కివీ హుషారు

దిగులు పడేవారు ఉల్లాసం పొందాలనుకుంటే కివీ పండును తిని చూడండి. ఇది నాలుగు రోజుల్లోనే మానసిక స్థితిని, ప్రాణశక్తిని మెరుగు పరుస్తున్నట్టు తాజాగా బయటపడింది మరి.

Published : 30 Jan 2024 01:36 IST

దిగులు పడేవారు ఉల్లాసం పొందాలనుకుంటే కివీ పండును తిని చూడండి. ఇది నాలుగు రోజుల్లోనే మానసిక స్థితిని, ప్రాణశక్తిని మెరుగు పరుస్తున్నట్టు తాజాగా బయటపడింది మరి. ఆహారంలో చిన్న మార్పులతోనూ మూడ్‌ను పెంచుకోవటం సాధ్యమేనని ఇది రుజువు చేస్తుండటం గమనార్హం. మామూలుగానే విటమిన్‌ సి మానసిక స్థితిని, ప్రాణశక్తిని, ఆరోగ్యాన్ని ఉత్తేజితం చేస్తుంది. దిగులు, నిరాశను తగ్గిస్తుంది. కాబట్టే విటమిన్‌ సితో లేదా దీంతో కూడిన పదార్థాలతో ఎంత త్వరగా గుణం కనిపిస్తుందో తెలుసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నించారు. విటమిన్‌ సి లోపం గలవారిని ఎంచుకొని.. కొందరికి విటమిన్‌ సి మాత్రలు, కొందరికి ఉత్తుత్తి మాత్రలు, మరికొందరికి రోజుకు రెండు కివీ పండ్లను తీసుకోవాలని సూచించారు. వీరిని 8 వారాల తర్వాత పరిశీలించారు. కివీ పండ్లను తిన్నవారిలో నాలుగు రోజుల్లోనే మూడ్‌, ప్రాణశక్తి మెరుగవటం మొదలైంది. ఇవి 14-16 రోజుల్లో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అదే విటమిన్‌ సి మాత్రలు వేసుకున్నవారిలో 12 రోజుల వరకూ పెద్దగా ప్రభావం కనిపించలేదు. మాత్రల కన్నా విటమిన్‌ సితో కూడిన పదార్థాలు తినటమే మేలని ఇది తెలియజేస్తోంది. కాబట్టి పోషణ, ఆరోగ్యం విషయంలో సమగ్ర విధానాన్ని అవలంబించాలని.. వివిధ పోషకాలతో కూడిన పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని