తిండి తగ్గించిందేం?

మీ మనవరాలు 2 నెలల నుంచి అనొరెగ్జియా నెర్వోసాతో బాధపడుతోందని రాశారు గానీ ఇదేమీ హఠాత్తుగా వచ్చే జబ్బు కాదు. బహుషా 2 నెలల క్రితం నిర్ధారణ చేసి ఉండొచ్చు. దీనికి ఎన్నో కారణాలు దోహదం చేస్తుంటాయి. ఆందోళన, ఒత్తిడి వంటివాటితోనూ ముడిపడి ఉంటుంది.

Published : 22 Dec 2020 00:53 IST

సమస్య-సలహా

సమస్య: మా మనవరాలికి 14 ఏళ్లు. అమెరికాలో ఉంటోంది. గత 2 నెలల నుంచి అనొరెగ్జియా నెర్వొసాతో బాధపడుతోంది. తిండి బాగా తగ్గించేసింది. అక్కడ చికిత్స తీసుకుంటోంది గానీ ఫలితం కనిపించటం లేదు. ఏం చెయ్యాలి?

- సి.ప్రభాకర్‌, హైదరాబాద్‌

సలహా: మీ మనవరాలు 2 నెలల నుంచి అనొరెగ్జియా నెర్వోసాతో బాధపడుతోందని రాశారు గానీ ఇదేమీ హఠాత్తుగా వచ్చే జబ్బు కాదు. బహుషా 2 నెలల క్రితం నిర్ధారణ చేసి ఉండొచ్చు. దీనికి ఎన్నో కారణాలు దోహదం చేస్తుంటాయి. ఆందోళన, ఒత్తిడి వంటివాటితోనూ ముడిపడి ఉంటుంది. ఇలాంటివారు తోటివారి ఒత్తిడికి లోనై, బరువు తక్కువగానే ఉన్నా కూడా ఎక్కడ బరువు పెరుగు తామోననే భయంతో అతి తక్కువగా తింటుంటారు. కొందరు తిన్న వెంటనే బలవంతంగా కక్కేస్తుంటారు. దీంతో చిక్కి శల్యమవుతుంటారు. పోషణ లోపంతో జుట్టు రాలటం, రక్తపోటు తగ్గటం, హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తం కావటం వంటి దుష్ప్రభావాలెన్నో మొదలవుతాయి. చాలామంది కుంగుబాటుతోనూ బాధపడుతుంటారు. ఇది దీర్ఘకాల సమస్య. వెంటనే తగ్గేది కాదు. దీనికి మందులతో పాటు కౌన్సెలింగ్‌ అత్యవసరం. బాగా బరువు తగ్గితే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. రోజుకు ఎంత తింటున్నారనేది డాక్టర్లు నిశితంగా పరిశీలిస్తూ, క్రమంగా ఆహారం మోతాదు పెంచుకుంటూ వస్తారు. కుంగుబాటు వంటి సమస్యలకూ మందులు ఇస్తారు. అదే సమయంలో కాగ్నిటివ్‌ బిహేవియర్‌ చికిత్స చేస్తారు. ఇందులో ‘సన్నగానే ఉన్నావు కదా. ఒకవేళ లావైనా అందం ఏమీ తగ్గిపోదు కదా’ అని నెమ్మదిగా నచ్చజెబుతారు. ఇలా ఆలోచన తీరు, ప్రవర్తన మారేలా చేస్తారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. రాత్రికి రాత్రే ఫలితం కనిపించాలని అనుకోవటం తగదు. మీరు చూడాల్సిందల్లా సరైన చికిత్స లభిస్తోందా అనే. ప్రవర్తనలో 20-30% మార్పు కనిపించినా సరైన చికిత్స లభిస్తోందనే అర్థం. నిరాశ పడకుండా చికిత్సను కొనసాగించటం ముఖ్యం.

-డా।। శ్రీలక్ష్మి పింగళి, సైకియాట్రిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని