మహా మెగ్నీషియం!

మెగ్నీషియం గొప్ప పోషకం. ఇది గుండె లయ, కండరాల సంకోచాలు, రక్తపోటు అదుపు, ఎముక పుష్టి, శక్తిని పుట్టించటం వంటి 300కు పైగా అత్యవసర పనుల్లో పాలు పంచుకుంటుంది.

Published : 16 Apr 2024 00:12 IST

మెగ్నీషియం గొప్ప పోషకం. ఇది గుండె లయ, కండరాల సంకోచాలు, రక్తపోటు అదుపు, ఎముక పుష్టి, శక్తిని పుట్టించటం వంటి 300కు పైగా అత్యవసర పనుల్లో పాలు పంచుకుంటుంది. అయినా చాలామందిలో మెగ్నీషియం మోతాదులు తక్కువగానే ఉంటుండటం గమనార్హం. దీన్ని తగినంత లభించేలా చూసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

మెగ్నీషియం చాలా ఆహార పదార్థాలతో సహజంగానే లభిస్తుంది. వయసు, లింగ భేదాన్ని బట్టి మనకు సగటున రోజుకు 310 నుంచి 420 మి.గ్రా. మెగ్నీషియం కావాలి. అలాగని మరీ కొలుచుకొని పదార్థాలను తినాల్సిన అవసరమేమీ లేదు. మెగ్నీషియంతో కూడిన పదార్థాల ఎంపికలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు.

గింజ పప్పులు, గింజలు: గింజ పప్పులు (నట్స్‌), గింజలు చిన్నవే గానీ మంచి పోషకాల గనులు. వీటిల్లో ప్రొటీన్లు, పీచు, ఆరోగ్యకర కొవ్వులతో పాటు మెగ్నీషియం వంటి ఖనిజాలూ దండిగా ఉంటాయి. సుమారు 30 గ్రాముల బాదంతో 80 మి.గ్రా., జీడిపప్పుతో 72 మి.గ్రా., వేరుశనగలతో 49 మి.గ్రా., గుమ్మడి గింజలతో 150 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుంది. చెంచాడు అవిసె గింజలు తీసుకుంటే 40 మి.గ్రా. అందినట్టే. అరకప్పు మొక్కజొన్న గింజలు తింటే 27 మి.గ్రా. లభిస్తుంది.

పప్పులు: పప్పు దినుసులూ తక్కువేమీ కాదు. కంది, పెసర, శనగ, మినప వంటి పప్పుల న్నింటిలోనూ మెగ్నీషయం బాగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన శనగలతో 60 మి.గ్రా., అనపగింజలతో 40 మి.గ్రా. లభిస్తుంది.

పాలు, పెరుగు: పాలు, పెరుగు అనగానే క్యాల్షియమే గుర్తుకొస్తుంది. వీటిల్లో మెగ్నీషియం పాలూ ఎక్కువే. ఒక కప్పు పాలలో 27 మి.గ్రా., పావు కిలో పెరుగులో 42 మి.గ్రా. ఉంటుంది.

కూరగాయలు, ఆకు కూరలు: మెగ్నీషియం విషయంలో ముదురు రంగు ఆకు కూరలూ గొప్పవే. అరకప్పు ఉడికించిన పాలకూరతో 78 మి.గ్రా. లభిస్తుంది. అలాగే కూరగాయల్లో అరకప్పు బఠానీల్లో 31 మి.గ్రా., బంగాళా దుంపల్లో 48 మి.గ్రా. ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని