తప్పదు మార్పిడి!

మోకాలి కీళ్లు. ఒంట్లో అతిపెద్ద కీళ్లు. శరీరం స్థిరంగా ఉండటానికి.. కాళ్లు వంగటానికి, తిరగటానికి, తిన్నగా చాచటానికివి ఉపయోగపడతాయి.

Published : 26 Apr 2016 00:48 IST

తప్పదు మార్పిడి!

మోకాలి కీళ్లు. ఒంట్లో అతిపెద్ద కీళ్లు. శరీరం స్థిరంగా ఉండటానికి.. కాళ్లు వంగటానికి, తిరగటానికి, తిన్నగా చాచటానికివి ఉపయోగపడతాయి. నడవటం, పరుగెత్తటం వంటి రకరకాల పనులకు తోడ్పడతాయి. అందుకే వీటికి చిన్న సమస్య తలెత్తినా తీవ్రంగా వేధిస్తుంది. ఇక కీళ్లు బాగా అరిగిపోయిన వారి గురించి చెప్పక్కర్లేదు. అడుగు తీసి అడుగు వేయటమే గగనమైపోతుంది. ఇలాంటివారికి మోకీళ్ల మార్పిడితో ఎంతగానో ఉపశనం లభిస్తుంది. ఇందులో అరిగిన మోకీలును తొలగించి, దాని స్థానంలో కృత్రిమమైన కీలును అమరుస్తారు. ఒక్క అరగటమే కాదు.. చాలా సమస్యల్లో మోకీళ్ల మార్పిడి అవసరమవుతుంది.

* మోకీళ్లు అరగటం: కీలు ఎముక చివర్లలో మృదులాస్థి దెబ్బతినటం దీనికి ప్రధాన కారణం. దీంతో కీళ్లు రాసుకుపోయి అరిగిపోతాయి. ఫలితంగా నొప్పి, కీళ్లు బిగుసుకుపోవటం వంటివి తలెత్తుతాయి.

* కీళ్లవాతం: మనలోని రోగనిరోధకశక్తి పొరపాటున కీలు పైపొర మీద దాడి చేయటం కీళ్లవాతానికి (రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌) దారితీస్తుంది. దీంతో నొప్పి, వాపు రావటంతో పాటు కీలు కూడా దెబ్బతింటుంది.

* గాయాలు: కీళ్లు విరగటం లేదా కండరబంధనాలు తెగటం వంటివి వాపును కలగజేస్తాయి. ఇవి కీళ్ల అమరిక పైనా ప్రభావం చూపుతాయి. మృదులాస్థి క్షీణించటానికీ దారితీస్తాయి. అందువల్ల చిన్నప్పుడు తగిలిన గాయాలు మధ్య వయసులో, వృద్ధాప్యంలో కీళ్లనొప్పి, వాపు తెచ్చిపెడతాయి.

* ఎముక క్షీణత: కొందరిలో ఎముకకు రక్త సరఫరా తగ్గిపోతుంటుంది. దీంతో ఎముక క్షీణించి, కీళ్లు దెబ్బతినొచ్చు. దీనికి కారణమేంటో తెలియదు గానీ దెబ్బలు తగలటం వల్ల రావొచ్చని భావిస్తున్నారు.

* కీళ్ల లోపాలు: కీళ్లు సరిగా ఏర్పడకపోవటం వల్ల ముందుకు వంగిపోవటం వంటివీ కీళ్ల నొప్పిని తెచ్చిపెడతాయి. ఇలాంటి లోపాలు కీళ్లపై ఒత్తిడిని కలగజేసి, మృదులాస్థి త్వరగా దెబ్బతినేలా చేస్తాయి.

- సమస్య ఏదైనా మోకాళ్ల నొప్పికి డాక్టర్లు ముందుగా మందులతో చికిత్స చేస్తారు. బరువు తగ్గటం, వ్యాయామం చేయటం వంటివీ సూచిస్తారు. ఇలాంటివాటితో ప్రయోజనం లేకపోతే మోకీళ్ల మార్పిడి సిఫారసు చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో ఇప్పుడు అధునాతన పద్ధతులు, ఎక్కువకాలం మన్నే కృత్రిమ మోకీళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని