చదవడానికి తోడ్పడే ముఖ్య పాత్ర వహిస్తాయి.

  • ఉప్పు, తీపి, కారం, వగరు వంటి వివిధ ఆహార పదార్థాలను రుచి చూడండి.
  • వేడి వేడి టీనో, చల్లచల్లటి నీటినో తాగండి.
  • నెమ్మదిగా నమిలి తినే చిరుతిళ్ళు
  • నిమ్మరసం, కొబ్బరినీళ్ల వంటి పానీయాలు

4. ముఖ (కదలిక) వ్యూహం

చదువుకొనేటప్పుడు..

  • పెన్నునో, చూయింగ్‌ గమ్‌నో నమలడం
  • కొద్ది కొద్దిగా సిప్‌ చేస్తూ కాఫీనో, పానీయాన్నో తాగడం.
  • ఏలక్కాయ, లవంగం, బాదం లాంటివి నోట్లో వేసుకోవడం

5. స్పర్శ (కదలిక) వ్యూహం

ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, వినేటప్పుడు ఏకాగ్రతకోసం ఉపయోగపడే వ్యూహాలు..

  • నోట్స్‌ రాసుకోవడం, డూడుల్స్‌ గీసుకోవడం
  • ఫిడ్జెట్‌ బొమ్మలు, బంతులు, స్పిన్నర్, స్లింకీ వంటివి వాడడం
  • జుట్టును సవరించుకోవడం, బట్టలను సరిచేసుకోవడం..
  • తాళాల గుత్తి తిప్పడం

6. శరీర (కదలిక ) వ్యూహం

చదువుకొనేటప్పుడు ఏకాగ్రతకోసం వ్యూహాత్మకంగా శరీరాన్ని కదిలించడమన్నమాట.

  • వ్యాయామం, నడక, జాగింగ్, బైక్‌ రైడింగ్‌ తదితరాలు
  • కుర్చీలో కదలడం
  • లేచి నిలబడడం
  • వడివడిగా నడవడం
  • కాలి వేళ్లను కదిలించడం

ఎవరికి ఏ రకమైన కదలికలు (ఫిడ్జెటింగ్‌) సాయపడతాయి అనేది స్వానుభవంతో తెలుస్తుంది. ఎవరికి అనువుగా, అనుకూలంగా ఉన్న చిట్కాలను వారు పాటించాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం.. మన ఫిడ్జెటింగ్‌ ఇతరులను ఇబ్బంది పెట్టనీయకుండా అప్రమత్తంగా ఉండాలి.

మూలభావన ఏమిటంటే- ఒకే చోట గిరిగీసుకొని బిగించుకు కూర్చుంటే సరిపోదు. మరింత ముఖ్యంగా, తెరకే కళ్లప్పజెప్పి ఊరుకోకుండా కాస్త తాజాగాలిని పీల్చండి. విశాలమైన ఆకాశం, పచ్చటి పరిసరాల వైపు దృష్టి మళ్ళించండి. పక్షుల కువకువలు, కుక్కర్‌ లేదా ట్రాఫిక్‌ శబ్దాలను కూడా వినండి. వివిధ రుచులూ, కమ్మటి సువాసనలను ఆస్వాదించండి. కాస్త కాలు కదపండి. చేతులు మెదపండి. ద్విగుణీకృతమైన ఉత్సాహం పుంజుకొని ఏకాగ్రతతో పఠనం, అభ్యాసం, పరీక్ష సన్నద్ధత కొనసాగించండి.

చంద్రలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని