logo

Amaravati: ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!

జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్‌సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు.

Published : 27 Apr 2024 06:32 IST

సీహెచ్‌ బాలశౌరి.. బాలశౌరమ్మ పేర్లతో నామపత్రాలు...
నాని పీఏ, లాయర్లు, కార్పొరేటర్లతో దగ్గరుండి పర్యవేక్షణ
ఓటమి భయంతోనే.. ఇలా అడ్డదారుల్లో యత్నాలు
 

పేర్ని

ఈనాడు, అమరావతి: జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్‌సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. సీహెచ్‌.బాలశౌరి, బాలశౌరమ్మ అనే పేర్లున్న ఇద్దరిని వెతికి పట్టుకుని తెచ్చి.. తన మందీ మార్బలాన్ని దగ్గరుంచి మరీ మచిలీపట్నం లోక్‌సభకు వారితో నామినేషన్లను దాఖలు చేయించారు. తాజాగా శుక్రవారం లోక్‌సభకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన(స్క్రూట్నీ) కార్యక్రమం.. మచిలీపట్నం కలెక్టరేట్‌ ప్రాంగణంలో జరిగింది. స్క్రూట్నీ నేపథ్యంలో పేర్ని నాని పీఏ శ్యామ్సన్‌ దగ్గరుండి మరీ.. సీహెచ్‌.బాలశౌరి, బాలశౌరమ్మ, ముగ్గురు న్యాయవాదులను తీసుకుని కలెక్టర్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వీరితోపాటు పేర్ని అనుచరులు కూడా పెద్దసంఖ్యలో వచ్చి.. కలెక్టర్‌ కార్యాలయం గేటు బయట వేచి ఉన్నారు.

గ్లాసును పోలిన గుర్తు కోసం..

జనసేన తరఫున పోటీ చేస్తున్న వల్లభనేని బాలశౌరికి గాజు గ్లాసు గుర్తును కేటాయించడంతో.. వీళ్లు కూడా దానిని పోలిన గుర్తుకోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. ఓటర్లను అయోమయానికి గురిచేసి.. వల్లభనేని బాలశౌరికి పడే ఓట్లను వీరికి పడేలా చేయాలనే కుట్రలో భాగంగానే.. వైకాపా ఆధ్వర్యంలో ఈ కుతంత్రానికి తెరలేపారు. సిహెచ్‌.బాలశౌరిని.. జాతీయ జనసేన అనే పార్టీ తరఫున నామినేషన్‌ వేయించారు. బాలశౌరమ్మను.. నవరంగ్‌ జాతీయ కాంగ్రెస్‌ అనే పార్టీ తరఫున బరిలోకి దించారు. వీరిద్దరికీ జనసేన గ్లాసుకు దగ్గర పోలిక ఉండే.. బకెట్‌ గుర్తు కోసం తొలుత ప్రయత్నించినా.. అది వేరొక స్వతంత్ర అభ్యర్థికి వెళ్లిపోయింది. దీంతో పేర్ని అనుచరులు చాలామంది వచ్చి బాలశౌరమ్మకే బకెట్‌్ గుర్తును ఇవ్వాలని శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ ఎదుట హడావుడి చేశారు. మరోవైపు.. సీహెచ్‌.బాలశౌరి పేరుతో నామినేషన్‌ వేసిన అభ్యర్థికి పెన్‌ బాక్సు గుర్తును కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇదికూడా కొద్దిగా గ్లాసును పోలి ఉంటుంది. అందుకే.. ఎలాగైనా వల్లభనేని బాలశౌరికి పడే ఓట్లను.. మళ్లించాలని చాలా తీవ్రంగానే పేర్ని వర్గం ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది.

నామినేషన్లు తిరస్కరణకు గురవకుండా..

బాలశౌరమ్మ, సీహెచ్‌.బాలశౌరి పేర్లతో వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురికాకుండా.. పరిశీలనలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా వాటిని నివృత్తి చేసేందుకు ముగ్గురు న్యాయవాదులను సిద్ధంగా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఉంచారు. వారితో పాటు పేర్ని నాని పీఏ శ్యామ్సన్‌, అభ్యర్థులు కూడా ఉన్నారు. పరిశీలన పూర్తయి.. నామినేషన్లకు ఆమోద ముద్ర పడేవరకూ.. వారంతా ఉత్కంఠగా ఎదురుచూస్తూ కలక్టరేట్‌ ప్రాంగణంలో వేచి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని