Food - Health: ఆబగా కాదు.. ఆశతో తిందాం... బుద్ధిగా కాదు.. బుర్రతో తిందాం!

పోషకాహారమంటే? ఆకులూ అలమలూ.. గింజలూ కందమూలాలే అనుకోనక్కర్లేదు! మనందరిలో ఉన్న పెద్ద అపోహ ఇది. పోషకాహారం అంటే రుచిగా ఉండదనీ.. రుచిగా ఉండేదాన్లో పోషకాలుండవనీ... చాలామంది నమ్మకం. కానీ ఇంతకు మించిన పెద్ద అపోహ మరోటి లేదు. 

Updated : 19 Apr 2024 20:21 IST

పోషకాహారం పేరుతో ఎవరూ కష్టపడుతూ తినక్కర్లేదు.. అలాగని ఇష్టారాజ్యంగానూ తినకూడదు. తీర్మానాలు చేసుకుని మరీ బుద్ధిగా నోరుకట్టేసుకోవాల్సిన పనిలేదు.. కొద్దిగా బుర్రపెట్టి తినాలి! అంతే!! ఇదంత కష్టమేం కాదు.. అందుకే ఈ తిండి కథ ఏమిటో చూద్దాం.. రండి!!

మనందరం పోషకాహారమే తినాలి! ఆరోగ్య ప్రయోజనాలన్నీ పోషకాహారంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి దానికి మరో ప్రత్యామ్నాయమేం లేదు. పోషకాహారంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన పదార్ధాలు చాలానే ఉన్నాయి. వాటి మీద మనమే బుర్ర పెట్టటం లేదు. రెండోది- ఎంత పోషకాహారమైనా ‘అధికస్య అధికం బలం’ అనుకుంటూ తినెయ్యటానికి లేదు. మనకు ఎంత అవసరమో అంతే తినాలి. ఎంత మంచి ఆహారమైనా ఎక్కువ తింటే దాంతో దక్కాల్సిన ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ. అందుకే ఏ పదార్ధాలను తింటాం? ఎంత తింటాం? అన్నవి రెండూ కీలకమైన ప్రశ్నలే. పదార్ధాల ఎంపిక నుంచి పరిమాణం ఎంతన్న దాని వరకూ ప్రతి విషయంలోనూ మనం కొద్దిగా ‘బుర్ర’ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అందుకే పోషకాహార నిపుణులంతా దీన్నిప్పుడు ‘మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌’ అంటున్నారు! నేటికాలానికి చాలా అవసరమైన అవగాహన ఇది.

 

పోషకాలు - ఆహారం

‘ఆ.. తిండే కదా..’ అని మనం తేలిగ్గా తీసేస్తుంటాంగానీ.. ఆహారమంటే రకరకాల రసాయనాలు, వాటన్నింటి సంక్లిష్ట సమ్మేళనం! వీటిని జీర్ణం చేసుకునేందుకు మన ఒంట్లో తయారయ్యే ఆమ్లాలు, బోలెడన్ని ఎంజైములు.. ఇవన్నీ కలిసి లోపల బోలెడన్ని చర్యలు జరుపుతుంటాయి. మనం ఆహారం రూపంలో తీసుకున్న ఈ రసాయనాలు.. ఒంట్లో ఎక్కడెక్కడికి వెళ్లాలి... వీటిని ఏ కణాల వద్దకు చేర్చాలి? ఎంత చేర్చాలి? ఎప్పుడు చేర్చాలి? వంటివన్నీ నిర్ధారించేందుకు శరీరంలో నిరంతరాయంగా.. పరంపరగా.. బోలెడన్ని ప్రక్రియలు, చర్యలు ప్రతిచర్యలు జరుగుతుంటాయి. దీనికోసం లోపల భారీ యంత్రాంగం పని చేస్తుంటుంది. ఈ ప్రక్రియలన్నింటికీ ప్రకృతి సహజంగా లభ్యమయ్యే, ముఖ్యంగా ముడి పదార్ధాలు చాలా అనువైనవి, పరిణామంలో మన శరీరాలు వీటికి బాగా అలవాటుపడి.. వేటిని ఎక్కడికి పంపాలి, వేటిని బయటకు విసర్జించాలన్నది క్షుణ్ణంగా అలవరచుకున్నాయి. ‘మంచి పోషకాహారం’ అనే దానికి పునాది ఇదే! మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్దాలు, మాంసకృత్తులు, పీచు వంటివే కాదు.. రకరకాల విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి, ఉండాలి కూడా! మనం ఎన్ని రకాల విటమిన్‌ మాత్రలు, టానిక్కులు తాగినా.. అవేవీ కూడా ఈ సహజమైన ఆహార పదార్ధాల దరిదాపుల్లోకి కూడా రావు. అందుకే మనం ఏదో దొరికింది తినెయ్యటం కాదు.. పోషకాలు దండిగా ఉండే పోషకాహారం తినాలి!

నిండిందా?లేదా?

నిదానంగా.. నమిలి తినటం వల్ల మనసులో- మనం ఎంత తింటున్నాం, ఆకలి తీరిందా? లేదా? అన్న ఆలోచన, అవగాహన ఉంటాయి. మనం అలా తినేస్తూనే ఉండకుండా.. తినేప్పుడు మన శరీరం ఇస్తున్న సంకేతాలను పట్టించుకుంటూ ఉండాలి. కడుపు నిండిన సంకేతాలు మెదడుకు వెళ్లి, మనకు ఆ భావన (సెటైటీ) కలగటానికి కొద్దిసమయం పడుతుంది. మనం దానికా సమయం ఇవ్వకుండా వేగంగా తినేస్తుంటే.. అవసరాన్ని మించి చాలా ఎక్కువ తిన్న తర్వాత.. ఎప్పుడోగానీ పొట్ట ‘ఫుల్‌’ అయినట్లనిపించదు. దీనివల్ల జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుంది. అదే మనం మెల్లగా, మనసుపెట్టి తింటుంటే.. ఈ సంకేతాలు మెదడుకు చేరతాయి. మనం కూడా శరీరం ఇచ్చే సంకేతాలను గ్రహించి, వెంటనే ఆపేసే వీలుంటుంది. ఆకలి తీరినట్లు అనిపించగానే ఆపెయ్యటం... అన్నింటిలోకీ కీలకం!! కడుపు నిండుతున్నట్టు అనిపిస్తున్నా కూడా తింటూనే ఉండటం సరికాదు. రెండోది- ఆహారం జీర్ణం కావటమన్నది ఎక్కడో పొట్టలోకి వెళ్లిన తర్వాతే కాదు.. నోట్లో, మనం నములుతున్నప్పుడే ఆరంభమవుతుంది. కొన్ని పదార్ధాలు నోట్లో, లాలాజలంతో కలుస్తున్నప్పుడే జీర్ణమవటం మొదలుపెడతాయి. కాబట్టి మనసుపెట్టి.. నిదానంగా నమిలి తినటం అన్ని రకాలా ప్రయోజనకరం!

ఆహారమే మందా?

మనకు క్యాన్సర్‌ లాంటి కొన్నికొన్ని జబ్బులు జన్యుపరంగా రావచ్చు. మనలో పుట్టుకతోనే ఆ రకమైన జన్యు స్వభావం ఉన్నా.. ఆ స్వభావం బయటపడకుండా.. అంటే చాలాకాలం ఆ జబ్బు రాకుండా చూసే శక్తి మనం తినే ఆహారానికి ఉంటుంది! అందుకే ఆధునిక వైద్యరంగం ఆహారాన్ని కూడా ఒక రకంగా ఔషధంగానే పరిగణిస్తోంది. క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల వంటివాటన్నింటికీ జన్యువుల్లో ఎంతోకొంత మూలాలుంటాయి. మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసేసుకుంటే ఆ జన్యుస్వభావం ముందే బయటపడొచ్చు. చక్కటి పోషకాహారం తీసుకోవటం ద్వారా వాటిని మనం చాలాకాలం పాటు వాయిదా వేసుకోవచ్చు. ఒక్కోసారి జీవితాంతం కూడా వాయిదా వేసుకోవచ్చు.

ఇలా ఉండాలి.. మన పళ్లెం.. మన తిండి

అన్నింటికీ అదే..

ఏదో ఒక జబ్బు రాకుండానే కాదు.. చాలా రకాల జబ్బులకు ఒకటే విరుగుడుంది. అదే పోషకాహారం. మంచి పోషకాహారం తీసుకునే వారికి గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం.. ఇలా చాలా రకాల జబ్బులు అంత తేలికగా దరిజేరవు. ఒకవేళ ఈ జబ్బులేవన్నా తొలి దశలో ఉన్నా కూడా అవి ముదరకుండా చూడటానికీ పోషకాహారమే ఉపయోగపడుతుంది.

విషతుల్యాలకూ విరుగుడు!

ఎటుచూసినా రకరకాల కాలుష్యాలు, రసాయనాలు, విషతుల్యాల మధ్య ఆధునిక జీవితం క్యాన్సర్‌ వంటి నానా జబ్బుల మయం అయిపోతోందని రోజూ వార్తలు వింటూనే ఉన్నాం. అయితే ఈ జబ్బులన్నీ కూడా ఒక్కసారిగా ముంచుకొచ్చేవి కాదు. మంచి పోషకాహారం తీసుకుంటే వాటి ప్రభావాన్ని చాలా వరకూ నివారించుకోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తక్కువగా అంచనా వెయ్యొద్దు!

మాంసం చాలదా?

మాంసంలో ప్రోటీన్లు.. అంటే మాంసకృత్తులు ఎక్కువ ఉంటాయి, అది అవసరమే. అలాగే శాకాహారంలో ఎక్కువగా దొరకని బి12 వంటి విటమిన్లూ ఉంటాయి. అయితే కూరగాయలు, పండ్ల వంటి వృక్ష సంబంధ ఆహారంలో బోలెడంత పీచు, రకరకాల ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల వంటివెన్నో ఉంటాయి. ఇన్ని రకాల పోషకాలు మాంసంలో ఉండవు. పైగా మాంసంలో కొవ్వు, కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక్కటి తినేస్తే చాలదు. మాంసం, శాకాహారం రెండూ ముఖ్యమేనని గ్రహించాలి.


ఇది చేస్తే చాలు!

 • ఆకలిని బట్టే తినండి
 • నిదానంగా, నమిలి తినండి
 • కడుపు నిండినట్లనిపిస్తే ఆపెయ్యండి
 • కొద్దికొద్దిగా, ఎక్కువసార్లు తినండి
 • పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ తినండి
 • రకరకాల రంగురంగుల పండ్లు, కాయగూరలు తినండి
 • ముడిబియ్యం, ముడి ధాన్యం తినండి
 • బాగా శుద్ధిచేసిన, రిఫైన్డ్‌వి తినొద్దు
 • పంచదార, ఉప్పు బాగా తగ్గించండి
 • నూనె చాలా మితంగా వాడండి
 • తగినంత నీళ్లు రోజంతా తాగండితిండిని బట్టే!

తిండిని బ‌ట్టే!

మంచి పోషకాహారంతో

 • రోజంతా శక్తి, ఉత్సాహం
 • చక్కటి బరువుతో ఉంటారు
 • మనసు ప్రశాంతంగా ఉంటుంది
 • ముసలిరూపు త్వరగా రాదు
 • నిద్ర హాయిగా పడుతుంది
 • ముఖ్యంగా జబ్బులు దరిజేరవు
 • వ్యాధులొచ్చినా ముదరవు
 • ఆయుర్దాయం పెరుగుతుంది
 • ఎముకలు దృఢంగా ఉంటాయి
 • మలబద్ధకం బెడద ఉండదు
 • మలివయసులోనూ మెరుగైన చూపు

చాలామంది ముందూవెనకా ఆలోచించకుండా.. వేగంగా ముక్కూనోటా కొట్టుకు తినేస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మనకు ఎంత ఆకలి వేస్తోంది..? ఎంత తింటున్నాం? అన్న ధ్యాసతో తినాలి. ‘మైండ్‌ ఫుల్‌ ఈటింగ్‌’లో ఇది ముఖ్య భాగం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు