Published : 17 Jan 2016 13:02 IST

నవ యవ్వన పరవశం

నవ యవ్వన పరవశం

పరిణామం.. ప్రకృతి లీలా విలాసం! .. మొగ్గ పువ్వుగా.. పువ్వు కాయగా.. కాయ పండుగా.. మారే క్రమం ఓ కన్నుల పండువ! సంభ్రమాశ్చర్యాలన్నింటినీ మూటగట్టుకున్న సహజ సిద్ధ వికాస క్రమం!  అల్లారు ముద్దుల ఆడపిల్ల కాస్తా నునుసిగ్గుల యవ్వనవతిగా.. అల్లరి పిడుగులాంటి అబ్బాయి కాస్తా నూనూగు మీసాల నవయవ్వనుడిగా.. మారే క్రమం.. అడుగడుగునా ఎంత అబ్బురం! చూస్తుండగానే.. మన కళ్ల ముందరే.. ఎవరో చెప్పినట్టుగా.. ఎవరో నడిపిస్తున్నట్టుగా.. ఠంచనుగా మొదలైపోతుంది ఆ పరిణామం. అక్కడి నుంచీ అంతా విస్మయాల వెల్లువే!

అనుకోకుండా.. తమకు తెలియకుండానే తమ ఒంట్లో జరిగిపోతున్న ఈ మార్పులకు ఆ చిన్ని బుర్రలు తబ్బిబ్బై తడబడిపోతుంటే.. మరోవైపు ఈ క్రమం ఏ కాస్త ముందువెనకలైనా.. కంట్లో దీపంలా చూసుకునే తల్లిదండ్రులు విపరీతంగా మధనపడిపోతుంటారు. ఏది సహజమైన మార్పో.. ఏది అసహజమో.. ఏది జాప్యమో.. ఏది లోపమో తెలియక విపరీతమైన వేదన అనుభవిస్తుంటారు.

కాస్త ముందువెనకలు సహజం. అయితే ఎప్పుడు దేన్ని తేలికగా తీసుకోవాలి.. ఎప్పుడు త్వరగా స్పందించాలన్నది తెలియటం చాలా అవసరం. ఇందుకోసమే ‘నవయవ్వన’ క్రమంపైనా, దీనిలో వచ్చే మార్పులపైనా వివరాలను స్థూలంగా మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ!

పిల్లల్లో ఒక వయసుకు రాగానే యవ్వన మార్పులన్నవి అత్యంత సహజం. అయితే ఇంత సహజమైన మార్పుల గురించి కూడా మన సమాజంలో పూర్తి అవగాహన లేకపోవటం వల్ల.. చాలాసార్లు తల్లిదండ్రులు రకరకాల ఆందోళనలకు గురవుతుంటారు. తరచుగా 23, 24 ఏళ్ల పిల్లలను కూడా వైద్యుల వద్దకు తీసుకువచ్చి.. ఈ వయసులో పొడవు పెంచే చికిత్సలేమైనా ఉన్నాయా? అని అడుగుతుండటమే దీనికి తార్కాణం. నిజానికి పిల్లల్లో యవ్వన దశకు సంబంధించిన శారీరక మార్పులు రావటం, ఎత్తు పెరగటం అన్నవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిన అంశాలు. సాధారణంగా ఆడపిల్లలుగానీ, మగపిల్లలుగానీ నవయవ్వనారంభ దశలోనే (ప్యూబర్టీ) వేగవంతంగా పెరుగుతారు. దీన్నే ‘ప్యూబర్టల్‌ గ్రోత్‌ స్పర్ట్‌’ అంటారు. ఈ దశలో వీళ్లు 15 నుంచి 25 సెంటీ మీటర్ల వరకూ పెరుగుతారు. ఒకసారి ఈ దశ దాటిపోయారంటే ఇక వాళ్ల ఎముకలు అతుక్కుపోతాయి, ఆ తర్వాత పెరగటమన్నది ఉండదు. దానర్థం ఇక వాళ్లు పెద్దవాళ్లయ్యారనే! కాబట్టి ఆడపిల్ల పెద్దమనిషి కావటం.. దానికి ముందరి శారీరక మార్పులు.. అలాగే మగపిల్లల్లో యవ్వన మార్పులు రావటం.. ఎముకలు అతుక్కోవటం.. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడిన అంశాలని గుర్తించటం అవసరం. మణికట్టు దగ్గర.. అలాగే మోకాళ్ల దగ్గర ఉండే పెద్ద ఎముకల చివళ్లు (ఎపిఫైసిస్‌/గ్రోత్‌ప్లేట్స్‌) మూసుకుపోనంత వరకూ పిల్లలు ఇంకా పెరుగుతారు. ఒకసారి అవి మూసుకుపోతే వాళ్ల పెరుగుదల క్రమం నిలిచిపోయిందని అర్థం. దీన్ని ఎక్స్‌-రేలో తేలిగ్గా గుర్తించొచ్చు.

ఆందోళనల పరంపర

చాలామంది తల్లిదండ్రులు పిల్లల పెరుగుదలను నిశితంగా గమనిస్తూ పిల్లాడికి 11-12 ఏళ్లు వచ్చినా ఏ మార్పులూ రావటం లేదని, సరిగా పెరగటం లేదని విపరీతంగా మథనపడుతుంటారు. ఇది పూర్తిగా అవగాహనా లేమే. తల్లిదండ్రుల ఆందోళనల కారణంగా తరచుగా హార్మోన్‌ పరీక్షల వంటివి చెయ్యటం కూడా జరుగుతుంటుంది. కానీ వాస్తవానికి ఆ పిల్లల్లో ఇంకా యవ్వన మార్పులు మొదలవ్వలేదు కాబట్టి ఆ హార్మోన్లన్నీ సహజంగానే తక్కువగా ఉంటాయి. దాన్ని చూసి వైద్యం ఆరంభించి.. హార్మోన్ల వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒంట్లో యవ్వన మార్పులు వచ్చే సమయంలోనే హార్మోన్లు పెరుగుతాయి.

90 శాతం మంది ఆడపిల్లలు లేదా మగపిల్లల్లో ఎదుగుదల సహజ సిద్ధంగా ఒకే తీరులో ఉంటుంది. అయితే ఓ 10 శాతం మంది పిల్లల్లో మాత్రం ఈ ప్రక్రియ కాస్త అస్తవ్యస్తంగా ఉండొచ్చు. అంటే కొందరికి వయసు మీరుతున్నా యవ్వన మార్పులు మొదలవ్వకపోవచ్చు. మగపిల్లలైనా, ఆడపిల్లలైనా 14-15 ఏళ్లు దాటినా కూడా ఇంకా మార్పులేవీ కనబడటం లేదంటే సహజంగానే ఆలస్యమవుతోందా? లేక ఏదైనా లోపం, సమస్య ఉందా? అన్నది పరిశీలించటం అవసరం. చాలామందిలో అన్నీ సజావుగానే ఉండి కూడా.. సహజంగానే కొంత జాప్యం జరగొచ్చు (డిలేడ్‌ ప్యూబర్టీ). ఎవరిలో సమస్య ఉంది? ఎవరిలో సహజంగానే కొంత లేటు అవుతోందన్నది గుర్తించటం చాలా కీలకం. అలాగే కొందరు చిన్నపిల్లల్లోనే యవ్వన మార్పులు వచ్చేస్తుంటాయి. దీన్నే ‘ప్రికోసియస్‌ ప్యూబర్టీ’ అంటారు. వీటిని గుర్తించి.. వెంటనే చికిత్స చెయ్యకపోతే సామాజికంగా నగుబాటును అనుభవించటమే కాదు.. వీరి ఎత్తు, పెరుగుదల కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. కాబట్టి ఈ సమస్యల గురించి అవగాహన పెంచుకోవటం చాలా అవసరం.

అప్పుడే ఎందుకు?

యవ్వన మార్పులు సరిగ్గా ఆ వయసుకు రాగానే ఎందుకు మొదలవుతాయన్నది నిజంగా ఇప్పటికీ సంపూర్ణంగా తెలియదు. ఇది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దీనంతటికీ శరీరంలో హార్మోన్లు అత్యంత కీలకం. మన మెదడులో ఉండే ‘హైపోథాలమస్‌’ ‘పిట్యూటరీ గ్రంథి’ని నియంత్రిస్తుంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథి శరీరంలోని ఇతర గ్రంథులన్నింటినీ నియంత్రిస్తుంటుంది. యవ్వన మార్పులకు మూలమైన సెక్స్‌ హార్మోన్లను స్రవించేవి మగపిల్లల్లో వృషణాలు, ఆడపిల్లల్లో అండాశయాలు. వీటిని కూడా పిట్యూటరీ గ్రంథే పర్యవేక్షిస్తుంటుంది. ఇవన్నీ సమన్వయంతో పని చేస్తుంటేనే ఎదుగుదల అంతా సజావుగా సాగుతుంది. ఈ సమన్వయాన్నే ‘హైపోథాలమో-పిట్యూటరీ-గొనాడల్‌ యాక్సిస్‌’ అంటారు. యవ్వన మార్పులు మొదలవ్వటానికి ముందు వరకూ కూడా ఈ ప్రేరణ ప్రక్రియ.. నిద్రాణంగా ఉండిపోతుంది. ‘హైపోథాలమస్‌’ మన ఎముకల వయసును ఆధారంగా చేసుకుని.. పాప/బాబు ఒక వయసుకు రాగానే పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించే కార్యక్రమం ఆరంభిస్తుంది. అది ఆడపిల్లల్లో అండాశయాలను, మగపిల్లల్లో వృషణాలను ప్రేరేపించి.. యవ్వన మార్పులకు శ్రీకారం చుడుతుంది. ఇక మార్పుల పరంపర ఆరంభమవుతుంది. కాబట్టి ఈ పరంపరకు ఎముక వయసు ముఖ్యమని గుర్తించాలి. సాధారణంగా మన వయసు, ఎముక వయసు.. ఒకే తీరుగా ఉంటాయి. కానీ ఏదైనా కారణాన- ఒక పిల్లవాడికి సాధారణ వయసు 10 ఏళ్లు ఉండి, ఎముకలను బట్టి ఎక్స్‌రేల్లో మాత్రం 8 ఏళ్లే ఉందనుకుందాం.. అప్పుడు హైపోథాలమస్‌ ఎముక వయసునే గుర్తిస్తుంది. దాని ఆధారంగానే యవ్వన మార్పులు మొదలవుతాయి. ఎముక వయసు ఎప్పుడు అదనుకు వస్తే అప్పుడే యవ్వన మార్పులు మొదలవుతాయి.

యవ్వన మార్పుల్లో ప్రధానంగా- మొత్తం మార్పులకు శ్రీకారం చుట్టే హైపోథాలమస్‌ స్రవించే గొనడోట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జీఎన్‌ఆర్‌హెచ్‌), అండాలు/శుక్రకణాల కుదుళ్లను, హార్మోన్‌ ఉత్పాదక కణాలను ప్రేరేపించే ‘ఫాలికిల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌(ఎఫ్‌ఎస్‌హెచ్‌), లూటినైజింగ్‌ హార్మోన్‌ (ఎల్‌హెచ్‌) కీలక పాత్ర పోషిస్తాయి. ఎఫ్‌ఎస్‌హెచ్‌ వల్ల మగపిల్లల్లో వృషణాల సైజు పెరుగుతుంది, శుక్రకణాలు పెరుగుతాయి. వృషణాల్లో ప్రధానంగా రెండు రకాల కణాలుంటాయి. ఒకటి- జెర్మ్‌ సెల్స్‌. ఇవి శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. రెండు- లిడిగ్‌ కణాలు. ఇవి పురుష హార్మోనైన టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ప్రేరేపించే పాత్ర ఎల్‌హెచ్‌ది. వీటి మధ్య చక్కటి సమన్వయం ఉంటుంది. ఆడపిల్లల్లోనూ దాదాపుగా ఇదే క్రమం కొనసాగుతుంది. ఆడ, మగ పిల్లలిద్దరిలోనూ యవ్వన మార్పులకు ముందు అంతా ఎఫ్‌ఎస్‌హెచ్‌ ప్రధాన పాత్ర పోషిస్తే ఆ తర్వాత ఎల్‌హెచ్‌ ప్రధానంగా ఉంటుంది. అందుకే యవ్వన మార్పులకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పడు వైద్యులు ప్రధానంగా జీఎన్‌ఆర్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌, ఎల్‌హెచ్‌, టెస్టోస్టిరాన్‌ వంటి హార్మోన్‌ పరీక్షలు చేయిస్తారు. వికాస క్రమం సాధారణంగా నవయవ్వన మార్పులన్నవి (ప్యూబర్టీ) మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల్లో కాస్త ముందుగా మొదలై.. కొంత ముందుగానే ముగుస్తాయి. మగపిల్లల్లో కాస్త లేటుగా మొదలై, మరికొన్నేళ్ల పాటు కొనసాగుతుంది.

అమ్మాయి... అబ్బాయి

* సాధారణంగా ఆడపిల్లల్లో యవ్వన మార్పులన్నవి 9 ఏళ్లకు మొదలై.. 14 ఏళ్లకల్లా ముగుస్తాయి. మొత్తమ్మీద అంతా సవ్యంగానే సాగితే ఆడపిల్లలు 14 ఏళ్ల తర్వాత ఎత్తు పెరగటమనేది ఉండదు.

* ఆడపిల్లల్లో కనిపించే మొట్టమొదటి యవ్వన మార్పు- రొమ్ములు పెరగటం (థెలార్కీ). తర్వాత ఆర్నెల్లు-ఏడాదికి బాహుమూలల్లోనూ, మర్మాంగాల వద్ద వెంట్రుకలు పెరగటం (ప్యూబార్కీ/అడ్రినార్కీ) మొదలవుతుంది. రొమ్ములు పెరగటం ఆరంభమైన 3-4 ఏళ్లకు రజస్వల అవుతారు. కాబట్టి ఆడపిల్లలో యవ్వన మార్పులు 9 ఏళ్లకు మొదలయ్యాయనుకుంటే 12 ఏళ్లకల్లా రజస్వల అవుతారు.

* రజస్వల కావటానికి కొద్దిగా ముందే ఎత్తు చాలావేగంగా పెరుగుతారు. ముఖ్యంగా ఈ తొలి బహిష్టుకు 3-6 నెలల ముందు చాలా వేగంగా పెరుగుతారు. ఆ తర్వాత కూడా పెరుగుతారుగానీ అంత వేగం ఉండదు. వేగం కొంత మందగిస్తుంది.

* రజస్వల అయిన రెండేళ్లకల్లా ఎత్తు పెరగటం ఆగిపోతుంది. ఇదీ సాధారణంగా ఆడపిల్ల యవ్వనవతిగా మారే క్రమం. ఇదంతా దశలవారీగా జరుగుతుంది. దాదాపు 90 శాతం మంది ఆడపిల్లల్లో పెరుగుదల క్రమం ఇదే తీరులో ఉంటుంది.

* ఆడపిల్లలకు మొదటి ఒకటి రెండేళ్లూ వెంటవెంటనే బహిష్టులు రాకపోవచ్చు. మొట్టమొదటి బహిష్టులో పరిపక్వమైన అండం ఉండదు. పరిపక్వమైన అండం 8-9 నెలల తర్వాతే వస్తుంది. అక్కడి నుంచీ ముట్లుడిగే వరకూ అలాగే ఉంటుంది.

* ఆడపిల్లలతో పోలిస్తే.. మగపిల్లల్లో యవ్వన మార్పులన్నీ కూడా కాస్త లేటుగా, మరికొన్నేళ్లకు గానీ మొదలవ్వవు.

* వీరిలో కనిపించే మొట్టమొదటి మార్పు వృషణాల పరిమాణం పెరగటం. సాధారణంగా 12 ఏళ్లకు మొదలవుతుంది. అప్పటి వరకూ చాలా చిన్నగా ఉండే వృషణాలు క్రమేపీ సైజు పెరగుతుంటాయి.

* వృషణాల పరిమాణం పెరగటం ఆరంభమైన తర్వాత నెమ్మదిగా పురుషాంగం సైజు కూడా పెరుగుతుంది.

* క్రమేపీ పురుషాంగం వద్ద, చంకల్లో వెంట్రులు పెరగటం మొదలవుతుంది. గొంతు మారుతుంది. చివరగా గడ్డాలూ, మీసాలూ వస్తాయి. 12 ఏళ్లకు మొదలయ్యే ఈ పరిణామ క్రమం 17-18 ఏళ్ల వరకూ కొనసాగుతుంది. ఈ రకంగా చూస్తే- మగపిల్లల్లో ఎదుగుదల క్రమం దాదాపు ఐదారేళ్ల పాటు కొనసాగుతుంది. పెరుగుదల అనేది అమ్మాయిల్లో 12-13 ఏళ్లకే ముగిసిపోతే అబ్బాయిలు 17-18 వరకూ కూడా ఎంతోకొంత సాగుతూనే ఉంటారు. కాబట్టే అబ్బాయిలు అమ్మాయిల కంటే ఎంతోకొంత పొడవు ఎక్కువ ఉంటారు.

* క్రీడాకారుల్లో యవ్వన మార్పులు కొంత ఆలస్యంగా మొదలవుతాయి కాబట్టి వాళ్లు ఎక్కువ ఎత్తు పెరుగుతుండటం సహజంగా చూస్తూనే ఉంటాం.

కానరాని.. యవ్వన మార్పులు

* తల్లిదండ్రుల్లో కూడా యవ్వన మార్పులు ఆలస్యంగానే వచ్చి ఉంటే వారి పిల్లలకు కూడా కొంత ఆలస్యం కావచ్చు (ఫెమిలియల్‌).

* చాలామందిలో కనిపించే సర్వసాధారణమైన సమస్య- ‘కాన్‌స్టిట్యూషనల్‌ డిలే ఆఫ్‌ గ్రోత్‌ అండ్‌ ప్యూబర్టీ’ (సీడీజీపీ). ఇదేమీ అసహజం కాదు. అన్నీ బాగానే ఉండి, వీరిలో మార్పులు కాస్త ఆలస్యమవుతాయి. కానీ చాలామంది ఆందోళన చెందుతుంటారు. దీంతో వైద్యులు ఏదైనా కారణం ఏమైనా ఉందేమోనని రకరకాల పరీక్షలు చేస్తుంటారు. కానీ ఉన్నట్టుండి వీళ్లలో పెరుగుదల దానంతట అదే ఆరంభమవుతుంటుంది.

* మొత్తమ్మీద... ఆడపిల్లల్లో 13 ఏళ్లు వచ్చినా, మగపిల్లల్లో 14 ఏళ్లు వచ్చినా కూడా.. యవ్వన మార్పులకు సంబంధించిన లక్షణాలేవీ అస్సలేమాత్రం కనబడకపోతేనే దాన్ని ‘డిలేడ్‌ ప్యూబర్టీ’గా నిర్ధారిస్తారు.అప్పుడు దీనికి కారణాలేమిటన్నది నిర్ధారించటం, అందుకు పరీక్షల వంటివన్నీ అవసరమవుతాయి.

* హైపోగొనాడిజం: అండాశయాలు, వృషణాలు పని చెయ్యకపోతుండటమో.. లేక పిట్యూటరీ గ్రంథి పనితీరులో తేడాలుండటం వంటి సమస్యలుంటే యవ్వన మార్పులు మొదలవ్వకపోవచ్చు. ఇటువంటి వాటిని గుర్తించటం ముఖ్యం. ఆడపిల్లల్లో అండాశయాలు, మగపిల్లల్లో వృషణాలూ యవ్వన మార్పులకు కీలకం. వీటినే ‘గోనాడ్స్‌’ అంటారు. వీటి పనితీరు సరిగా లేకపోవటాన్నే ‘హైపోగొనడిజం’ అంటారు. అయితే వీటి పనితీరు సరిగా లేదని నిర్ధారించుకోవటం చాలా కీలకం. ఉదాహరణకు ఇటువంటి మగపిల్లలకు బయటి నుంచి ‘టెస్టోస్టిరాన్‌’ హార్మోన్‌ను ఇస్తే గడ్డం మీసాలు రావటం వంటి యవ్వన లక్షణాలన్నీ వస్తాయిగానీ.. వీరిలో వృషణాల సైజు మాత్రం పెరగకపోవచ్చు. ఒకవేళ ఈ చికిత్సతో వీరిలో వృషణాల సైజు కూడా పెరుగుతుంటే- వారిలో యవ్వన మార్పులు సహజంగానే లేటు అవుతున్నాయే తప్పించి తీవ్రమైన వ్యాధి ఏదీ లేదనే అర్థం. దాన్ని ‘సీడీజీపీ’గా గుర్తిచాల్సి ఉంటుంది. చాలామందిలో ఇదే జరుగుతుంది. ఇది మగపిల్లల్లోనే ఎక్కువ. అందుకని ‘హైపోగొనాడిజం’ అని నిర్ధారించటానికి ముందు కనీసం 18 ఏళ్లన్నా చూడాలి. ఒకవేళ వీరికి వృషణాల సైజు పెరగటం లేదంటే వీరికి నెలకోసారి లేదా మూడునెలలకోసారి టెస్టోస్టిరాన్‌ ఇంజక్షన్‌ ఇస్తుండాల్సి ఉంటుంది. భవిష్యత్తులో సంతానవకాశాల వంటివాటన్నింటినీ వైద్యులతో చర్చించాల్సి ఉంటుంది.

* అలాగే ఆడపిల్లల్లో 13, 14 ఏళ్లకు ఇంకా యవ్వన మార్పులు రావటం లేదని ఆందోళనగా ఉంటే.. ఏదైనా సమస్య ఉందా? లేక సహజంగానే లేటైందా? అన్నది తెలుసుకునేందుకు జీఎన్‌ఆర్‌హెచ్‌ ఇంజక్షన్‌ ఇస్తారు. దీంతో ఎల్‌హెచ్‌ పెరగుతోందంటే.. అంతా సహజంగానే జరగుతుంది, కంగారేం లేదు.. కొంత కాలం వేచిచూడొచ్చని వైద్యులు కౌన్సెలింగ్‌ ఇస్తారు.

యవ్వన పవనాలు ముందే పలకరిస్తే?

ఆడపిల్లల్లో 8 ఏళ్ల కంటే ముందుగా.. లేదా మగపిల్లల్లో 9 ఏళ్ల కంటే ముందే యవ్వన లక్షణాలు మొదలైపోతుంటే దాన్ని ‘ప్రికోసియస్‌ ప్యూబర్టీ’ అంటారు. ఇది తరచుగా కనబడే సమస్యే. వీరిలో కూడా రకరకాలుంటాయి. ఈ మార్పులు సహజంగానే కాస్త ముందుగా మొదలయ్యాయా? లేక ఏదైనా సమస్య ఉందా? అన్నది చూడాల్సి ఉంటుంది. కేవలం రొమ్ములు మాత్రమే కాస్త ముందుగా పెరుగుతుంటే (ప్రిమెచ్యూర్‌ థెలార్కీ) పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే దీనికి ముందస్తుగా బహిష్టులు రావటం, ఎత్తు పెరగటం ఆగిపోవటం వంటివాటితో సంబంధం ఉండదు. అందుకని ఆర్నెల్లకోసారి వీరిని పరిశీలిస్తుంటారు. అలా కాకుండా.. దానితో పాటు మిగతా యవ్వన మార్పులన్నీ కూడా బయల్దేరుతుంటే మాత్రం దాన్ని అత్యవసరంగా ఆపటం అవసరం. అంటే వీరిలో యవ్వన మార్పులు మెదడులోనే మొదలై.. మొత్తం ఆ ప్రక్రియ, పరంపర వరసగా రాబోతోందన్న మాట. దీన్నే ‘సెంట్రల్‌ ప్రికోసియస్‌ ప్యూబర్టీ’ అంటారు.

సాధారణంగా చిన్నతనంలో ఆడపిల్లల యోని, యోని ముఖద్వారం సైజులు గర్భాశయం కంటే పెద్దగా ఉంటాయి. యవ్వన దశ వచ్చేసరికి ఆ రెండూ తగ్గి.. గర్భాశయం సైజు పెరుగుతుంటుంది. అందుకని అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేసి గర్భాశయం సైజు పెరుగుతోందా? అండాశయాలు కూడా పెరుగుతున్నాయా? అన్నది చూస్తారు. అలాగే ఎముక వయసు ఎంతన్నదీ చూడాలి. ఎందుకంటే ‘సెంట్రల్‌ ప్యూబర్టీ’ అయితే ఎముక వయసు కూడా పెరుగుతుంది. దీనివల్ల మిగతా పిల్లలు పెరగనప్పుడు ఈ పిల్ల వేగంగా పెరుగుతుంటుంది, వాళ్ల పెరుగుదల మొదలయ్యే సమయానికే ఈ పాప పెరగటం ఆగిపోతుంది. దీన్నే ‘పారడాక్స్‌ ఆఫ్‌ ప్రికోసియస్‌ ప్యూబర్టీ’ అంటారు. ఇలా పెరిగినా చివరికి ఇతరుల కంటే వీరి ఎత్తు బాగా తక్కువ ఉంటుంది. అందుకని దీనికి మూలం మెదడులోనే ఉందా? అన్నది పరీక్షించి అదేనని నిర్ధారించుకుంటే.. దాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఇందుకోసం పాప సహజమైన వయసుకు వచ్చే వరకూ నెలనెలా లేదా మూణ్ణెల్లకోసారి ‘జీఎన్‌ఆర్‌హెచ్‌ డిపో’ ఇంజక్షన్‌ ఇవ్వటం ద్వారా అణిచివేసి ఉంచుతారు. దీంతో రొమ్ముల పెరుగుదల, ఎముక వయసు పెరగటం కూడా ఆగుతాయి. సహజమైన రజస్వల వయసుకు వచ్చాక ఇంజెక్షన్లు ఆపేస్తారు. అవసరమైతే ఎత్తు పెరగటానికి గ్రోత్‌ హార్మోన్‌ కూడా ఇస్తారు. ప్రికోసియస్‌ ప్యూబర్టీ వచ్చినా భవిష్యత్తులో వారి సంతానావకాశాల వంటి సమస్యలేమీ ఉండవు.

సహజమే అయినా..

* ప్రిమెచ్యూర్‌ ఎడ్రినార్కీ: మగపిల్లల్లో, ఆడపిల్లల్లో చిన్నవయసులోనే మర్మాంగాల వద్ద రోమాలు పెరగటం వంటివి కనిపించొచ్చు. అప్పుడు వైద్యులు పరీక్షించి మిగతావన్నీ సాధారణంగానే ఉంటే పెద్ద ఇబ్బందేమీ లేదేని కౌన్సెలింగ్‌ ఇస్తారు.

* గైనకోమాస్టియా: ఏ సమస్యా లేకుండా మగపిల్లల్లో రొమ్ములు పెరగటం కూడా సర్వసాధారణమే. దీన్నే ప్యూబర్టల్‌ గైనకోమాస్టియా అంటారు. ఎందుకంటే యవ్వన మార్పులు వచ్చే సమయంలో శరీరంలో పురుష హార్మోన్‌ స్థాయులు ఎక్కువగా ఉండి, అది చాలా ఎక్కువగా ఈస్ట్రోజెన్‌గా మారుతుంది. వూబకాయుల్లో ఇది మరీ ఎక్కువ. అందుకే వీరిలో రొమ్ములు పెరిగే అవకాశమూ ఎక్కువే. యవ్వన మార్పుల తర్వాత 20-30 శాతం మందిలో దానంతట అదే తగ్గిపోతుంది. ఇంకా అలాగే ఉంటే సర్జరీ ద్వారా తొలగించొచ్చు.

* కొందరిలో అండాశయాల్లో సిస్ట్‌ల వంటివి ఉండటం వల్ల ఈస్ట్రోజెన్‌ విడుదలై దానివల్ల బహిష్టులు ముందే రావచ్చు. వీరిలో ఇతర యవ్వన లక్షణాలు అంటే రొమ్ములు పెరగటం, రోమాలు పెరగటం వంటి లక్షణాలుండవు. కేవలం బహిష్టులు మాత్రమే ఉంటాయి.

* థైరాయిడ్‌ హార్మోను ఉత్పత్తి తక్కువగా ఉన్నా కూడా (హైపోథైరాయిడిజం) యవ్వన మార్పులు జాప్యం జరగొచ్చు, లేదా ముందుగానూ రావచ్చు. దీన్ని గుర్తించి వెంటనే థైరాక్సిన్‌ మాత్రలు ఇస్తే మొత్తం సరి అవుతుంది.

* టర్నర్స్‌ సిండ్రోమ్‌, లోరెన్స్‌ మోన్‌ బిడెల్‌ సిండ్రోమ్‌ వంటి క్రోమోజోములు, జన్యుపరమైన సమస్యల్లో కూడా యవ్వన మార్పులు అస్తవ్యస్తం కావచ్చు. క్రోమోజోముల పరీక్షలతో వీటిని గుర్తించటం అవసరం. వీరికి తక్కువ డోసులో ఈస్ట్రోజెన్‌ ఇవ్వటం ద్వారా ఎదుగుదల, పెరిగేలా చెయ్యొచ్చు.

* యవ్వన మార్పుల్లో జాప్యంతో పాటుగా బీపీ వంటివి కూడా ఎక్కువగా ఉంటే స్టిరాయిడ్‌ ఎంజైమ్‌ లోపం వల్ల కూడా జరగొచ్చు. మెదడులో కణుతులు కూడా కొన్నిసార్లు ముందస్తు సమస్యలను తెచ్చిపెట్టొచ్చు. ఐదారేళ్ల పిల్లల్లోనే రోమాలు పెరగటం వంటివి కనబడొచ్చు. వీరికి మెదడుకు ఎమ్మారై పరీక్ష చేసి.. మెదడులో ఏ సమస్యా లేదని నిర్ధారించుకోవటం అవసరం.

* క్లైమ్‌ఫెల్టర్స్‌ సిండ్రోమ్‌ వంటివి ఉంటే వృషణాలు చిన్నగా ఉంటాయి, రొమ్ములు పెరుగుతాయి. గడ్డం, మీసం వంటివన్నీ బాగానే ఉంటాయిగానీ పరీక్ష చేస్తే ఎల్‌హెచ్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి వీర్యంలో శుక్రకణాలుండవు. మందులతో వీరికి అన్నీ చక్కదిద్దచ్చుగానీ సంతాన సామర్థ్యం తేవటం మాత్రం కష్టం. జీవితాంతం ఆండ్రోజెన్‌ ఇంజక్షన్లు తీసుకుంటూ ఉండాల్సి రావచ్చు.

* హైపో గొనడో ట్రోఫిక్‌ హైపోగొనడిజం: పిట్యూటరీ గ్రంథి లోపం వల్ల వారిలో టెస్టోస్టిరాన్‌ హార్మోను ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. వీరికి బయటి నుంచి టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ను, తర్వాత ఎల్‌హెచ్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌ వంటి ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వీరిలో శుక్రకణాల వంటివన్నీ సాధారణంగానే ఉండొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు