గ్రైప్‌ వాటర్‌ పడుతున్నా పిల్లాడు పడుకోవటం లేదు

మా బాబు వయసు 5 నెలలు. బరువు 6 కిలోలు. రోజుకు రెండు సార్లు గ్రైప్‌ వాటర్‌ పట్టిస్తాం. అయినా రాత్రి 12 గంటల వరకూ నిద్రపోడు. ఒకవేళ నిద్రపోయినా ...

Updated : 01 Jan 2019 14:56 IST

గ్రైప్‌ వాటర్‌ పడుతున్నా పిల్లాడు పడుకోవటం లేదు

సమస్య - సలహా

సమస్య: మా బాబు వయసు 5 నెలలు. బరువు 6 కిలోలు. రోజుకు రెండు సార్లు గ్రైప్‌ వాటర్‌ పట్టిస్తాం. అయినా రాత్రి 12 గంటల వరకూ నిద్రపోడు. ఒకవేళ నిద్రపోయినా మధ్యలో లేస్తాడు. ఆకలి వేస్తే పాలు కాసేపే తాగుతాడు. బాబుకు తల్లిపాలు ఎన్నిసార్లు పట్టాలి? ఘనాహారం ఎప్పట్పుంచి ఆరంభించాలి?

- టి.ఎస్‌.కుమార్‌, శ్రీరామ్‌నగర్‌, రాజమండ్రి

సలహా: మీకు వచ్చిన సందేహాలు తల్లిదండ్రులందరికీ వచ్చేవే. అందరి మనసుల్లో మెదిలే అనుమానాలే, భయాలే. మీరు బాబుకు గ్రైప్‌ వాటర్‌ పడితే వచ్చే లాభం గానీ.. పట్టకపోతే వచ్చే నష్టం గానీ లేదు. బహుషా పిల్లాడు నిద్రపోవటానికి మీరు గ్రైప్‌ వాటర్‌ పడుతుండొచ్చు. ఇదొక దురలవాటు. దీనికి పెద్ద కథే ఉంది. ఒకప్పుడు తల్లులు ఎక్కువ మంది పిల్లలను కనేవారు. పెద్ద కుటుంబాలు ఉండేవి. ఇంట్లో పనులతో అంత తీరిక దొరికేది కాదు. అందువల్ల చంటి పిల్లలు ఏడ్వకుండా, హాయిగా నిద్రపోవటానికి గ్రైప్‌ వాటర్‌ పట్టేవాళ్లు. అప్పట్లో గ్రైప్‌ వాటర్‌ను మద్యం (ఆల్కహాల్‌) కలిపి తయారుచేసేవారు. గ్రైప్‌ వాటర్‌ పరిమాణంలో 10% వరకు మద్యమే ఉండేది. పెద్దవాళ్లు ఒక బీరు తాగితే ఎంత మత్తు కలుగుతుందో పిల్లలకు ఒక మూత గ్రైప్‌ వాటర్‌ పట్టించినా అంత మత్తు కలుగుతుంది. దీంతో పిల్లలు గాఢంగా నిద్రపోయేవారు. ఆకలైనా లేచేవారు కాదు. అయితే చిన్నప్పట్నుంచే పిల్లలకు మద్యం తాగిస్తే మెదడు ఎదుగుదల దెబ్బతింటుంది. వ్యక్తిత్వ వికాసం, బుద్ధి కుశలత సన్నగిల్లుతుంది. జీవక్రియల చురుకుదనం తగ్గుతుంది. ఇలాంటి దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకునే మనదేశంలో గ్రైప్‌ వాటర్‌ను నిషేధించారు. అయితే ఆ తర్వాత కంపెనీలు ఆల్కహాల్‌ లేని గ్రైప్‌ వాటర్‌ను తయారు చేయటం ఆరంభించాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్రైప్‌వాటర్‌లో ఎలాంటి మద్యం లేదు. అందువల్ల దీన్ని పట్టించినా ఇప్పుడు నష్టమేమీ లేదనే చెప్పుకోవాలి. అలాగని ప్రత్యేకించి ఒనగూడే లాభమూ లేదు. గతం నుంచీ వస్తున్న అలవాటుతోనో, నమ్మకంతోనో, ఇంట్లో అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పారనో చాలామంది తల్లులు తమ పిల్లలకు గ్రైప్‌ వాటర్‌ పడుతుండటం చూస్తున్నాం. అంతే తప్ప దీంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదని గుర్తించాలి. ఇక రాత్రి 12 గంటల వరకు బాబు పడుకోవటం లేదని చెబుతున్నారు. పిల్లలు నిద్రొస్తే పడుకుంటారు. లేకపోతే లేదు. పొద్దున పడకోకపోతే రాత్రి పడుకుంటారు. రాత్రి పడుకోకపోతే పొద్దున పడుకుంటారు. నిద్రను ఎవరూ ఆపలేరు కదా. నిజానికి చాలామంది తల్లులు పిల్లలను పగటిపూట పడుకోబెట్టి పనులు చేసుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. రాత్రిపూట పడుకోవటం లేదని బాధపడుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లలను పడుకోబెట్టటానికి ఓపిక అవసరం. రాత్రిపూట లేచి ఏడుస్తుంటే ప్రేమతో, ఆప్యాయతతో పాలు పట్టాలి. భుజం మీద వేసుకొని జోకొట్టాలి. జోల పాట పాడాలి. అప్పుడు పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఇందులో అనుమానమేమీ లేదు. చిన్నపిల్లలకు ఆరు నెలలు నిండే వరకు తల్లిపాలు పట్టాలి. ఒక్క చుక్క కూడా నీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలు అమృతంతో సమానం. చిన్నా చితకా జబ్బులొచ్చినా ఇవి మందులాగా పనిచేస్తాయి. పెద్ద పెద్ద సమస్యలకు టీకా గానూ ఉపయోగపడతాయి. కొందరు కడుపునొప్పి, కడుపుబ్బరం వంటివి తగ్గుతాయని పిల్లలకు గ్రైప్‌ వాటర్‌ పడుతుంటారు. తల్లిపాలు సరిగా ఇస్తే పిల్లలకు ఇలాంటి  సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అలాంటప్పుడు గ్రైప్‌ వాటర్‌ పట్టాల్సిన అవసరమేముంటుంది? మీ బాబు 5 నెలల వయసులోనే 6 కిలోలు బరువు ఉన్నాడంటే మంచి ఆరోగ్యంతో, పుష్టిగా పెరుగుతున్నాడనే అర్థం. మీరు దిగులు చెందాల్సిన పనిలేదు. ప్రస్తుతం పడుతున్నట్టుగానే తల్లిపాలు పట్టండి. బాబుకు ఆరు నెలలు నిండిన తర్వాత బియ్యం, పప్పు, నెయ్యి, బెల్లం వంటివి కలిపి ఇంట్లోనే ఉగ్గు చేసి ఇవ్వాలి. అదీ ప్రేమతో తినిపించాలి. బజారులో దొరికే పొడుల వంటి వాటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. ª

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా 
సమస్య - సలహా సుఖీభవ ఈనాడు ప్రధాన కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని