BreakFast: అల్పాహారం మానేస్తున్నారా?

ఉదయం పూట అల్పాహారం తినటం మానేస్తున్నారా? అయితే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని తగ్గించుకుంటున్నట్టే. గుండెజబ్బుల ముప్పును పెంచుకుంటున్నట్టే. మౌంట్‌ సినానీలోని ఇక్హాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనం ఇదే చెబుతోంది.

Updated : 24 Oct 2023 08:03 IST

దయం పూట అల్పాహారం తినటం మానేస్తున్నారా? అయితే ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని తగ్గించుకుంటున్నట్టే. గుండెజబ్బుల ముప్పును పెంచుకుంటున్నట్టే. మౌంట్‌ సినానీలోని ఇక్హాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఎలుకలపై నిర్వహించిన తాజా అధ్యయనం ఇదే చెబుతోంది. ఉపవాసం ఆరోగ్యానికి మంచిదనే భావన రోజురోజుకీ పెరుగుతోంది. ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతున్నట్టు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఉపవాసం విషయంలో జాగ్రత్త అవసరమని, దీంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని తమ పరిశీలనలో తేలిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఫిలిప్‌ స్విర్స్కీ చెబుతున్నారు. ఉపవాసానికీ నాడులు, రోగనిరోధక వ్యవస్థల మధ్య సమాచార మార్పిడికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు బయటపడిందని వివరిస్తున్నారు.

కొద్ది గంటల సేపు, తీవ్రంగా 24 గంటల సేపు ఉపవాసం చేయటం రోగనిరోధక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవటం మీద పరిశోధకులు దృష్టి సారించారు. కొన్ని ఎలుకలకు లేచిన వెంటనే ఆహారం ఇచ్చి, మరికొన్ని ఎలుకలను ఉపవాసం ఉంచారు. అలాగే లేచిన వెంటనే, నాలుగు గంటల తర్వాత, ఎనిమిది గంటల తర్వాత రక్తనమూనాలు సేకరించారు. ఉపవాసం ఉన్న ఎలుకల్లో మోనోసైట్స్‌ అనే తెల్ల రక్తకణాల సంఖ్యలో గణనీయమైన తేడాలు కనిపించాయి. ఎముక మజ్జ నుంచి తయారయ్యే ఈ కణాలు శరీరమంతటా తిరుగుతూ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటం వంటి కీలకమైన పనులు నిర్వర్తిస్తాయి. గుండెజబ్బు, క్యాన్సర్లలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. మొదట్లో అన్ని ఎలుకల్లోనూ మోనోసైట్ల సంఖ్య సమానంగానే ఉంది. కానీ ఉపవాసం చేసిన వాటిల్లో నాలుగు గంటల తర్వాత గణనీయంగా పడి పోయింది. రక్తంలోంచి మోనోసైట్లు 90% వరకు కనుమరుగయ్యాయి. ఎనిమిది గంటల తర్వాత మరింత తగ్గిపోయాయి. ఈ మోనోసైట్లు తిరిగి ఎముకమజ్జకు చేరుకొని, నిద్రాణస్థితికి వెళ్లిపోయాయి.

ఫలితంగా ఎముకమజ్జలో కొత్త కణాల ఉత్పత్తి పడిపోయింది. అలాగే పాత కణాలు ఎక్కువసేపు అక్కడే ఉండిపోవటం వల్ల రక్తంలోని మోనోసైట్ల కన్నా భిన్నంగా తయారయ్యాయి. ఒక రోజు తర్వాత ఎలుకలకు ఆహారం ఇవ్వగా అప్పటివరకు ఎముకమజ్జలో దాచుకున్న మోనోసైట్లు కొద్దిగంటల్లోనే మళ్లీ రక్తంలోకి వచ్చాయి. దీంతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) పెద్ద మొత్తంలో తలెత్తింది. అంటే ఈ మారిపోయిన కణాలు ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షణ కల్పించటం కన్నా వాపుప్రక్రియను పెంచాయి అన్నమాట. దీంతో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శక్తి సన్నగిల్లింది. గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి వాటికి వాపు ప్రక్రియే మూల కారణంగా నిలుస్తోందనే విషయాన్ని మరవరాదు. ఉపవాసంతో మెదడులో ఒత్తిడి ప్రతిస్పందన తలెత్తటం వల్ల ఆకలితో కూడిన కోపాన్ని ప్రేరేపిస్తున్నట్టూ గుర్తించారు. తెల్ల కణాలు ఉన్నట్టుండి రక్తంలోంచి ఎముకమజ్జలోకి.. తిరిగి మజ్జలోంచి రక్తంలోకి వెళ్లిపోవటానికి ఇదే దోహదం చేస్తోందని నిరూపించారు. ఉపవాసంతో జీవక్రియల పరంగా మంచి ప్రయోజనాలు ఉండటం నిజమే కావచ్చు. కానీ అన్నీ లాభాలే ఉంటాయని అనుకోవటానికి లేదు. శరీర వ్యవస్థల మీద ఉపవాసం ఎలాంటి ప్రభావాలను చూపుతోందనేది లోతుగా అర్థం చేసుకోవటానికి తమ అధ్యయనం తోడ్పడిందని పరిశోధకులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని