చేపలా? చేప నూనెనా?

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన చేప నూనెతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, మెదడు బాగుంటుందని, కీళ్లవాతం లక్షణాలు తగ్గుతాయని.. ఇలా బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయనే ప్రచారం వింటున్నదే

Published : 31 Oct 2023 01:09 IST

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన చేప నూనెతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని, మెదడు బాగుంటుందని, కీళ్లవాతం లక్షణాలు తగ్గుతాయని.. ఇలా బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయనే ప్రచారం వింటున్నదే. ఇది నిజమేనా? దీని ప్రయోజనాల గురించి అధ్యయనాలు చెబుతున్నదేంటి? నిజంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మంచివే అయితే చేప నూనె మాత్రల మాదిరిగానే చేపలు తినటమూ మేలు చేస్తుందా? ఎవరికైనా ఇలాంటి సందేహాలు రావటం సహజమే. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలనేవి ఒకరకం బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవటం తప్పనిసరి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మూడు రకాలు. 1. ఆల్ఫా-లినోలిక్‌ ఆమ్లం (ఏఎల్‌ఏ). ఇది ఆకు కూరలు, అక్రోట్లు, అవిసె గింజలు, చియా గింజల వంటి శాకాహారంతో లభిస్తుంది. 2. ఈకోసాపెంటనాయిక్‌ ఆమ్లం (ఈపీఏ). 3. డోకోసాహెక్జాయినోయిక్‌ ఆమ్లం (డీహెచ్‌ఏ). ఇవి రెండూ సముద్ర జీవులు, గుడ్లు, చనుబాలలోనే ఉంటాయి. కణాల ఆకృతి, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా ఉండటానికి ఈ ఆమ్లాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చేప నూనె వాడకం కన్నా చేపలు తినేవారిని పరిశీలించటం ద్వారానే వీటి ప్రయోజనాలు బయటపడినట్టు ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి. చేప నూనె మాత్రలు వేసుకున్నా, చేపలు తిన్నా సమానంగా ఫలితం కనిపిస్తున్నట్టు తదనంతర అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చేపల్లో కేవలం ఒమేగా కొవ్వు ఆమ్లాలే కాదు.. ప్రొటీన్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ డి, అయోడిన్‌, సెలీనియం కూడా ఉంటాయి. ఇవన్నీ శరీర సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని