Story: దుర్గయ్య స్వభావం..!

సుశర్మ మంచి పండితుడు.. ఊరూరు తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడు. మధ్యమధ్యలో మంచి మాటలు, నీతి వాక్యాలు చెబుతూ.. ప్రజలను ఆకర్షించేవాడు. ఒకసారి విశాలపురానికి ప్రవచనాలు చెప్పడానికి వెళ్లి, మూడు నెలలు అక్కడే ఉన్నాడు.

Published : 25 May 2024 00:35 IST

సుశర్మ మంచి పండితుడు.. ఊరూరు తిరుగుతూ ప్రవచనాలు చెప్పేవాడు. మధ్యమధ్యలో మంచి మాటలు, నీతి వాక్యాలు చెబుతూ.. ప్రజలను ఆకర్షించేవాడు. ఒకసారి విశాలపురానికి ప్రవచనాలు చెప్పడానికి వెళ్లి, మూడు నెలలు అక్కడే ఉన్నాడు. గ్రామస్థులే ఆయనకు ఆతిథ్యం కల్పించారు. సుశర్మ బోధనలు విన్న వారిలో ఆతిథ్యానికి ఆహ్వానించని వ్యక్తి దుర్గయ్య ఒక్కడే. అతడిని చూడగానే పిసినారేమో అనుకున్నాడు సుశర్మ. లేకపోతే.. బోధనలు అర్థం కాలేదేమో అనుకున్నాడు. ఆ మరుసటి రోజు ప్రవచనాలు ప్రారంభిస్తూ.. ‘కొన్నాళ్లుగా అబద్ధం ఆడకూడదని, ఇతరులకు సహాయపడాలని చెప్పుకున్నాం. వాటిని పాటించిన వారెవరో.. ఏయే మంచి పనులు చేశారో.. చెబుతారా?’ అన్నాడు సుశర్మ. ఒక్కొక్కరూ నిలబడి వాళ్లు చేసిన మంచి పనులు చెప్పడం ప్రారంభించారు. ‘పేద పిల్లలకు దుస్తులు పంచాను.. మా ప్రాంతంలో తాగు నీటికి కష్టాలు పడుతున్న ప్రజలకు బావి తవ్వించాను.. ముసలి దంపతులకు వైద్య సహాయం అందించాను.. గుడిసెల్లోని పిల్లలకు దీపపు బుడ్డీలు అందించాను..’ అని ఇలా చాలా చెప్పారు. ఆ మాటలు విని అందరినీ అభినందించాడు సుశర్మ.

ఆ తర్వాత కాసేపటికి.. దుర్గయ్యను పిలిచి ‘నువ్వు చేసిన పనులేంటో చెప్పు’ అని అడిగాడు సుశర్మ. దానికి అలాంటివేమీ లేవని బదులిచ్చాడు దుర్గయ్య. ‘నా పని చేసుకుంటూ.. కుటుంబాన్ని పోషించడానికే సరిపోతోంది. ఇంకా సమయముంటే మీ వంటి మహనీయుల మాటలు వింటాను’ అన్నాడతను. దాంతో అక్కడున్న వారంతా నవ్వారు. అప్పుడు సుశర్మ కల్పించుకొని.. ‘నువ్వు చెప్పిన అంశాలన్నీ నీ బాధ్యత. నీకు ఎలాంటి సంబంధం లేని వాళ్లకు చేసిందే సాయం’ అన్నాడు. ‘నాకున్న కొద్దిపాటి ఆదాయంతో పెద్ద కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంది’ అని మళ్లీ అన్నాడు దుర్గయ్య. ‘అంత పెద్ద కుటుంబమా?’ అని కాస్త వ్యంగ్యంగా అడిగాడు సుశర్మ. ‘అవును! నలుగురు పిల్లలు, పన్నెండు మంది పెద్దలు’ అని బదులిచ్చాడతను. అవునా.. అంటూ సుశర్మ ఆశ్చర్యపోయాడు. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వచ్చి.. ‘తాతయ్య కళ్లు తిరిగి పడిపోయాడు’ అని చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు దుర్గయ్య. అతను వెళ్లిపోయాక.. ‘నిజంగా తను చెప్పింది నిజమేనా? అతనికి అంత పెద్ద కుటుంబం ఉందా?’ అని గ్రామస్థులను అడిగాడు సుశర్మ. అప్పుడొక పెద్దాయన.. ‘దుర్గయ్యది పొరుగూరు.. అతడొక అనాథ.. అని ఎవరో అంటుంటే విన్నాను’ అని చెప్పాడు. దాంతో.. దుర్గయ్య మీద పట్టలేనంత కోపం వచ్చింది సుశర్మకి.

అసలు విషయమేంటో కనుక్కొని.. కళ్లు తిరిగి పడిపోయిన వ్యక్తికి వైద్యం చేయడానికి దుర్గయ్య ఇంటికి బయలుదేరాడు సుశర్మ. వెంటనే అతనికి వైద్యం చేసి.. దానికి తగిన మూలికలు ఇచ్చాడు. కాసేపటికి పెద్దాయన ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అప్పుడు సుశర్మ.. ‘సహాయం చేయకపోతే చేయకపోయావు.. కానీ కుటుంబం ఉందని అబద్ధం చెప్పడం తప్పు కదా! అని దుర్గయ్యని అడిగాడు. దానికి.. అవునన్నాడు దుర్గయ్య. కాదన్నాడు వైద్యం పొందిన వృద్ధుడు. ‘మళ్లీ అబద్ధం చెబుతున్నావా?’ అని కోపంగా అడిగాడు సుశర్మ. ‘ఇక్కడున్న వారితో దుర్గయ్యకి ఏ బంధుత్వం లేదు. మా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే.. ఈ దుర్గయ్య మాకు ఆశ్రయం కల్పించాడు.. ఇదొక ఆశ్రమం’ అన్నాడు ఆ వృద్ధుడు. దాంతో ఆశ్చర్యపోయిన సుశర్మ.. ‘ఇంత మందికి ఆశ్రయం కల్పించి.. ఇతరులకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నానని చెప్పావెందుకు?’ అని అడిగాడు. ‘వాళ్లంతా నా కుటుంబ సభ్యులు అనుకున్నప్పుడు సహాయమెలా అవుతుంది? అలాగే చేసిన మేలుని ప్రచారం చేయొద్దని, మీ మాటల్లో విన్నాను.. అదే పాటించాను’ అన్నాడు దుర్గయ్య. అప్పుడు సుశర్మ.. ‘నా ప్రవచనాలు మిగతా వారంతా కేవలం వింటున్నారు. దుర్గయ్య మాత్రం ఆచరిస్తున్నాడు’ అని చాలా సంతోషించాడు. దుర్గయ్యను మనస్ఫూర్తిగా మెచ్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాడు సుశర్మ.

 నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని