Published : 17 Jul 2018 01:16 IST

పసి కామెర్లా.. పారాహుషార్‌!

పసి కామెర్లా.. పారాహుషార్‌!

పసుపంటే కొన్నిసార్లు భయం భయం. నిజమే.. మనం శుభ సూచకంగా, మంగళప్రదమైందిగా భావించే పసుపురంగు కంట్లోనో, చర్మం మీదో కనబడితే ఉన్నట్టుండి ఉలిక్కిపడతాం. కామెర్లేమోనని భయపడిపోతాం. ఇది అవసరం కూడా. పసి పిల్లల విషయంలో ఇది మరింత అత్యవసరం. పుట్టిన తొలిరోజుల్లో శిశువుల్లో కామెర్లు సర్వ సాధారణమే కావొచ్చు. కొద్దిరోజుల్లో వాటంతటవే తగ్గిపోనూవచ్చు. కానీ అన్నిసార్లూ ఇలాగే జరగాలనేమీ లేదు. కాలేయ నిర్మాణ లోపాలు, ఇన్‌ఫెక్షన్లు, జీవక్రియ సమస్యల వంటి సమస్యలతో తలెత్తే కామెర్లు ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. కాబట్టే రెండు వారాలు దాటినా కామెర్లు తగ్గకపోతే తక్షణం అప్రమత్తం కావాలని.. దీన్ని ‘ఎల్లో అలర్ట్‌’గా పరిగణించాలని వైద్యరంగం స్పష్టంగా చెబుతోంది. లేకపోతే కాలేయం, మెదడు వంటి కీలక అవయవాలు దెబ్బతినొచ్చని గట్టిగా హెచ్చరిస్తోంది. అందుకే శిశు కామెర్లపై సమగ్ర కథనం అందిస్తోంది ఈ వారం సుఖీభవ.

‘‘బామ్మా.. పాప కళ్లు పచ్చగా కనబడుతున్నాయే’’ ఒక తల్లి ఆందోళన.
‘‘అవే తగ్గిపోతాయిలేమ్మా.. ఉదయం పూట పాపను కాసేపు ఎండకు తీసుకెళ్తే చాలు’’ ఒక బామ్మ భరోసా.
పండంటి పాపాయి పుట్టిన తొలిరోజుల్లో ఇలాంటి సంభాషణ కొత్తేమీ కాదు. శిశువుల్లో కామెర్లు తరచుగా చూస్తున్నదే. సాధారణంగా పిల్లలు పుట్టిన రెండో రోజున గానీ మూడో రోజున గానీ కామెర్లు మొదలవుతుంటాయి. దీంతో బిడ్డ కళ్లు, చర్మం పచ్చబడుతుంటాయి. దీనికి మూలం రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు పెద్దఎత్తున పెరిగిపోవటం. ఎర్ర రక్తకణాలు విడిపోయినప్పుడు బిల్‌రుబిన్‌ ఉత్పత్తి అవుతుంటుంది. దీన్నే ఇన్‌డైరెక్ట్‌ బిల్‌రుబిన్‌ అంటారు. ఇది కాలేయంలోకి వెళ్లి ఎంజైమ్‌ల సాయంతో గ్లూకోరోనిక్‌ ఆమ్లంతో సమ్మిళితమై నీటిలో కరిగే విధంగా (డైరెక్ట్‌ బిల్‌రుబిన్‌) మారుతుంది. అక్కడ్నుంచి పైత్యరసంలో కలిసి పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది కొంత మలం ద్వారా, మరికొంత మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే పుట్టిన తొలినాళ్లలో శిశువుల్లో కాలేయం పూర్తిగా అభివృద్ధి చెందదు. అందువల్ల పెద్దమొత్తంలో విడుదలయ్యే బిల్‌రుబిన్‌ను అది అంతగా స్వీకరించలేదు. ఫలితంగా రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు పెరిగిపోతాయి. ఇది చర్మంలో, తెల్లగుడ్డులో, జిగురుపొరల్లో స్థిరపడిపోతుంది. దీంతో కళ్లు, చర్మం, నాలుక కిందిభాగం పసుపురంగులోకి మారిపోతుంటాయి. నిజానిది అంత సమస్యాత్మకమేమీ కాదు. వారం, పది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. శిశువుల ఒంటికి రోజూ కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం, దీంతో కుదురుకోకపోతే ఫొటోథెరపీ ఇస్తే సరిపోతుంది. దీంతోనే చాలామందికి కామెర్లు నయమైపోతాయి. అయితే కొందరిలో కామెర్లు 2 వారాలైనా తగ్గకుండా వేధిస్తుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇతరత్రా సమస్యల మూలంగా తలెత్తే దీనికి వీలైనంత త్వరగా చికిత్స చేయించటం తప్పనిసరి. ఆలస్యం చేసిన కొద్దీ కాలేయం దెబ్బతింటుంది. దీని గురించి తెలియకపోవటం వల్ల మనదేశంలో ఎంతోమంది పిల్లలను 3 నెలల తర్వాతే ఆసుపత్రులకు తీసుకొస్తున్నారు. ఇది పిల్లల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతుంది. పోషణ లోపం, రక్తస్రావం, కండరాలు క్షీణించటం వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకోవటం అవసరం. ‘కామెర్లే కదా.. అవే తగ్గిపోతాయిలే’ అని అనుకోకుండా.. అవి మామూలు కామెర్లా? ఇతరత్రా సమస్యలతో వచ్చాయా? అనేది చూసుకోవటం మంచిది.

మామూలు కామెర్లు

శిశువుల్లో చాలామందిలో కనబడేవి ఇలాంటి కామెర్లే. ఇవి పుట్టిన రెండో రోజున లేదా మూడో రోజున మొదలవుతాయి. క్రమంగా తగ్గుతూ.. 10-14 రోజుల్లో నయమైపోతాయి. దీనికి రకరకాల కారణాలు దోహదం చేస్తాయి.
అపరిపక్వ కాలేయం: సాధారణంగా పెద్దవాళ్ల కన్నా శిశువుల్లో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎర్ర రక్తకణాలు పెద్దమొత్తంలో, త్వరగానూ విచ్ఛిన్నం అవుతుంటాయి. ఫలితంగా బిల్‌రుబిన్‌ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్న కాలేయం ఇంత పెద్దమొత్తంలో బిల్‌రుబిన్‌ను ఇముడ్చుకోలేదు. దీంతో రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు పెరిగి కామెర్లకు దారితీస్తుంది. దీన్నే ఫిజియోలాజికల్‌ జాండిస్‌ అంటారు.
తల్లిపాల ఎంజైమ్‌లు: తల్లిపాలలోని కొన్ని ఎంజైమ్‌ల మూలంగా కొందరిలో బిల్‌రుబిన్‌ ఒంట్లోంచి బయటకు వెళ్లటం తగ్గుతుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది. ఈ రకం కామెర్లు సాధారణంగా వారం తర్వాతే మొదలవుతుంటాయి. కాలేయం అభివృద్ధి చెందుతున్నకొద్దీ తగ్గుముఖం పడుతుంది. 14 రోజులు వచ్చేసరికి పూర్తిగా నయమవుతుంది. దీనికి తల్లిపాలు కారణమైనప్పటికీ పాలు పట్టటం ఆపాల్సిన అవసరం లేదు.
పాలు సరిపోకపోవటం: తల్లికి పాలు పడకపోయినా, పాలను బిడ్డ సరిగా తాగలేకపోయినా కడుపు నిండక పేగుల కదలికలు తగ్గిపోతాయి. ఫలితంగా కాలేయం నుంచి వచ్చిన పైత్యరసం బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. ఇది రక్తంలో కలిసి తిరిగి కాలేయానికి చేరుకుంటుంది. ఫలితంగా బిల్‌రుబిన్‌ మోతాదులూ పెరుగుతాయి. దీనికి పాలు సరిగా పడుతూ, బిడ్డ కడుపు నిండేలా చూసుకుంటే సరిపోతుంది.
తలకు దెబ్బ తగలటం: కాన్పు కష్టమైనపుడు కొన్నిసార్లు బిడ్డ తలకు దెబ్బతగలొచ్చు. ఇలాంటి సమయంలో తలలో చర్మం కింద రక్తం గడ్డ కట్టొచ్చు. ఇది కరిగిపోయే సమయంలో బిల్‌రుబిన్‌ మోతాదులూ పెరుగుతుంటాయి.
ఏబీఓ ఇన్‌కంపాటబిలిటీ: బిడ్డ రక్తం గ్రూపు, తల్లి రక్తం గ్రూపు వేరుగా ఉన్నప్పుడూ కామెర్లు రావొచ్చు.
ఇతర కారణాలు: మధుమేహ తల్లులకు పుట్టిన పిల్లల్లో, నెలలు నిండకముందే పుట్టినవారిలో, రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్న పిల్లల్లోనూ ఇలాంటి సాధారణ కామెర్లు తలెత్తొచ్చు.

నిర్ధరణ
కామెర్లను చూడగానే గుర్తుపట్టొచ్చు. వీరిలో చర్మం, తెల్లగుడ్డు, జిగురుపొరలు పసుపురంగులోకి మారుతూ వస్తుంటాయి. ఈ రంగు మారటమనేది తల నుంచి మొదలై కాళ్ల వరకు విస్తరిస్తుంటుంది. దీని తీరును బట్టి కామెర్ల తీవ్రతనూ అంచనా వేయొచ్చు. అవసరమైతే రక్తపరీక్ష చేసి బిల్‌రుబిన్‌ మోతాదులు పరీక్షిస్తారు. మామూలు కామెర్లలో కొందరిలో స్వల్పంగా కాలేయవాపు కనబడొచ్చు. చేత్తో నొక్కిచూస్తే ఇది తెలుస్తుంటుంది. కానీ మలం రంగు పాలిపోయినట్టుగా, తెల్లగా ఉండదు. పిల్లలు చురుకుగానే ఉంటారు.

చికిత్స- రెండు రకాలు
మామూలు కామెర్లలో బిడ్డను జాగ్రత్తగా గమనిస్తూ.. రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు ఎలా ఉంటున్నాయన్నది పరిశీలించాల్సి ఉంటుంది. బిల్‌రుబిన్‌ 12-15 మిల్లీగ్రాముల లోపు ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అదే నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లోనైతే 18 మిల్లీగ్రాముల వరకు చూడొచ్చు. బిల్‌రుబిన్‌ తగ్గకుండా పెరుగుతూ వస్తుంటే మాత్రం చికిత్స చేయాల్సి ఉంటుంది.
ఫొటోథెరపీ: రక్తంలో మొత్తం బిల్‌రుబిన్‌ మోతాదులు 20ఎంజీ మించితే ఫొటోథెరపీ అవసరమవుతుంది. ఇందులో బిడ్డను ఒక పెట్టెలో ఉంచి  ప్రత్యేక పౌనఃపున్యంతో కూడిన నీలం కాంతిని బిడ్డ ఒంటి మీద (కళ్లు, జననాంగాలు తప్పించి) పడేలా చేస్తారు. దీంతో బిల్‌రుబిన్‌ నీటిలో కరిగే విధంగా మారి.. మలమూత్రాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
రక్తం మార్చటం: బిల్‌రుబిన్‌ మోతాదులు 25ఎంజీ కన్నా పెరిగితే రక్తాన్ని మార్పిడి చేస్తారు. బొడ్డుదగ్గర ఉండే సిరలోకి చిన్న గొట్టాన్ని పంపించి.. దాని గుండా కొద్దికొద్దిగా రక్తాన్ని తీస్తారు. తిరిగి అంతే మొత్తంలో వేరే రక్తాన్ని క్కిస్తారు. దీంతో బిల్‌రుబిన్‌ స్థాయులు తగ్గిపోతాయి.

తీవ్ర కామెర్లు

కామెర్లు 2 వారాలైనా తగ్గకపోవటం.. కళ్లు, చర్మం బాగా పచ్చబడటం.. మూత్రం ముదురు రంగులో, మలం తెలుపురంగులో వస్తుండటం.. నొక్కినపుడు చేతికి కాలేయం ఉబ్బినట్టుగా తగలటం.. బిడ్డ నలత పడుతున్నట్టు కనబడితే కామెర్లను తేలికగా తీసుకోవటానికి లేదు. కాలేయంలోంచి పైత్యరసాన్ని బయటకు తీసుకొచ్చే నాళాల్లో లోపాల వంటి సమస్యలు దీనికి కారణం కావొచ్చు. వీటిని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స చేయటం తప్పనిసరి.

1 పైత్యనాళ లోపాలు: కొందరిలో పుట్టుకతోనే కాలేయంలోంచి పైత్యరసాన్ని బయటకు తీసుకొచ్చే నాళాలు మూసుకుపోవచ్చు. ఉండాల్సిన దానికన్నా సన్నగా ఉండొచ్చు, పొడవూ తగ్గొచ్చు. కొందరికి నాళాలు అసలే లేకపోవచ్చు. దీన్నే బిలియరీ అట్రీషియా అంటారు. దీంతో పైత్యరసం లోపలే ఉండిపోతుంది. క్రమంగా కాలేయం దెబ్బతింటూ గట్టిపడే స్థాయికి చేరుకుంటుంది. రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు పెరిగి కళ్లు, చర్మం పచ్చబడతాయి. పైత్యరసం పేగుల్లోకి చేరుకోకపోవటం వల్ల మలం పాలిపోయినట్టూ కనబడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. పైత్యనాళ లోపాలను హెపటో బిలియరీ న్యూక్లియర్‌ స్కాన్‌ పరీక్షతో నిర్ధరిస్తారు. కాలేయం నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షించటమూ (బయాప్సీ) ఉపయోగపడుతుంది. అలాగే సూది ద్వారా పిత్తాశయంలోకి రంగును ఎక్కించి, ఎక్స్‌రే తీసినా (ఆపరేటివ్‌ కొలాంజియోగ్రామ్‌) సమస్య బయటపడుతుంది.
చికిత్స: దీనికి సర్జరీ తప్ప మరో మార్గం లేదు. ఇందులో కాలేయం పైభాగాన్ని కొద్దికొద్దిగా తొలగించుకుంటూ.. నాళంలో సమస్య ఉన్న భాగానికి చేరుకుంటారు. తర్వాత చిన్నపేగును ఒకచోట కత్తిరించి ఒక చివరను నాళానికి, మరో చివరను చిన్నపేగుకే మరోచోట కలుపుతారు (కసాయ్‌ పోర్టో ఎంటెరాస్టమీ). అతికించిన పేగు గొట్టంలా పనిచేస్తూ కాలేయంలోంచి పైత్యరసం బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ శస్త్రచికిత్సను 6-8 వారాల లోపు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

2 పైత్యనాళ తిత్తి: కొందరికి పుట్టుకతోనే కాలేయంలోంచి బయటకు వచ్చే నాళాల గోడలు బలహీనంగా ఉంటాయి. దీంతో నాళం తిత్తిలాగా ఉబ్బిపోతుంది. దీన్నే కోలిడోకల్‌ సిస్ట్‌ అంటారు. క్లోమం నుంచి వచ్చే నాళం, పైత్యనాళం కలిసేచోట ఏదైనా లోపమున్నా సమస్యకు దారితీయొచ్చు. క్లోమరసం కొంత పైత్యనాళంలోకి చేరుకొని గోడను దెబ్బతీస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా నాళాన్ని దెబ్బతీయొచ్చు. దీంతో నాళం బలహీనపడిన చోట తిత్తిలాగా ఉబ్బిపోవచ్చు. ఫలితంగా పైత్యరసం కిందికి వెళ్లకుండా అక్కడే నిల్వ ఉండిపోతుంటుంది. కోలిడోకల్‌ సిస్ట్‌ను అల్ట్రాసౌండ్‌ ద్వారా గుర్తిస్తారు. అవసరమైతే ఎంఆర్‌ఐ, ఎంఆర్‌సీపీ కూడా చేస్తారు.
చికిత్స: దీన్ని శస్త్రచికిత్స చేసి సరిదిద్దాల్సి ఉంటుంది. ఇందులో తిత్తిలా ఉబ్బిన భాగాన్ని తొలగించి ఆ నాళాన్ని ఆంత్రమూలంలోకి కలుపుతారు. నాళాన్ని నేరుగా చిన్నపేగుకీ జోడించొచ్చు.

3 చిక్కబడే పైత్యరసం: కొందరికి జన్యుపరంగానో, ఇన్‌ఫెక్షన్ల మూలంగానో నాళంలో కొన్నిచోట్ల పైత్యరసం చిక్కబడి.. అడ్డంకిగా మారుతుంది (ఇన్‌స్పిటేటెడ్‌ బైల్‌ సిండ్రోమ్‌). పైత్యరసం ఉత్పత్తి అవుతున్నా అడ్డంకి మూలంగా కిందికి రాకుండా అక్కడే ఉండిపోతుంటుంది. ఇది కామెర్లకు దారితీస్తుంది.
చికిత్స: పిత్తాశయంలోకి లోకి సన్నటి గొట్టాన్ని పంపించి, దాని ద్వారా సెలైన్‌ను వేగంగా పంపిస్తే పైత్యరసం పలుచబడి.. చిన్నపేగుల్లోకి చేరుకుంటుంది. నాళం శుభ్రపడుతుంది.

4 శిశు కాలేయవాపు (నియోనేటల్‌ హెపటైటిస్‌): కాలేయవాపు సైతం తీవ్ర కామెర్లకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం జెయింట్‌ సెల్‌ హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌. రెండు వారాలు దాటినా తగ్గని కామెర్లలో 63% కేసులు దీంతో ముడిపడినవే. అలాగే గర్భధారణ సమయంలో తల్లికి వచ్చే ‘టార్చ్‌’ ఇన్‌ఫెక్షన్లూ కాలేయవాపునకు దోహదం చేయొచ్చు. వీరికి రక్తపరీక్ష చేస్తే ఆయా వైరస్‌లకు సంబంధించిన యాంటీబోడీలుంటే బయటపడతాయి. కాలేయంలో బిల్‌రుబిన్‌ మార్చే ఎంజైమ్‌లు లోపించటం వల్ల కూడా కాలేయ కణాలు దెబ్బతిని శిశు కాలేయవాపు రావొచ్చు. దీనికి కాలేయం నుంచి ముక్కను తీసి పరీక్షించి సమస్యను నిర్ధరిస్తారు.
చికిత్స: కాలేయానికి దన్నుగా నిలిచే చికిత్సలు మేలు చేస్తాయి. యుర్సోడీయాక్సీకోలిక్‌ యాసిడ్‌ ఇస్తే పైత్యరస ప్రవాహం పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లతో కాలేయ కణాలు ఉబ్బుతాయి. కణాల గోడలు దెబ్బతింటాయి. అందువల్ల అవసరమైతే వీరికి స్టిరాయిడ్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి పైత్యనాళాలను తెరచుకునేలానూ చేస్తాయి.

5 నిల్వ సమస్యలు: కాలేయంలో కొన్ని ఎంజైమ్‌ల లోపాల వల్ల లైకోజెన్‌, కొవ్వుల వంటివి బయటకు వెళ్లిపోకుండా అక్కడే ఉండిపోవటమూ సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. దీనికి ఆయా ఎంజైమ్‌లను ఇస్తే సమస్య కుదురుకుంటుంది.

6 రక్తకణాల లోపాలు (హిమోలైటిక్‌ డిజార్డర్స్‌: ఎర్ర రక్తకణాల పైపొర లోపాలు (సికిల్‌సెల్‌), హిమోగ్లోబిన్‌ లోపాలు (థలసీమియా), రక్తకణాల్లోని ఎంజైమ్‌ల లోపాలు (జీ6పీడీ లోపం) గలవారిలోనూ రక్తకణాల జీవనకాలం తగ్గిపోయి బిల్‌రుబిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇదీ కామెర్లకు దారితీస్తుంది. ఆయా సమస్యలకు చికిత్స చేస్తే కామెర్లు కూడా తగ్గుతాయి.

ఎప్పుడు ప్రమాదకరం?

  కామెర్లతోనే పుట్టటం: రెండో రోజున లేదా మూడో రోజున శిశు కామెర్లు మొదలవుతుంటాయి. ఎవరికైనా పుట్టుకతోనే కామెర్లు ఉంటే ప్రమాదకరంగా భావించాలి.
2 వారాలైనా తగ్గకపోవటం: శిశు కామెర్లు వారం, పది రోజుల్లో తగ్గిపోతాయి. ఒకవేళ 2 వారాలు దాటినా నయం కాకపోతే తీవ్రంగా పరిగణించాలి.
వేగంగా ముదరటం: రక్తంలో బిల్‌రుబిన్‌ మోతాదులు 24 గంటల్లో 5ఎంజీ/డీఎల్‌ కన్నా అధికంగా పెరుగుతున్నా.. అలాగే 18ఎంజీ/డీఎల్‌ మేరకు పెరిగినా ప్రమాదకరమే.
నలతగా ఉండటం: బిడ్డ నలతగా, అలసిపోయినట్టు ఉంటున్నా ప్రమాదకరమే.
డైరెక్ట్‌ బిల్‌రుబిన్‌ ఎక్కువగా ఉండటం: రక్తంలో ఎప్పుడూ డైరెక్ట్‌ బిలురుబిన్‌ 20% కన్నా తక్కువగా ఉంటుంది. ఇది 2ఎంజీ కన్నా ఎక్కువుంటే తీవ్రంగా భావించాలి.
- ఇవన్నీ లోపల ఏదో సమస్య ఉందనటానికి సూచికలుగా గుర్తించాలి.

చికిత్స చేయకపోతే?

తీవ్ర కామెర్లకు త్వరగా చికిత్స చేయకపోతే విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. రక్తంలో ఇన్‌డైరెక్ట్‌ బిల్‌రుబిన్‌ మోతాదులు మరీ పెరిగిపోతే అవి మెదడులోకి చేరుకొని మెదడును దెబ్బతీయొచ్చు (కెర్నిక్టెరస్‌). కాలేయానికి రక్తాన్ని చేరవేసే నాళాల్లో రక్తపోటు పెరగొచ్చు (పోర్టల్‌ హైపర్‌టెన్షన్‌). ఇవన్నీ క్రమంగా కాలేయ వైఫల్యానికీ దారితీస్తాయి. కామెర్ల మూలంగా పోషణ లోపమూ తలెత్తుతుంది. సమస్య తీవ్రమవుతున్నకొద్దీ చర్మం మీద దురద ఎక్కువవుతుంది. పొట్టలో నీరు చేరటం, రోగ నిరోధకశక్తి తగ్గటం వల్ల తరచుగా ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. కాలేయంలో దీర్ఘకాలంగా పైత్యరసం పోగుపడిపోతుంటే ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది (కొలాంజైటిస్‌). దీంతో కాలేయం నెమ్మదిగా దెబ్బతింటూ గట్టిపడిపోవచ్చు. మున్ముందు క్యాన్సర్‌ కూడా తలెత్తొచ్చు. ఇక బిలియరీ అట్రీషియాకు శస్త్రచికిత్స చేసిన తర్వాత ఐదారేళ్లకు కొందరిలో కాలేయ మార్పిడి చేయాల్సిన పరిస్థితి కూడా తలెత్తొచ్చు. ఎందుకంటే నాళానికి చిన్నపేగును కలిపిన చోటుకు దూరంగా ఉన్న భాగం సరిగా పనిచేయకపోవటం వల్ల అది వృద్ధి చెందదు. ఇలాంటివారికి కాలేయ మార్పిడి చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స విఫలం కావొచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో గత్యంతరం ఉండదు. కాబట్టి పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకోకుండా సమస్యను ముందే గుర్తించి, త్వరగా చికిత్స చేయించటం ఉత్తమం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు