Updated : 21 Sep 2021 05:51 IST

సంతాన ప్రాప్తికి సాఫల్య చికిత్సలు

పిల్లా పాపలతో కళకళలాడే ఇల్లే వేరు. కానీ కొందరికి అదే కలగా మిగిలిపోతుంది. సంతానం కోసం ఏళ్లకేళ్లుగా ఎదురు చూసే జంటలు ఎన్నో. ఇక్కడే ఐవీఎఫ్‌ వంటి అధునాతన చికిత్సలు అండగా నిలుస్తున్నాయి.

పిల్లలు పుట్టటం సహజమే కావొచ్చు. సంతానం కలగపోవటమూ అంతే సాధారణం. జీవనశైలి మారటం, ఆలస్య వివాహాలు, సంతానాన్ని వాయిదా వేసుకోవటం, అధిక బరువు, ఊబకాయం వంటి వాటితో ఇప్పుడీ సమస్య పెరుగుతూ వస్తోంది కూడా. సంతాన నిరోధక పద్ధతులేవీ పాటించకుండా.. ఏడాది పాటు ప్రయత్నించినా గర్భం రాకపోతే సంతాన సమస్యలేవైనా ఉన్నాయేమో చూసుకోవటం మంచిది. ఆడవాళ్ల వయసు మరీ ఎక్కువగా ఉన్నా, నెలసరి సరిగా రాకపోవటం వంటి సమస్యలేవైనా ఉన్నా ఇంకాస్త ముందుగానే జాగ్రత్త పడాలి. ఆడవారిలో అండాల సమస్యలు, ఫలోపియన్‌ గొట్టాల సమస్యలు, ఎండోమెట్రియోసిస్‌ వంటివి.. మగవారిలో శుక్రకణాలు తగిన సంఖ్యలో లేకపోవటం, అవి చురుకుగా కదల్లేకపోవటం, వాటి ఆకృతి దెబ్బతినటం వంటివి ప్రధానంగా సంతాన రాహిత్యానికి దారితీస్తుంటాయి. అండాలు విడుదల కావటానికి మందులు.. గొట్టాల సమస్యలకు, ఎండోమెట్రియోసిస్‌కు ల్యాప్రోస్కోపీ సర్జరీ ఉపయోగపడతాయి. అందరికీ వీటితోనే సంతానం కలగకపోవచ్చు. అప్పుడు సంతాన సాఫల్య చికిత్సలు అవసరమవుతాయి.

పద్ధతులు రకరకాలు

* ఐయూఐ: దీన్నే ఇంట్రా యూటరిన్‌ ఇన్‌సెమినేషన్‌ అంటారు. ఇందులో ముందుగా భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలలో పరీక్షిస్తారు. వీర్యంలోని అసహజమైన కణాల వంటి వాటిని తొలగిస్తారు. ఆరోగ్యంగా ఉన్న వీర్యాన్ని సన్నటి, మెత్తటి గొట్టం ద్వారా నేరుగా స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. అండం విడుదలయ్యే రోజుల్లోనే దీన్ని చేయాల్సి ఉంటుంది.

* ఐవీఎఫ్‌: ఐవీయూ పద్ధతితో ఫలితం కనిపించని వారికి ఐవీఎఫ్‌ (ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌) చికిత్స చేస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్‌ బేబీ విధానం అంటారు. ఇందులో ఆడవారి నుంచి పక్వమైన అండాలను బయటకు తీసి, ప్రయోగశాలలో ఒక పాత్రలో పెట్టి, మగవారి వీర్య కణాలతో ఫలదీకరణ చెందిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన తొలి దశ పిండాల్లో రెండు మూడింటిని ఆడవారి గర్భంలో ప్రవేశపెడతారు. అవి అక్కడ కుదురుకొని పెరగటం మొదలెడతాయి.

* ఐసీఎస్‌ఐ: అంటే ‘ఇంట్రా సైటోప్లాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌’ అని. ఇందులో ముందుగా ఆడవారి నుంచి అండాలను సేకరిస్తారు. మగవారి వీర్యంలోంచి ఒక శుక్ర కణాన్ని తీసుకొని, దాన్ని మైక్రోమానిప్యులేటర్‌ పరికరం ద్వారా అడంలోకి ప్రవేశపెడతారు. ఫలదీకరణ చెందిన వాటిని తిరిగి స్త్రీ గర్భంలోకి ప్రవేశపెడతారు. వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్న మగవారి విషయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. వీర్యకణాలు అసలే లేనివారిలోనూ వృషణాల నుంచి నేరుగా వీర్యకణాలను బయటకు తీసి కూడా ఈ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ చెందించొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని