ఉప్పు తగ్గితే నిద్ర!

రాత్రిపూట బాగా నిద్ర పట్టాలని కోరుకుంటున్నారా? అయితే ఉప్పు కాస్త తగ్గించండి. ముఖ్యంగా వృద్ధులకు ......

Published : 04 Apr 2017 01:24 IST

ఉప్పు తగ్గితే నిద్ర!

రాత్రిపూట బాగా నిద్ర పట్టాలని కోరుకుంటున్నారా? అయితే ఉప్పు కాస్త తగ్గించండి. ముఖ్యంగా వృద్ధులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. సాధారణంగా వృద్ధులు రాత్రిపూట రెండు, మూడు సార్లు మూత్రానికి వెళ్తుంటారు. ఇది మామూలు సమస్యగానే కనబడొచ్చు గానీ దీంతో నిద్ర దెబ్బతింటుంది. ఒత్తిడి, చిరాకు, అలసట వంటి ఇతరత్రా సమస్యలూ బయలుదేరుతుంటాయి. ఇవన్నీ రోజువారీ పనులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి కూడా. అయితే ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లటం తగ్గుతున్నట్టు ఐరోపా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ఒక్క రాత్రిపూటే కాదు, పగటి పూట కూడా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. మన ఒంట్లో రక్తం పరిమాణం నియంత్రణలో ఉండటంలో ఉప్పు (సోడియం) కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో సోడియం మోతాదు పెరుగుతుంది. దీంతో కణాల నుంచి నీరు వచ్చి రక్తంలో కలుస్తుంది. ఫలితంగా రక్తం పరిమాణం పెరిగిపోతుంది. రక్తం పరిమాణం ఎక్కువైతే మూత్రం ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దీంతో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు, రక్తం పరిమాణంతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. దీంతో కిడ్నీలు మరింత ఎక్కువగా నీటిని ఒంట్లోంచి బయటకు పంపటానికి ప్రయత్నిస్తాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని కాస్త తగ్గిస్తే.. రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండానే కాదు, కంటి నిండా నిద్రపోయేలానూ చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని