గుండెకు చేప బలం!

కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుందా? అది మీకు రావొద్దని అనుకుంటున్నారా? అయితే చేపలు తినండి. వీటిల్లోని కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బు నివారణకు తోడ్పడుతున్నట్టు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ అధ్యయనంలో బయటపడింది

Published : 12 Dec 2023 01:16 IST

కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బుందా? అది మీకు రావొద్దని అనుకుంటున్నారా? అయితే చేపలు తినండి. వీటిల్లోని కొవ్వు ఆమ్లాలు గుండెజబ్బు నివారణకు తోడ్పడుతున్నట్టు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూటెట్‌ అధ్యయనంలో బయటపడింది. సాల్మన్‌, మాకెరెల్‌, హెరింగ్‌, సార్‌డైన్‌ వంటి చేపల్లో ఈపీఏ, డీహెచ్‌ఏ రకం ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి. ఈ కొవ్వులు మన శరీరంలో రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు. ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టే ఇవి విధిగా లభించేలా చూసుకోవటం మంచిదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. గుండెజబ్బు బాధితులు గల కుటుంబసభ్యులకిది మరింత ముఖ్యమని తాజా అధ్యయనం పేర్కొంటోంది. పరిశోధకులు గుండెనొప్పి, గుండెపోటు, గుండె ఆగటం, పక్షవాతం వంటి జబ్బుల తీరుతెన్నులను పరిశీలించి మరీ ఈ విషయాన్ని గుర్తించారు. గుండెజబ్బు కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే మాట నిజమే. కవలలపై చేసిన అధ్యయనంలో ఇదెప్పుడో బయటపడింది. కానీ దీనికి కారణమవుతున్న జన్యువులను గుర్తించటం చాలా కష్టం. ఎందుకంటే జన్యువులు, పరిసరాలు రెండింటితోనూ గుండెజబ్బు ముడిపడి ఉంటుంది. కాబట్టే పరిశోధకులు కుటుంబ చరిత్ర, తినే ఆహారం మీద దృష్టి సారించారు. గుండెజబ్బు లేని 40వేల మంది సమాచారాన్ని ఇందులో విశ్లేషించారు. అధ్యయనకాలంలో వీరిలో 4వేల మందికి గుండెజబ్బు వచ్చింది. తల్లిదండ్రులు లేదా సహోదరుల్లో ఎవరికైనా గుండెజబ్బు ఉండటం, రక్తంలో ఈపీఏ/డీహెచ్‌ఏ మోతాదులు తక్కువగా ఉండటం.. ఈ రెండూ గలవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం 40% ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అదే గుండెజబ్బు కుటుంబ చరిత్ర ఒక్కటే గలవారికైతే ముప్పు 25% మాత్రమే ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. రక్తసంబంధీకుల్లో ఎవరైనా గుండెజబ్బు బారినపడ్డట్టయితే ఆ కుటుంబ సభ్యులు మరింత ఎక్కువగా చేపలు తినటం మేలు చేస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని