తిండి విశ్వాసం!

ఆత్మ విశ్వాసం పెంచుకోవటానికి రకరకాల మార్గాలు. వ్యాయామం, సమయానికి పనులు ముగించటం, ఇతరులకు సహాయం చేయటం, తమ మీద తాము దయతో మెలగటం వంటివెన్నో తోడ్పడొచ్చు.

Published : 06 Feb 2024 01:27 IST

ఆత్మ విశ్వాసం పెంచుకోవటానికి రకరకాల మార్గాలు. వ్యాయామం, సమయానికి పనులు ముగించటం, ఇతరులకు సహాయం చేయటం, తమ మీద తాము దయతో మెలగటం వంటివెన్నో తోడ్పడొచ్చు. మరి ఇందుకు ఆహారమూ దోహదం చేస్తుందనే సంగతి తెలుసా? తాజా అధ్యయనం ఒకటి ఇదే చెబుతోంది. కొన్ని పదార్థాలు మెదడుకు పోషకాలు అందించటం ద్వారా ఆత్మ విశ్వాసం పుంజుకునేలా భావనలు కలిగించొచ్చని, ఫలితంగా భావోద్వేగాల మీద సానుకూల ప్రభావాలు చూపొచ్చని బయటపడింది మరి.

 పండ్లు, కూరగాయలు, గింజపప్పులు, ఆలివ్‌నూనెతో కూడిన మధ్యధరా ఆహారం వంటి సమతులాహారానికి తోడు అదనంగా విటమిన్‌ డి తీసుకుంటే మొత్తంగా మానసిక ఆరోగ్యం మెరుగవుతున్నట్టు స్పెయిన్‌లోని యూనివర్సిడాడ్‌ యూరోపియా డి వాలెన్సియా పరిశోధకులు గుర్తించారు. దీన్ని పోలాండ్‌ పరిశోధకులు మరింత లోతుగా విశ్లేషించి, సమీక్షించి కొన్ని పదార్థాలను మానసిక ఆరోగ్యాన్ని కాపాడే సాధనాలుగానూ వాడుకోవచ్చనీ తేల్చారు. పాలు, ఛీజ్‌లో ఉండే ల్యాక్టోబాసిలస్‌ హెల్‌వెటికస్‌.. పులిసిన పిండితో చేసిన బ్రెడ్డు, మజ్జిగలో కనిపించే బైఫిడోబ్యాక్టీరియమ్‌ లాంగమ్‌ వంటి మంచి బ్యాక్టీరియా వృద్ధికారకాలు ఒత్తిడిని తగ్గిస్తున్నట్టు, ఉత్సాహాన్ని పెంచుతున్నట్టు గుర్తించారు. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి ఆహారం తింటే మనసూ బాగుంటుందన్నమాట. మన మెదడులో మంచి భావనలు పుట్టుకురావటంలో డోపమిన్‌, ఆక్సిటోసిన్‌, సెరటోనిన్‌, ఎండార్ఫిన్ల వంటి హార్మోన్లు పాలు పంచుకుంటాయి. ఆయా పదార్థాల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, విటమిన్‌ సి, థయామిన్‌ (బి1), ఫోలేట్‌ (విటమిన్‌ బి6), సెలీనియం లాంటి కొన్ని పోషకాలు ఈ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపించటానికి తోడ్పడతాయి. నిజానికి మన శరీరంలో 90% సెరటోనిన్‌, 50% డొపమిన్‌ ఉత్పత్తికి పేగుల్లోని బ్యాక్టీరియానే కారణమని పరిశోధకులు గుర్తించారు. ఈ హార్మోన్ల మోతాదులు పెరగటంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుందని అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి? అయితే ఆయా పోషకాలను సమపాళ్లలో లభించేలా చూసుకోవటం ముఖ్యం. ఇందుకు ఆహారం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా

రోజూ పండ్లు, కూరగాయలు తినటం ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. ఇవి జీవితంలో సంతృప్తి, తాత్కాలిక ఆనందం వంటి భావనలనూ పెంపొందిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పండ్లు, కూరగాయలు ఎన్ని రోజులు తింటే అంత ఎక్కువగా ఫలితం కనిపిస్తుండటం విశేషం. వారానికి 6-7 రోజుల పాటు వీటిని తిన్నవారు మరింత సంతోషంగా, ఆత్మ విశ్వాసంతో ఉంటున్నట్టు బయటపడింది. పండ్లు, కూరగాయలు శరీరంలో వాపుప్రక్రియ(ఇన్‌ఫ్లమేషన్‌)ను ఎదుర్కోవటం ద్వారా కుంగుబాటు లక్షణాలను వెనక్కి మళ్లిస్తున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సమాచారం పేర్కొంటోంది. కాబట్టి మూడ్‌ను పెంచుకోవటానికి రంగురంగుల పండ్లు, కూరగాయలు తీసుకోవటం మంచిది. ఆకుకూరలు, పుల్లటి పండ్లలోని బి6 వంటి విటమిన్లు సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది విషయగ్రహణను ఉత్తేజితం చేస్తుంది. అలాగే నారింజ, బత్తాయి, నిమ్మ, కివీ వంటి వాటిల్లోని విటమిన్‌ సి మనలో ప్రేమ, వాత్సల్యాన్ని కలిగించే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి కావటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒమేగా 3 కొవ్వుల మీద దృష్టి

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కేంద్ర నాడీ వ్యవస్థ మీద సానుకూల ప్రభావం చూపుతాయని.. ఇలా సానుకూల భావోద్వేగాలు కలగటానికి తోడ్పడుతుందని మరో అధ్యయనం పేర్కొంటోంది. చేపలు, గింజపప్పులు, విత్తనాల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో, మెదడులో వాపుపక్రియ తగ్గటానికే కాకుండా మూడ్‌ మెరుగు పడటానికి, ఒత్తిడి తగ్గటానికి, విషయగ్రహణ సామర్థ్యం పుంజుకోవటానికి కూడా ఉపయోగపడతాయి.

మంచి పిండి పదార్థాలు ముఖ్యం

ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు సెరటోనిన్‌ మోతాదులను పెంచుతాయి. కాబట్టి బాగా పొట్టుతీసిన ధాన్యాలకు బదులు నిండు గింజ ధాన్యాలు తినటం మంచిది. మనదగ్గర రకరకాల చిరుధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా వీలుంటే ఓట్స్‌, క్వినోవా వంటివీ తీసుకోవచ్చు. అరటిపండ్లు, నారింజ, యాపిల్‌, పంపర పనస, చిలగడ దుంపలు, బీట్‌రూట్‌, శనగల వంటి వాటిల్లోనూ మంచి పిండి పదార్థముంటుంది.

విటమిన్‌ డి తోడు

మెదడులో ఆత్మ విశ్వాసం కలిగించే రసాయనాల ఉత్పత్తి పెరగటానికి విటమిన్‌ డి బాగా తోడ్పడుతుంది. ఇది ఆందోళన, కుంగుబాటునూ తగ్గిస్తున్నట్టు టర్కీ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. కాబట్టి రోజూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. సూర్యరశ్మి సమక్షంలో మన శరీరమే విటమిన్‌ డిని తయారు చేసుకుంటుంది. పెరుగు, గుడ్లు క్రమం తప్పకుండా తినటమూ మేలే.
* గింజపప్పులు ఇష్టపడేవారు అక్రోట్లు కూడా తినొచ్చు. వీటిల్లో అల్ఫా-లెనోలిక్‌ ఆమ్లం దండిగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దిగులు, నిరాశ వంటి కుంగుబాటు లక్షణాలనూ తగ్గిస్తుంది. ఫలితంగా ఆత్మ విశ్వాసాన్నీ పెంపొందిస్తుంది. ఇక సాల్మన్‌ చేపలు, ఎండుద్రాక్షతో మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.  

మసాలా హుషారు

సానుకూల భావనలు, ఉత్సాహం, ఉల్లాసం పెరగటానికి ఎండార్ఫిన్లు తోడ్పడతాయి. ఇవి ఒత్తిడి, బాధలు తగ్గటానికి దోహదం చేస్తాయి. ఆత్మ విశ్వాసం ఇనుమడించటంలోనూ పాలు పంచుకుంటాయి. వ్యాయామం చేసినప్పుడు ఎండార్ఫిన్లు విడుదలవటం తెలిసిందే. అయితే వ్యాయామం ఒక్కటే కాదు.. కారం, మసాలా దినుసులూ వీటిని విడుదలయ్యేలా చేస్తాయి. అందువల్ల మిరపకాయలు, మిరియాలు వంటివి తీసుకోవటం మంచిది.

తినే తీరుతోనూ..

పోషకాలు సమపాళ్లలో గల ఆహారం తినటమే కాదు.. భోజనం చేసే తీరూ సానుకూల భావనలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు- ఒంటరిగా భోజనం చేయటం కన్నా కుటుంబంతో లేదా ఇష్టమైన వారితో కలిసి తింటే ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. అలాగే గతంలో జరిగిన ఆనందకర సంఘటనలను గుర్తుకుతెచ్చే పదార్థాలను తినటమూ మేలే. అలాగని మిఠాయిలు, తీపి పానీయాల జోలికి వెళ్లొద్దు. ఆరోగ్యకరమైనవే ఎంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని