Published : 12 Jun 2018 02:44 IST

నోటితో అడగడు.. చేయిపట్టి తీసుకెళ్తాడు!

సమస్య - సలహా
నోటితో అడగడు.. చేయిపట్టి తీసుకెళ్తాడు!

ప్రశ్న: మా మనవడికి నాలుగేళ్లు. ఏదైనా కావాలంటే నోటితో అడగడు. తిండి తినాలన్నా, నీళ్లు కావాలన్నా, బాత్రూమ్‌కు వెళ్లాలన్నా తల్లిదండ్రుల చేయి పట్టుకొని అక్కడి వరకూ తీసుకెళ్లి చూపిస్తాడు. కోపంతో ఉన్నప్పుడు పళ్లు కొరుకుతుంటాడు. ఇదేమైనా సమస్యా? దీనికి చికిత్స ఉందా?

- సంజీవరావు (ఈమెయిల్‌ ద్వారా)

జవాబు: చెప్పిన వివరాలను బట్టి చూస్తే మీ మనవడికి ‘ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌’ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇది ఎదుగుదల సమస్య. పిల్లల ఎదుగుదల క్రమంలో ఐదేళ్ల లోపు వయసు చాలా కీలకం. నడవటం దగ్గర్నుంచి.. మాట్లాడటం, తమకు అవసరమైనవి అడగటం (వర్బల్‌) వంటివి ఈ వయసులోనే అలవడతాయి. అలాగే చుట్టుపక్కల పరిసరాలను గుర్తించటం, తమ ఇష్టాయిష్టాలను చేతలతో వ్యక్తం చేయటం (నాన్‌వర్బల్‌) వంటివన్నీ అబ్బుతాయి. కానీ ఆటిజమ్‌ పిల్లల్లో ఇవి కొరవడతాయి. వీరు శారీరకంగా బాగానే ఎదుగుతారు గానీ నలుగురితో కలవటంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణంగా మనం ఎవరైనా ఏదైనా అడిగితే దానికి తిరిగి సమాధానం ఇస్తుంటాం. లేదూ.. మనం ఏదైనా అడిగినప్పుడు ఎదుటివాళ్లు చెప్పే విషయాన్ని అర్థం చేసుకుంటాం. ఆటిజమ్‌ పిల్లల్లో ఇలాంటి నైపుణ్యం తక్కువ. వీరికి తమకేం కావాలో తెలుస్తుంటుంది. ఏది? ఎందుకు? అనే జ్ఞానమూ ఉంటుంది. తమకు ఆకలి వేస్తోందని, తినాలని తెలుస్తుంటుంది. అయితే తాము చెప్పిన విషయాన్ని ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకుంటారని గానీ తమ అవసరాలు తీరుస్తారని గానీ తెలియదు. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే దానికి సమాధానం ఇవ్వటం తెలియక సతమతమవుతుంటారు. దీన్ని ఎంత త్వరగా గుర్తించి చికిత్స చేస్తే అంత ఫలితం కనబడుతుంది. ఐదేళ్లలోపే చికిత్స ఆరంభిస్తే మెదడులోని నాడీ కణాల మధ్య అస్తవ్యస్తమైన అనుసంధానాలు తిరిగి కుదురుకునే అవకాశముంది. అందువల్ల మీ మనవడిని వెంటనే సైక్రియాటిస్టుకు చూపించటం మంచిది. ఇతరత్రా నాడీ సమస్యలేమైనా ఉన్నాయేమో చూసి సమస్యను నిర్ధరిస్తారు. చైల్డ్‌ ఆటిజమ్‌ రేటింగ్‌ స్కేల్‌ (సీఏఆర్‌ఎస్‌) ఆధారంగా తీవ్రతను అంచనా వేస్తారు. సమస్య ఒక మాదిరిగా ఉంటే కౌన్సెలింగ్‌తో మంచి ఫలితం కనబడుతుంది. ఇందులో ఎదుటివాళ్లను, చుట్టుపక్కల పరిసరాలను అర్థం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించేలా శిక్షణ ఇస్తారు. ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేలా చేయటం, వారితో మాట్లాడేలా చేయటం, నలుగురిలో ఉన్నప్పుడు మెలిగే పద్ధతులను నేర్పించటం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. అలాగే వీరికి స్పీచ్‌ థెరపీ కూడా మేలు చేస్తుంది. పిల్లలు మాట్లాడితే ఎలా ప్రవర్తించాలి? మాట్లాడకపోతే ఎలా ప్రవర్తించాలి? అనేవి తల్లిదండ్రులకు నేర్పిస్తారు. అవసరమైతే పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా శిక్షణ (ఆక్యుపేషనల్‌ థెరపీ) కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆటిజమ్‌ పిల్లల్లో కొందరు అదేపనిగా అరవటం, గెంతులేయటం చేస్తుంటారు. అలాంటివేమైనా ఉంటే ప్రవర్తన చికిత్సతో (బిహేవియర్‌ థెరపీ) సరిదిద్దొచ్చు. ఈ చికిత్సలతో బడికి వెళ్లే సమయానికి నలుగురితో కలిసి మెలసి ఉండటానికి అవసరమైన నైపుణ్యం పిల్లలకు అబ్బుతుంది. నాడీకణాల మధ్య అనుసంధానాలు అస్తవ్యస్తమైతే ఐదేళ్ల తర్వాత అవి కుదరుకోవటానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా చికిత్స ఇప్పించటం మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే- ఆటిజమ్‌ను ఎదిగే వయసులోనే సరిదిద్దటం అవసరం. లేకపోతే మున్ముందు చదువులో వెనకబడటం, నలుగురితో సరిగా మాట్లాడలేకపోవటం, కలవలేకపోవటం వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు