జబ్బుల జననికి కళ్లెం!

అతి అనర్థ దాయకం. ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో భాగంగా తలెత్తే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌)కు అతికినట్టు సరిపోతుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినప్పుడో, గాయాలైనప్పుడో వాటిని నయం చేయటానికిది ఎంతగానో తోడ్పడుతుంది.

Published : 23 Apr 2024 00:42 IST

అతి అనర్థ దాయకం. ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనలో భాగంగా తలెత్తే వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌)కు అతికినట్టు సరిపోతుంది. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినప్పుడో, గాయాలైనప్పుడో వాటిని నయం చేయటానికిది ఎంతగానో తోడ్పడుతుంది. ఆయా సమస్యలు నయమయ్యాక ఇదీ సమసిపోతుంది. కానీ అవసరం లేకపోయినా వాపు ప్రక్రియ ప్రేరేపితమై, కణస్థాయిలో అంతర్గతంగా కొనసాగుతూ వస్తే మాత్రం ప్రమాదమే. ఇది ఆరోగ్యకరమైన కణజాలం, అవయవాల మీద దాడిచేస్తుంది. ఫలితంగా గుండెజబ్బు, మధుమేహం, క్యాన్సర్‌, కీళ్లనొప్పులు, పేగుపూత వంటి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. అందుకే వాపు ప్రక్రియను సకల జబ్బుల జననిగానూ అభివర్ణిస్తుంటారు. కొన్ని అలవాట్లు, జాగ్రత్తలతో దీన్ని అదుపు తప్పకుండా చూసుకోవటానికి వీలుండటం మంచి విషయం.


తగినంత నిద్ర

రాత్రిపూట తగినంత నిద్ర పోకపోతే శరీరం వాపు ప్రక్రియను ప్రేరేపిస్తుంది. ఈ రెండింటికీ సంబంధమేంటని అనుకుంటున్నారా? ఒక సిద్ధాంతం ప్రకారం- నిద్ర పోయినప్పుడు రక్తపోటు తగ్గుతుంది, రక్తనాళాలు విప్పారతాయి. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే రక్తపోటు తగ్గాల్సినంతగా తగ్గదు. దీంతో రక్తనాళాల గోడలు ఉత్తేజితమై వాపు ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. నిద్రలేమితో ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థ సైతం అస్తవ్యస్తమవుతుంది. ఇదీ వాపు ప్రక్రియను ఉత్తేజితం చేసేదే. కాబట్టి రాత్రిపూట 7-9 గంటల సేపు నిద్రపోవాలి. సమయమే కాదు, గాఢంగా నిద్ర పట్టటమూ ముఖ్యమే. రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవరచుకోవాలి. పడుకోవటానికి ముందు మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వంటివేవీ వాడొద్దు. పడకగదిని చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.


 వ్యాయామం క్రమంగా

గుండె, ఊపిరితిత్తులు వేగంగా పనిచేసేలా చేసే నడక వంటి ఏరోబిక్‌ వ్యాయామాలు వాపు ప్రక్రియ అదుపులో ఉండటానికి తోడ్పడతాయి. కొవ్వులో వాపు ప్రక్రియను పెంచే పదార్థాలుంటాయి. వ్యాయామం చేస్తే కొవ్వు తగ్గుతుంది. వాపు ప్రక్రియను అదుపులో ఉంచే హార్మోన్లు కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాబట్టి రోజూ కనీసం అరగంట సేపయినా వ్యాయామం చేయటం మంచిది. వేగంగా నడవటం, పెంపుడు జంతువులను షికారుకు తీసుకెళ్లటం, ఈత కొట్టటం, సైకిల్‌ తొక్కటం వంటివి ఏవైనా చేయొచ్చు. కొత్తగా వ్యాయామం మొదలెట్టేవారైతే నెమ్మదిగా ఆరంభించాలి. రోజుకు 5 నిమిషాలతో మొదలెట్టి, క్రమంగా 20, 30 నిమిషాల వరకూ పెంచుకుంటూ రావాలి.


మసాలాల తోడు

మనం కూరల్లో పసుపు, దాల్చిన చెక్క, జిలకర, అల్లం, వెల్లుల్లి వంటివి వాడుతూనే ఉంటాం. ఇవి వాపును ఉత్తేజితం చేసే ప్రక్రియల వేగాన్ని తగ్గిస్తాయి. పసుపులో 300కు పైగా రసాయన మిశ్రామాలున్నాయి. వీటిల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కర్‌క్యుమిన్‌. ఇది వాపును ప్రేరేపితం చేసే న్యూక్లియర్‌ ఫ్యాక్టర్‌ కప్పా బీ (ఎన్‌ఎఫ్‌-కేబీ) ప్రొటీన్‌ను నిలువ రిస్తున్నట్టు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అల్లంలోని జింజెరాల్‌, జింజెరోన్‌.. వెల్లుల్లిలోని అలిసిన్‌, డయాలీల్‌ డైసల్ఫైడ్‌ వాపు పక్రియ అదుపులో ఉండటానికి తోడ్పడతాయి. యాలకులు, దాల్చిన చెక్క కూడా ఇలాంటి గుణాలు కలిగినవే.


ఉపవాస భరోసా'

రోజులో కొంత కాలమే ఆహారం తినే ఉపవాస పద్ధతితో వాపు ప్రక్రియ తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఉపవాసంలో రకరకాల పద్ధతులున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆహారం తినటం, ఆ తర్వాత మరేదీ తినకపోవటాన్ని ఎక్కువగా పాటిస్తుంటారు. అయితే వృద్ధులు, మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బులు గలవారు డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే ఇలాంటి ఉపవాస పద్ధతులు పాటించాలో, వద్దో నిర్ణయించుకోవాలి.


కూరల మేలు

రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లలో సహజ యాంటీఆక్సిడెంట్లు, వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి వాపు ప్రక్రియ అనర్థాల నుంచి కాపాడతాయి. రోజువారీ పనుల్లో భాగంగా కణాలు దెబ్బతినటాన్ని తగ్గిస్తాయి. విటమిన్‌ కెతో నిండిన పాలకూర.. పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు మరింత మేలు చేస్తున్నట్టు అధ్యయనాలు వివరిస్తున్నాయి. బాగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు, మాంసం, వేపుళ్లు వాపు ప్రక్రియ పెరిగేలా చేస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.


యోగా బలం

యోగాలో భాగమైన ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని ప్రేరేపించే కార్టిజోల్‌ హార్మోన్‌ మోతాదులను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే కుంగుబాటు, ఆందోళన తగ్గుముఖం పడతాయి. వాపు ప్రక్రియ మితిమీరకుండానూ చూస్తాయి.


బరువు అదుపు

ఊబకాయం, వాపు ప్రక్రియలు రెండింటికీ సంబంధముంది. వాపు ప్రక్రియతో జీవక్రియలు, ఇన్సులిన్‌ సామర్థ్యం అస్తవ్యస్తమవుతాయి. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. మరోవైపు అధిక బరువు వాపు ప్రక్రియ కొనసాగేలా చేస్తుంటుంది. కాబట్టి అధిక బరువు గలవారు తగ్గించుకోవటం మేలు.


పొగ మానెయ్యాలి

సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చటంతో చాలా సమస్యలు ముంచుకొస్తాయి. వీటిల్లో ఒకటి వాపు ప్రక్రియ పుంజుకోవటం. అందువల్ల వీటి జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని