logo

వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్‌ అభ్యర్థి

అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్‌ రూపంలో కొత్త కష్టం వచ్చింది.

Updated : 26 Apr 2024 08:28 IST

గంగాధర నెల్లూరులోనూ ఫ్యాను పార్టీ ఓటర్లలో చీలిక  

ఈనాడు, చిత్తూరు: అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్‌ రూపంలో కొత్త కష్టం వచ్చింది. ఎక్కడ ఆ పార్టీ అభ్యర్థులు తమ ఓటు బ్యాంకుకు గండి కొడతారోననే భయం వైకాపా అభ్యర్థులకు పట్టుకుంది. పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఈ పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ నుంచి పోటీచేస్తున్న సునీల్‌కుమార్‌, కృపాలక్ష్మి లోలోపల మథనపడుతున్నారు. ఈసారి ఆ రెండు స్థానాల్లో వైకాపా గెలుపు కష్టమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎంత శ్రమించినా విజయం వరిస్తుందనే నమ్మకం లేదని సొంత పార్టీ క్యాడరే వాపోతుంది. షెడ్యూల్‌ విడుదలైనప్పుడు ఉత్సాహంగా ఉన్న వైకాపా అభ్యర్థులను నామినేషన్ల గడువు ముగిసే నాటికి నిరుత్సాహం ఆవరించింది. 

2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రవి.. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ తెదేపా అభ్యర్థిని లలితకుమారిపై 951 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో  కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌రాజాకు 1,275 ఓట్లు వచ్చాయి. 2019లో ఫ్యాను గాలి బలంగా వీయడంతో వైకాపా అభ్యర్థి ఎంఎస్‌బాబుకు 29,163 ఓట్ల ఆధిక్యం లభించింది. కాంగ్రెస్‌ పార్టీకి 1,254 ఓట్లు వచ్చాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎంఎస్‌బాబు ఈసారి కాంగ్రెస్‌ తరఫున పూతలపట్టు నుంచి పోటీ చేస్తున్నారు. వైకాపా అధిష్ఠానం ఆయన్ను మోసం చేసిందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే కొందరు అసంతృప్తిగా ఉన్నారు. వీరు లోలోపల ఎంఎస్‌బాబుకు సహకరిస్తున్నందున గతంతో పోలిస్తే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓట్లు పెరగడం ఖాయం. తనను అవమానించిన జగన్‌కు బుద్ధి చెప్పాలని బాబు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం జరిగిన నామినేషన్ల ఘట్టంలో ఆయన బలప్రదర్శన చేశారు. పోలీసులు, వైకాపా నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో అధికార పార్టీలో గుబులు పట్టుకుంది. ఎంఎస్‌బాబు తమ ఓట్లను చీల్చి తెదేపా అభ్యర్థి మురళీమోహన్‌ నెత్తిన పాలు పోస్తారని వైకాపా శ్రేణులు భయపడుతున్నాయి. ప్రచారం వరకూ ఇదే దూకుడును కొనసాగిస్తే తెదేపాకు మరింత ఆధిక్యం రావడం ఖాయమని భావిస్తున్నారు.

నారాయణస్వామే లక్ష్యంగా రమేష్‌

గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎప్పటినుంచో కాంగ్రెస్‌కు కంచుకోట. 2014 ఎన్నికల నుంచి హస్తం పార్టీ క్యాడర్‌ వైకాపా వైపు వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఫ్యాను పార్టీనే గెలిచింది. 2019లో నారాయణస్వామి ఎమ్మెల్యేగా గెలిచి ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచీ వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతి మండలంలోనూ గ్రూప్‌లు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే నష్ట నివారణకు వైకాపా అధిష్ఠానం నారాయణస్వామికి బదులు ఆయన కుమార్తె కృపాలక్ష్మికి టిక్కెట్‌ ఇచ్చింది. ఇది ఆయన మేనల్లుడు రమేష్‌కు రుచించక తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మామను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడ్డారు. రమేష్‌కు గెలిచే సత్తా లేకున్నా ఎంఎస్‌ బాబు తరహాలో వైకాపాకు ఎంతోకొంత నష్టం చేయడానికి అవకాశం ఉంది. ఇది అంతిమంగా తెదేపా అభ్యర్థి వీఎం థామస్‌కు లాభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని