తిండి కొద్దీ ఆరోగ్యం

మనమేంటనేది మనం తినే ఆహారమే నిర్ణయిస్తుంది. అయితే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం? అనేవే కాదు. ఎంత వేగంగా తింటున్నాం, ఎప్పుడు తింటున్నామనేదీ కీలకమే. ఇవి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 16 Apr 2024 00:10 IST

నమేంటనేది మనం తినే ఆహారమే నిర్ణయిస్తుంది. అయితే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం? అనేవే కాదు. ఎంత వేగంగా తింటున్నాం, ఎప్పుడు తింటున్నామనేదీ కీలకమే. ఇవి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణకోశ సమస్యలు, ఊబకాయం, మధుమేహం ముప్పులనూ ప్రభావితం చేసే అవకాశముందనీ వివరిస్తున్నాయి. తిండి ఎప్పుడు తినాలి? ఎంత వేగంగా తినాలి? అనేవి మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఆయా సమస్యల నివారణకు తిండి తినే తీరును మార్చుకోవటమూ ఉపయోగ పడుతుందని చెప్పుకోవచ్చు.

ఆహారం గబగబా తింటే అజీర్ణం, కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలకు దారితీస్తుంది. తరచూ ఇలాగే తింటుంటే దీర్ఘకాల పరిణామాలనూ చవి చూడాల్సి ఉంటుంది. మనం భోజనం చేసినప్పుడు కడుపు నిండిన భావన కలగటం చాలా ముఖ్యం. కడుపు నిండినట్టు మెదడు నుంచి జీర్ణాశయానికి సమాచారం అందటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఒకవేళ మరీ వేగంగా తిన్నారనుకోండి. కడుపు నిండిన భావన కలగముందే ఎక్కువెక్కువ తినే ప్రమాదముంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. దీర్ఘకాలంలో జీర్ణకోశ సమస్యలూ తలెత్తొచ్చు. ఎందుకంటే అధికంగా తిన్న ఆహారం జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉంటుంది. ఆహారం అరగటానికి తోడ్పడే ఆమ్లాలు అంతసేపూ జీర్ణాశయం లోపలి జిగురు పొర మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. పదిహేను నిమిషాలు, అంతకన్నా ఎక్కువసేపు భోజనం చేసేవారితో పోలిస్తే ఐదు నిమిషాల్లోనే భోజనం ముగించేవారికి జీర్ణకోశ సమస్యల ముప్పు 1.7 రెట్లు ఎక్కువని అధ్యయనాల్లో బయటపడింది. వీరిలో జీర్ణాశయం పెద్దగా అవటం వల్ల ఊబకాయం, ఆహారం చాలాసేపు జీర్ణాశయంలోనే ఉండటం, వికారం, వాంతి వంటి సమస్యలూ వచ్చే ప్రమాదముంది. జీవక్రియల మార్పుతో మధుమేహం ముప్పూ పెరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా, పదార్థాల రుచిని ఆస్వాదిస్తూ తినటం మంచిది. అలాగే రోజులో వీలైనంత త్వరగా అల్పాహారాన్ని తినటం మంచిదని, దీంతో జీవక్రియలు సజావుగా సాగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అల్పాహారం కాస్త ఎక్కువగా, మధ్యాహ్న భోజనం ఒక మాదిరిగా తినాలి. మధ్యాహ్నం కన్నా రాత్రిపూట పెద్దమొత్తంలో భోజనం చేసేవారికి ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మధ్యాహ్న సమయం వరకే ఎక్కువ కేలరీలు లభించేలా చూసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని