ఏమిటీ సిరల ఉబ్బు?

అందంగా, నున్నగా ఉండాల్సిన కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బిపోతే? వంకర్లు తిరిగిపోయి.. నీలం చారల మాదిరిగా పైకి స్పష్టంగా కనిపిస్తుంటే? .....

Published : 28 Mar 2017 01:33 IST

ఏమిటీ సిరల ఉబ్బు?

అందంగా, నున్నగా ఉండాల్సిన కాళ్ల మీద రక్తనాళాలు ఉబ్బిపోతే? వంకర్లు తిరిగిపోయి.. నీలం చారల మాదిరిగా పైకి స్పష్టంగా కనిపిస్తుంటే? చూడటానికి ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టే కాళ్లలోని సిరల ఉబ్బు (వెరికోజ్‌ వీన్స్‌) కనబడగానే ఆందోళన మొదలవుతుంది. నిజానికిది తీవ్రమైన సమస్యేమీ కాదు. అంతమాత్రాన తేలికగా తీసుకోవటాకీ లేదు. సమస్య దీర్ఘకాలం కొనసాగితే, సరైన చికిత్స తీసుకోకపోతే కాళ్లు, మడమల వాపు.. చర్మం రంగు మారటం, పుండ్లు పడటం వంటి వాటికీ దారితీయొచ్చు. అసలు కాళ్లలోని సిరలు ఎందుకు ఉబ్బుతాయి? దీనికి ప్రధాన కారణం సిరల కవాటాలు సరిగా పనిచేయకపోవటం వల్లనే. గుండెలో మాదిరిగానే మన కాళ్లలోని సిరల్లోనూ కవాటాలుంటాయి. చాలా సూక్ష్మంగా ఉండే ఇవి కాళ్లలోని రక్తాన్ని గుండెకు చేరవేటయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒకసారి రక్తం పైకి వెళ్లగానే ఇవి గట్టిగా మూసుకుపోతాయి. దీంతో రక్తం తిరిగి కిందికి జారకుండా పైకి వెళ్తుంది. కానీ వెరికోజ్‌ వీన్స్‌ గలవారిలో ఈ కవాటాలు పూర్తిగా మూసుకుపోవు. దీంతో కొంత రక్తం లీకై వెనక్కి వచ్చేస్తుంటుంది. ఈ రక్తం అలా అక్కడే ఉండిపోవటం వల్ల క్రమంగా సిరలు ఉబ్బటం మొదలవుతుంది. పైగా ఈ రక్తంలో కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల సిరలు నీలం రంగులోనూ కనబడతాయి. గంటల కొద్దీ అదేపనిగా నిలబడటం లేదా కూచోవటం.. వయసు మీద పడటం, వూబకాయం, గర్భం ధరించటం వంటి పలు అంశాలు సిరలు ఉబ్బటానికి దోహదం చేస్తాయి. దీంతో మొదట్లో పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు గానీ సమస్య తీవ్రమైన కొద్దీ నొప్పి, కాళ్లు బరువుగా అనిపించటం, మంట, చిరచిరలాడటం, పిక్కలు పట్టేయం, కాళ్ల వాపు వంటివి తరచుగా వేధిస్తాయి. సిరల ఒత్తిడి మూలంగా చర్మం దెబ్బతిని పుండ్లు పడొచ్చు, ఇన్‌ఫెక్షన్లు కూడా తలెత్తొచ్చు. నొప్పి వంటి లక్షణాలేవీ లేకపోతే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కాళ్లకు బిగుతుగా ఉండే ప్రత్యేకమైన సాక్స్‌ ధరించటం, కూచున్నప్పుడు కాళ్లు పైకి ఉండేలా చూసుకోవటం ద్వారా సమస్యను చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. లక్షణాలు తీవ్రమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది. సిరలను పూర్తిగా మూసేయటం ద్వారా ఇది దాదాపు పూర్తిగా నయమవుతుంది. ఇందుకోసం ప్రస్తుతం లేజర్‌ వంటి పద్ధతులూ అందుబాటులో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని